రామాయణంలో రైలు.. ట్రాయ్‌లో విమానం

సినిమా షూటింగ్‌లో సందర్భంగా గుర్తించలేకపోయిన కొన్ని ఆసక్తికర విశేషాలు..

Published : 02 Jun 2023 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వందల కోట్లు వెచ్చించి భారీ సెట్‌లు వేసి సినిమా తీసినా, ఎక్కడో ఒక చోట తప్పు దొర్లిపోతుంది. ఎడిటింగ్‌ రూమ్‌కు వచ్చిన తర్వాత కానీ, అసలు విషయం బయటపడదు. అయితే కొన్ని ఆ ఎడిటింగ్‌ రూమ్‌ను కూడా దాటుకుని వెండితెరపైకి వచ్చేస్తాయి. అలాంటి సినిమాలు హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ లెక్కలేనన్ని ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మక హాలీవుడ్ ‌చిత్రం ‘బెన్‌హార్‌’(1959)లో గుర్రాల రేస్‌ జరుగుతుండగా, కారు కనిపిస్తుంది. ఇక ‘ట్రాయ్‌’ సినిమాలో ఓ యుద్ధ సన్నివేశంలో పైన విమానం ఎగురుతూ కనిపిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.

ఇక తెలుగులోనూ ఇలాంటి తప్పులు చాలానే జరిగాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో ఓ సన్నివేశంలో రైలు కనిపిస్తుంది. కొన్ని పురాణ చిత్రాల్లో తారు రోడ్లూ ఎలక్ట్రిక్‌ స్తంభాలూ కనిపిస్తాయి. ‘వినాయక చవితి’ సినిమాలో ప్రసేనుడు గుర్రం మీద వెళుతున్నడప్పుడు రోడ్డు పక్కన ఉన్న టెలిగ్రాఫ్‌ తీగలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘పాండురంగ మహత్మ్యం’లోని ఒక దృశ్యంలో సంతకం పెట్టమని తెల్లకాగితం అందిస్తారు. కాగితం అప్పుడు పుట్టలేదు! ‘భక్త తుకారామ్‌’ (అంజలి పిక్చర్స్‌)లో బస్తాలు దింపుతూ ఉంటే, బస్తాలమీద ఉన్న ఆంగ్ల అక్షరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. థియేటర్లో ఇలాంటి తప్పులు గుర్తించిన వెంటనే చిత్ర బృందం వాటిని కనిపించకుండా చేయడానికి స్వల్ప మార్పులు చేసి, మళ్లీ ఆ సన్నివేశాన్ని చేర్చడం, సినిమాను సీడీల రూపంలో విడుదల చేసే సమయంలో తప్పును పూర్తిగా తొలగించడం చేసేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని