Thupaki: విజయ్‌ ‘తుపాకి’కి పదేళ్లు.. సినిమా హిట్‌ వెనుక ఉన్న ఆసక్తికర కారణాలు..!

విజయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘తుపాకి’ సినిమా విడుదలై 10 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. 

Published : 13 Nov 2022 17:43 IST

హైదరాబాద్‌: తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌  కథానాయకుడిగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తుపాకి’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక.  విజయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విజయ్‌. ఓ సైనికుడు ఎప్పటికీ తన విధులనూ నిర్వర్తిస్తూనే ఉంటాడు అనే నేపథ్యంతో సాగిన ఈ కథ ధియేటర్లలో విడుదలై నేటికి(November 13) పది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ కథకు స్క్రీన్‌ప్లే పెద్ద బలం అని చెప్పాలి. హీరో, విలన్‌లు ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ సాగే సన్నివేశాలను, బాంబు దాడి సన్నివేశాలు ఎంతో ఉత్కంఠగా చిత్రీకరించారు దర్శకుడు మురగదాస్‌. ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లి సరదాగా గడిపేలా చేశారు. ఇక విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ల నటన ఈ సినిమాకు మరో హైలైట్‌. మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. రొమాంటిక్‌ సీన్స్‌లో గానీ కామెడీ సీన్స్‌లో గానీ మంచి వినోదాన్ని పంచారు.

ఇక తుపాకి సినిమాలోని పాటలు కూడా కుర్రకారును హోరెత్తించాయి. కొన్ని పాటలు అయితే చాలామంది ఫోన్‌లలో రింగ్‌టోన్‌లుగా మార్మోగాయి. ఈ సినిమాలోని ‘గూగుల్‌ గూగుల్‌..’ పాట విజయ్‌ స్వయంగా పాడి అలరించాడు. ఇక ఈ తుపాకి విజయం సాధించడానికి సంగీతం కూడా ప్రధానపాత్ర పోషించింది.

సినిమా హిట్‌ అవ్వడానికి హీరో ఎంత ముఖ్యమో విలన్‌ పాత్ర కూడా అంతే ముఖ్యం. తుపాకి సినిమాలో ప్రతినాయకుడిగా విద్యత్‌ జమ్వాల్‌(Jammwal) టెర్రరిస్ట్‌ పాత్రలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా విజయ్‌తో పాటు పోటీపడే సన్నివేశాలకు అయితే థియేటర్లు చప్పట్లతో మార్మోగాయి. బలమైన విరోధి ఈ సినిమా విజయంలో బలమైన పాత్ర పోషించాడని చెప్పడంలో సందేహం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని