The Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ గురించి ఆసక్తికరమైన అంశాలు

Published : 16 Mar 2022 02:06 IST

ఐదుకి ఐదు రేటింగ్‌లు... అడక్కుండానే రాష్ట్రాల వినోదపన్ను రాయితీలు... చిన్న సినిమాగా రికార్డుల కలెక్షన్లు... ఇంతేనా... ఈ చిత్రాన్ని ఆపాలంటూ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు... రెండు వర్గాల మధ్య కల్లోలం సృష్టించే చిత్రమంటూ విమర్శలు... ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. సృష్టిస్తున్న సంచలనాలివీ... ఇంతకీ ఇందులో ఏముంది? జనాల నోళ్లలో ఎందుకు తెగ నానుతోంది?

‘ది కశ్మీర్‌ ఫైల్స్’‌.. ప్రేక్షకుల్ని ఊహాలోకంలో ముంచెత్తే మెలోడ్రామా కాదు.. పాటలు, ఫైట్లు, భారీ సెట్టింగుల మసాలాలు దట్టించి వండివార్చిన వాణిజ్య చిత్రం అసలే కాదు. చెదిరిన కలలకు.. కల్లోలమైన లక్షల జీవితాలకు తెర రూపం. తమను తాము చూసుకొని, ఎప్పుడో మర్చిపోయిన తమ మూలాల్ని గుర్తు తెచ్చుకొని కొందరు థియేటర్లలోనే వెక్కివెక్కి ఏడుస్తున్న వాస్తవ సంఘటనల రూపం. 1990లలో జమ్మూ-కశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు చెలరేగింది. అల్లరిమూకలు చెలరేగిపోయాయి. తుపాకులతో స్వైర విహారం చేశాయి. కశ్మీరీ హిందువులపై దాడికి తెగబడుతూ నరమేధం సృష్టించాయి. ఆ దారుణాల్ని తట్టుకోలేక కట్టుబట్టలతో సొంత ఇంటినీ, ఆస్తుల్నీ, బంధుత్వాల్నీ.. వదిలి వలస వెళ్లిపోయాయి ఎన్నో కుటుంబాలు. ఆ కన్నీటి వెతల రూపమే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌. ‘చరిత్రలోని అత్యంత అమానవీయమైన నెత్తుటి సంఘటనల్లోకి నిజాయతీగా ఒక్కసారి తొంగిచూడటమే నా సినిమా’ అంటూ షూటింగ్‌ మొదలైన మొదటిరోజే ప్రకటించాడు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. అతడి ఆలోచనల్లో పుట్టి, తెర రూపం దాల్చిన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది.

ఎవరెలా నటించారు?

పుష్కర్‌నాథ్‌గా అనుపమ్‌ఖేర్‌ ఏడిపించాడు. దగాబడ్డ భూమిపుత్రుడిగా, సర్వం కోల్పోయి జీవితాంతం వగిచే కశ్మీరీ పండిట్‌గా తన నటనని శిఖరాగ్రానికి తీసికెళ్లిపోయాడని అంతా ప్రశంసిస్తున్నారు. నవతరం ప్రతినిధిగా దర్శన్‌కుమార్‌ సైతం పాత్రలో జీవించాడు. ముఖ్యంగా చిత్రం పతాక సన్నివేశాల్లో మెరుగైన నటన ప్రదర్శించాడు. గంభీరమైన స్వరంతో మాటల తూటాలు పేలుస్తూ.. కళ్లతోనే కోటి భావాలు పలికిస్తూ.. విద్యార్థి నాయకుడిలో తన మూలాలు వెతుక్కోవాలనే తపన రగిల్చే ప్రొఫెసర్‌ పాత్రలో లీనమైపోయింది పల్లవీ జోషి. ఈ సినిమాకి ప్రాణం స్క్రిప్టే. అనవసర డ్రామాకి చోటివ్వకుండా ప్రతి మాటా ప్రేక్షకుల గుండెల్ని తాకుతుంది. ముఖ్యంగా అనుపమ్‌ఖేర్‌ పాత్ర పలికే ఒక్కో డైలాగ్‌ ప్రేక్షకుల కళ్లలో చెమ్మ తీసుకొస్తుంది. ఆ కాలంలో రాజకీయ నాయకులు, మీడియా.. శకుని పాత్ర పోషించి చరిత్రను ఎలా వక్రీకరించిందో చాలా సన్నివేశాల్లో స్పష్టంగా చూపించాడంటూ విమర్శకులు సైతం దర్శకుడిని పొగుడుతున్నారు. ఈ సినిమాలో తప్పకుండా చెప్పుకొని తీరాల్సింది కెమెరా పనితనం. కశ్మీర్‌ అంటే భూతల స్వర్గం అన్న విషయం రుజువు చేసేలా ఎన్నో అందాల్ని కెమెరాతో బంధించారు.

చుట్టుముట్టిన వివాదాలు..

ఈ సినిమా ఎందరికో నచ్చుతోంది. మరెన్నో విమర్శలకూ గురవుతోంది. వివేక్‌ సాహసోపేతమైన కథని తెరకెక్కించాడంటూ.. అందరూ చూడాల్సిన చిత్రమంటూ హరియాణా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు అడక్కుండానే వినోద పన్నుపై రాయితీనిచ్చాయి. ఇది అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శితమవుతూ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ సినిమాని చుట్టుముట్టిన వివాదాలూ తక్కువేం కాదు. నాణేనికి ఒకవైపే చూపిస్తూ.. మమ్మల్ని విలన్లుగా చూపించారంటూ ఒక వర్గం వారు విరుచుకుపడుతున్నారు. కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన హంతకులుగా మమ్మల్ని చిత్రీకరించి, దర్శకుడు మా మనోభావాలను గాయపరిచారంటూ.. ఈ సినిమాని నిలిపివేయమని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సాంకేతిక అంశాల అభ్యంతరం చూపిస్తూ బొంబాయి హైకోర్టు ధర్మాసనం ఈ పిల్‌ని కొట్టివేసింది. కశ్మీర్‌ తిరుగుబాటు సంఘటనల సన్నివేశాల్ని తప్పుడుగా చూపించారంటూ.. భారత సాయధ దళాల్లో స్క్వాడ్రన్‌ లీడర్‌గా పని చేసి అమరుడైన ఓ సైనికుడి భార్య ఈ సినిమాపై పరువు నష్టం దావా వేసింది. కశ్మీర్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో మేం ఎన్నోసార్లు స్థానిక నేతల నుంచి బెదిరింపులు ఎదర్కొన్నామంటూ ఆరోపించింది నటి పల్లవీ. నటీనటులకు వ్యతిరేకంగా ‘ఫత్వా’ కూడా జారీ చేశారట. ఏదేమైనా.. వివాదాస్పద, వాస్తవిక కథాంశం ఎంచుకొని, తక్కువ బడ్జెట్‌లోనే సినిమా తీసినా.. కథ, కథనంలో ఎక్కడా బిగి సడలకుండా నడిపించిన తీరుకి అంతా ఫిదా అయిపోతున్నారు.

భిన్న పంథా..

ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిది మొదట్నుంచీ భిన్నమైన పంథానే. కమర్షియల్‌ హంగులకు దూరంగా ఉంటూ.. వాస్తవిక అంశాలనే కథాంశంగా ఎంచుకుంటుంటాడు. అంతకుముందు తీసిన ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’ కూడా సంచలనమే. తను సినిమా కోసం ఎంతలా తపిస్తాడంటే.. కశ్మీర్‌ ఫైల్స్‌ కోసం మొత్తం షూటింగ్‌ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు పరిశోధన చేశాడు. కశ్మీర్‌ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. తన ప్రతి సినిమాకి ఓ అర్థం, పరమార్థం ఉండాలంటాడు. సినిమా అనేది సమాజం, వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టాలంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని