Director Sagar: ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
సినీ పరిశ్రమకు ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి. సాగర్ అనే పేరుతో ఆయన తెలుగువారికి సుపరిచితులయ్యారు. తన సినీ కెరీర్ గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: అనుకోని విధంగా సినీరంగంలోకి అడుగుపెట్టి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు సాగర్ (Sagar). యాక్షన్ తరహా చిత్రాలతో సినీ ప్రియులను కొన్నేళ్ల పాటు అలరించిన ఆయన గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ గురించి సాగర్ వివిధ సందర్భాల్లో పంచుకున్న విశేషాలు..!
కాలేజీలో గొడవలు..!
‘‘మాది గుంటూరు జిల్లా మంగళగిరి. పెరిగిందంతా అక్కడే అయినప్పటికీ చదువుకున్నది మాత్రం మద్రాస్‌లోనే. మా నాన్న నిడమర్రులో మునుసబుగా పనిచేసేవారు. మద్రాస్‌లోనైతే చదువు బాగుంటుందని ఆయన భావించారు. అలా మేము మద్రాస్‌లో సెటిలయ్యాం. అప్పట్లో పాండిబజార్‌లో తెలుగువారిని ఎగతాళి చేసేవాళ్లు. ఆ కామెంట్స్ విని నాకు కోపం వచ్చేసేది. దాంతో గొడవలు జరిగేవి. స్కూల్‌లోనూ మాది చాలా పెద్ద బ్యాచ్. తెలుగువాళ్లను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే గొడవకు వెళ్లేవాడిని. దాంతో అందరూ నన్ను డాన్ అని పిలిచేవారు’’
సినిమాల్లోకి.. అస్సలు అనుకోలేదు..!
‘‘సినిమాల్లోకి రావాలని నేను అస్సలు అనుకోలేదు. నేను సరిగ్గా చదివేవాడిని కాదు. అతి కష్టంగా ‘యస్.ఎస్.ఎల్.సీ’ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం వెతుకుతోన్న సమయంలో సినిమాపై నాకున్న ఆసక్తి చూసి.. పరిశ్రమకు సంబంధించిన ఏదో ఒక విభాగంలో చేర్పించాలని మా అమ్మ భావించింది. దాని కోసం ఇండస్ట్రీలో ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేస్తున్న ఒకాయనను మా అమ్మ నా గురించి సాయం అడిగింది. నేను పరిశ్రమకు ఏ మాత్రం పనికిరానని ఆయన విమర్శలు చేశాడు. ఎలాగైనా పరిశ్రమలోకి అడుగుపెట్టాలని, ఆయనకంటే ఒక మెట్టుపైనే ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నా. 1969లో శ్రీహరిగారి దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరాను. ఆయన దగ్గరే 2 సంవత్సరాలు పనిచేశాను. 15, 20 సినిమాలకు ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశా’’
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్..!
‘‘పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో దర్శకత్వంలోనూ రాణించాలనుకున్నా. సూపర్‌స్టార్ కృష్ణతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో నరేశ్, విజయశాంతి ప్రధాన తారాగణంగా ‘రాకాసి లోయ’ తెరకెక్కించాను. అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సుమన్, భానుచందర్‌తో ‘డాకు’ తీశాను. ఓ ఆంగ్ల సినిమా ప్రేరణతో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అలా రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో అందరూ నన్ను యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా అనుకునేవారు’’
భారీ మూల్యం.. సినిమాలు మానేయాలనుకున్నా..!
‘‘నరేశ్ - మనో చిత్రల కాంబోలో 1986లో ‘మావారి గోల’ అనే చిత్రాన్ని తెరకెక్కించాను. హాస్యభరితమైన ఈ చిత్రానికి నేనే నిర్మాతగానూ వ్యవహరించాను. తీరా చూస్తే సినిమా ఫ్లాప్. దాచుకున్నదంతా పోయింది. చేసేది లేక సినిమాలు మానేయాలనుకున్నా. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే తట్టుకోలేకపోయేవారు’’
చిరంజీవిని కలవలేకపోయా..!
‘‘చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆయన్ని కలిసి.. నిర్మాతగా చేస్తానని చెప్పాను. దానికి ఆయన అంగీకరించారు. అలా జరిగిన కొంతకాలానికి నేను ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ చిత్రాన్ని తెరకెక్కించాను. భానుచందర్ హీరోగా ఈ సినిమా విడుదలైంది. ఆ సమయంలో చిరంజీవి నటించిన ‘స్టూవర్టుపురం పోలీసుస్టేషన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి సినిమాకు పోటీగానే.. అదే కథతో నేనూ సినిమా చేశానని అందరూ మాట్లాడుకున్నారు. పలు కథనాలు కూడా వచ్చాయి. ఆ మాటలు విన్నాక.. ఆయన్ని కలవలేకపోయాను’’
వినాయక్, శ్రీనువైట్ల నా శిష్యులే..!
‘‘టాలెంట్ ఉన్న వారిని వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. వినాయక్, శ్రీనువైట్లలో మంచి టాలెంట్ ఉంది. ఏదైనా సరే చక్కగా నేర్చుకునేవాళ్లు’’
ఆ కమెడియన్‌పై చేయిచేసుకున్నా..!
‘‘ఎం.ఎస్.నారాయణ మంచి రచయిత. అప్పట్లో సినిమా వాళ్లకు కథలు చెప్పి సంపాదించేవాడు. ఆ క్రమంలోనే హాస్యనటుడిగానూ పరిచయమయ్యాడు. నా సినిమాల్లోనూ నటించాడు. ఓసారి నా సినిమా కోసం అతడు పనిచేశాడు. తనకు డబ్బు అవసరం ఉందని.. సాయంత్రం కల్లా డబ్బు ఇవ్వమని నిర్మాతను అడిగాడు. నిర్మాత ఇస్తానని మాటిచ్చాడు. అయితే, మధ్యాహ్నం పూట భోజనం చేస్తూ నిర్మాత గురించి అమర్యాదకరంగా మాట్లాడాడు. అలా అనకూడదని ఎంతసేపు చెప్పినా మాట వినలేదు. దాంతో నేను చేసేది లేక ఎం.ఎస్.నారాయణపై చేయి చేసుకోవాల్సి వచ్చింది’’
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి