Titanic: డికాప్రియోకు ‘టైటానిక్‌’ పాత్ర కొద్దిలో పోయేది!

ప్రపంచవ్యాప్తంగా ప్రేమకావ్యాలు అనదగ్గ సినిమాల జాబితా తీస్తే అందులో ‘టైటానిక్‌’ ముందుంటుంది. అందులో ‘రోజ్‌’గా కేట్‌ విన్‌స్లెట్‌ నటన యువకుల్ని అలరిస్తే జాక్‌గా లియోనార్డో డికాప్రియో అంతే చలాకీ నటన ప్రదర్శించి అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు.

Updated : 04 Dec 2022 17:47 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేమకావ్యాలు అనదగ్గ సినిమాల జాబితా తీస్తే అందులో ‘టైటానిక్‌’ (Titanic) ముందుంటుంది. అందులో ‘రోజ్‌’గా కేట్‌ విన్‌స్లెట్‌ నటన యువకుల్ని అలరిస్తే జాక్‌గా లియోనార్డో డికాప్రియో అంతే చలాకీ నటన ప్రదర్శించి అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు. ఆ పాత్రలో అతడిని తప్ప మరొకర్ని ఊహించుకోలేం. కానీ తన ప్రవర్తన కారణంగా అంతటి క్లాసిక్‌ పాత్రను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు డికాప్రియో. ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ఓ పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జాక్‌ పాత్ర స్క్రీన్‌ టెస్ట్‌.. ఓ సమావేశం కోసం లియోనార్డోని పిలిచారు దర్శకుడు. చెప్పిన సమయానికి కాకుండా రెండ్రోజుల తర్వాత వచ్చాడు డికాప్రియో. అయినా ఓపిక పట్టిన కామెరూన్‌.. డికాప్రియో రాగానే చేతిలో స్క్రిప్ట్‌, సీన్‌ పేపర్లు చేతిలో పెట్టి చదవమన్నారు. అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అతగాడికి తనని కొత్తగా పరీక్షించడం నచ్చక చదవనన్నాడు. కామెరూన్‌కి చిర్రెత్తుకొచ్చింది. ప్రతీదీ పక్కాగా పాటించే, ఆయన ‘ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. బయటికి వెళ్లొచ్చు’ అని దారి చూపించారు. హీరో సైతం అంతే విసురుగా వెళ్లడానికి నాలుగు అడుగులు ముందుకు వేసి, ఓ నిమిషం ఆలోచించి వెనక్కి వచ్చాడు. ‘అంటే నేను ఇది చదవకపోతే.. నాకు సినిమాలో అవకాశం ఉండదా?’ అన్నాడు. ‘అంతేగా’ అన్నారు కామెరూన్‌. ఇక చేసేదేం లేక కామెరూన్‌ చెప్పినట్టే చేశాడు డికాప్రియో. జాక్‌ పాత్ర పురుడు పోసుకుంది. 1997లో ‘టైటానిక్‌’ విడుదలైన తర్వాత ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. లియోనార్డో రాత్రికి రాత్రే సూపర్‌స్టార్‌ అయిపోయాడు. ఈ చిత్రం 11 ఆస్కార్‌ అవార్డులు గెల్చుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని