RRR: నాటు నాటు.. 80 వెర్షన్స్‌.. 18 టేక్‌లు.. పాట వెనుక జరిగింది ఇదీ!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) వరించింది. ఈనేపథ్యంలో ‘నాటు నాటు’కు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి చిత్రబృందం గతంలో ఏం చెప్పిందంటే.

Published : 11 Jan 2023 10:50 IST

హైదరాబాద్‌: భారతీయ సినీ ప్రేక్షకులకు ‘RRR’ తీయని కబురు అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్‌‌’ (Golden Globes) అవార్డు ఈ  చిత్రానికి వరించింది. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ పాట వెనుక చిత్రబృందం ఎంతో కష్టపడింది. ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికర విషయాలను దర్శకుడు రాజమౌళి (Rajamouli) గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌ (Ram Charan) లపై ఓ మాస్‌ సాంగ్‌ తీయాలని అనుకున్నాం. సినిమాలోని పాటలన్నింటికీ ఇది భిన్నంగా ఉండాలని భావించాం. ఈ పాటను యుద్ధానికి ముందు ఉక్రెయిన్‌లో చిత్రీకరణ చేశాం. పాటలో కనిపించే భవనం నిజమైనదే. అది ఉక్రెయిన్‌ అధ్యక్షుడిది. ఆ ప్యాలెస్‌ పక్కనే పార్లమెంట్‌ భవనం కూడా ఉంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఒకప్పుడు టెలివిజన్‌ యాక్టర్‌ కావడంతో మేము అడగగానే పాట చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. నిజంగా అది మా అదృష్టమే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జెలెన్‌స్కీ అధ్యక్షుడు కాకముందు ఒక టెలివిజన్‌ సిరీస్‌లో ఆయన అధ్యక్షుడి పాత్ర పోషించారట’’ అని రాజమౌళి తెలిపారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్‌ చక్కటి తెలుగు పదాలతో సాహిత్యం అందించారు. ఇక రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) కాల భైరవ (Kaala Bhairava)లు తమ గానంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.  ప్రేమ్‌ రక్షిత్‌ (Prem Rakshith) కొరియోగ్రఫీ చేశారు. గతంలో చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాటు నాటు’లో హుక్‌ స్టెప్‌ కోసం 80కి పైగా వేరియేషన్‌ స్టెప్స్‌ను ప్రేమ్‌ రక్షిత్‌ బృందం రికార్డు చేసిందట. చివరకు భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిపే స్టెప్‌ను ఓకే చేశారు. చిత్రీకరణ సమయంలో ఇద్దరు హీరోలు సింక్‌ అయ్యేలా స్టెప్‌ రావడానికి 18 టేక్‌లు తీసుకున్నారట. తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కగా డ్యాన్స్‌ చేయగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ టాప్‌లో ఉంటారు. అలాంటి వాళ్లే 18 టేక్‌లు తీసుకున్నారంటే పాట పర్‌ఫెక్ట్‌గా రావడానికి రాజమౌళి ఎంతలా పరితపించారో అర్థం చేసుకోవచ్చు. హీరోలిద్దరూ స్టెప్స్‌ వేస్తుంటే అందుకనుగుణంగా దుమ్ము లేవటం లేదని రాజమౌళి రీటేక్‌ చేయించారని సినిమా ప్రమోషన్స్‌ సమయంలో ఎన్టీఆర్‌ పంచుకున్నారు.

‘గోల్డెన్‌ గ్లోబ్‌’ రావడంతో చిత్రబృందం, భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పాట ‘ఆస్కార్‌’ షార్ట్‌లిస్ట్‌లోనూ ఉత్తమ సాంగ్‌ విభాగంలో చోటు దక్కించుకుంది.  ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని