Updated : 28 May 2022 10:19 IST

NTR Jayanthi: ఎన్టీఆర్‌ సినీ చరిత్రలో పదనిసలు

*ఎన్టీఆర్‌ నటించిన మొత్తం చిత్రాలు 295. తెలుగులో 278, తమిళంలో 14, హిందీలో 3 చిత్రాల్లో ఆయన కనిపించారు.

* తెరపై కనపడిన తొలి సినిమా 1949లో వచ్చిన ‘మన దేశం’. ఇందులో ఆయన ఇన్‌స్పెక్టర్‌ పాత్రను పోషించారు.

* హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’. 1950లో విడుదలైన ఈ సినిమాకు బి.ఎ.సుబ్బారావు దర్శకుడు.

* ఎన్టీఆర్‌ 100వ చిత్రం ‘గుండమ్మ కథ’. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. 1962 జూన్‌ 7న విడుదలై సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల అభిమానులకు పండగ తెచ్చింది.

* ఆయన నటించిన 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’. దీనికి డి.యోగానంద్‌ దర్శకుడు. ఎన్టీఆర్‌ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించిన ఘనత ఈయనదే.

* ఎన్టీఆర్‌ చివరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. చివరిగా విడుదలైన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’.

* ఎన్టీఆర్‌ దర్శకుడిగా టైటిల్‌ కార్డు పడిన మొదటి చిత్రం ‘శ్రీకృష్ణ పాండవీయం’. ‘సీతారామ కల్యాణం’, ‘గులేబకావళి కథ’ సినిమాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించినా టైటిల్స్‌లో పేరు ఉండదు. దర్శకత్వం అనే టైటిల్‌ కార్డు లేకుండానే ఈ సినిమాలు ప్రారంభమవుతాయి.

* కేవలం కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రాలు ‘ఉమ్మడి కుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’.  

* తమిళం నుంచి తెలుగులోకి డబ్‌ అయిన ‘సంపూర్ణ రామాయణం’లో ఎన్టీఆర్‌ పాత్రకు చుండ్రు సత్యనారాయణ డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

*  రామారావును డైరెక్ట్‌ చేసిన వారిలో తండ్రీకుమారులూ ఉన్నారు. 

తాతినేని ప్రకాశరావు- తాతినేని ప్రసాద్‌

కె.ఎస్‌.ప్రకాశ్‌రావు - కె.బాపయ్య, కె.రాఘవేంద్రరావు

సి.పుల్లయ్య - సి.ఎన్‌.రావు

కె.ప్రత్యగాత్మ - కె.వాసు

యముడి పాత్రలో ఎన్టీఆర్‌ తొలిసారిగా కనిపించిన చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’.

* 1978లో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు పరమాచార్య ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేశారు.

* ఎన్టీఆర్‌ నటించిన మొత్తం సినిమా వసూళ్లు రూ.250 కోట్లని ఒక అంచనా. ఈనాటి లెక్కల ప్రకారం అది వేల కోట్ల పైమాటే.

* ‘వరకట్నం’, ‘తాతమ్మ కల’.. ఇలా సమాజంలోని దురాచారాలను తన సినిమాల్లో చెప్పే ప్రయత్నం చేశారు.  

* స్క్రిప్టు సిద్ధమైనా తెరకెక్కని సినిమాలు రెండు ఉన్నాయి. అవి ‘తమ్ముడు పెళి ‘పుణ్య దంపతులు’

* ఎన్టీఆర్‌ కాలేజీలో ఉండగానే ‘కీలుగుర్రం’ సినిమాలో అవకాశం వచ్చింది. చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వస్తానని దాన్ని తిరస్కరించారు.

*  ద్విశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం ‘పాతాళ భైరవి’.

* ఎన్టీఆర్‌ రాముడిగా తొలిసారి కనిపించిన సినిమా ‘చరణదాసి’.

* రామకృష్ణా సినీ స్టూడియోస్‌ను 1976లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. అంతకుమునుపు ఆయన నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌ పేరుతో సినిమాలు నిర్మించారు.

లక్షల క్యాలెండర్ల అమ్మకం!

1957లో ఎన్టీఆర్‌ కృష్ణుడిగా నటించిన ‘మాయాబజార్‌’ విడుదలై సంచలనం సృష్టించింది. కథానాయకుడి స్థాయి నుంచి వెండితెర ఇలవేల్పుగా తారక రాముడు మారిన సంవత్సరం అది. ఒక సినీనటుడి పోస్టర్‌ గోడ మీద నుంచి పూజా మందిరాల్లోకి మారడం ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌ కృష్ణుడి వేషధారణలో ఉన్న క్యాలెండర్లు ఆ సమయంలోనే ఐదు లక్షలకు పైగా అమ్ముడుపోయాయని అంచనా.

* ఎన్టీఆర్‌ నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం ‘మాయారంభ’. ఈ సినిమా 1950లో విడుదలయింది.

ఎన్నింటికో ఆద్యుడు

* తెలుగులో మొదటి పూర్తి రంగుల చిత్రం ‘లవకుశ’. 1963లో విడుదలైంది. రాబట్టిన వసూళ్లను పత్రికల్లో ప్రకటించిన తొలి తెలుగు చిత్రం ఇదే.
* ఓపెనింగ్‌ కలెక్షన్లను ప్రకటించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం ‘అగ్గి పిడుగు’.

పాన్‌ ఇండియా ప్రభంజనం..

* పాన్‌ ఇండియ సినిమాకు ఆద్యుడు ఎన్టీఆర్‌ కావడం మరో విశేషం. భానుమతి దర్శకత్వంలో ఆయన నటించిన ‘చండీరాణి’ హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలయింది.

* ఎన్టీఆర్‌ నిర్మించిన ‘వరకట్నం’ చిత్రం జాతీయ స్థాయి ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం పొందింది.

* 1960 దశకంలో ప్రతి ఏడాదీ ఎన్టీఆర్‌ సినిమాలు పది విడుదలయ్యేవి. 1964లో ఏకంగా 16 సినిమాల్లో ఆయన నటించారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని