Thalapathy Vijay: ‘దళపతి’ విజయ్‌ సైలెంట్‌గా ఉండటానికి కారణమిదే..

మన తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సహోద్యోగుల్లో కొందరు ఎక్కువగా మాట్లాడరు. అధిక ప్రసంగం ఇవ్వడానికి, వినడానికీ ఆసక్తి చూపరు. సినీ ప్రముఖుల్లోనూ కొందరు అలానే ఉంటారు....

Updated : 22 Jun 2022 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మనం చేసే పనే మాట్లాడాలి.. మనం కాదు’ అనే ధోరణితో కొందరు ముందుకెళ్తుంటారు. వాళ్లు అలా ప్రవర్తించడానికి ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అలా.. చాలా తక్కువగా మాట్లాడే నటుల్లో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ (Thalapathy) ఒకరు. తమిళ చిత్ర పరిశ్రమలో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. సినిమా సెట్స్‌లో అయినా, వేదికలపైనా ఆయన ఎక్కువగా మాట్లాడరనే విషయం తెలిసిందే. విజయ్‌ (Vijay) అలా ఉండటం వెనక ఓ చేదు ఘటన ఉంది. నేడు విజయ్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా జీవితంలోని చేదు జ్ఞాపకంపై ఆయన తల్లి శోభ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

విజయ్‌కు విద్య అనే చెల్లెలు ఉండేది. తనంటే విజయ్‌కు ఎంతో ప్రేమ. ఆమెనే ఆయన ప్రపంచం. అనారోగ్యంతో ఆమె మంచం పట్టింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. తన సోదరి చనిపోయిందన్న చేదు నిజాన్ని నమ్మలేక ‘విద్యా..’ అంటూ కేకలు వేశాడు. ఆ పెద్ద అరుపు తర్వాత ఇంకేం మాట్లాడలేదట విజయ్‌. ఆ క్షణం నుంచి ఇంట్లోవారు పలకరించినా ఏడ్చేవాడట. ఆ దుఃఖం నుంచి ఎప్పటికైనా బయటకు వస్తాడనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ, ఆ విషాదం విజయ్‌ చిన్నిగుండెలో అలాగే ముద్రించుకుపోయింది. మెల్లమెల్లగా మాట్లాడటం తగ్గించేశాడు. ఎంతో చురుకుగా, సరదాగా ఉండేవాడు ఆ ఘటనతో నెమ్మదిగా ఉండటాన్ని అలవరుచుకున్నాడు. అప్పుడు విజయ్‌ వయసు పదేళ్లు. ‘‘విద్య చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ విజయ్‌ అలానే ఉన్నాడు. కాకపోతే, చెల్లెలు చనిపోయిన ఏడాది తర్వాత వాడి ముఖాన తొలిసారి నవ్వులు తీసుకొచ్చింది మాత్రం సినిమాలే!’’ అంటారు శోభ.

‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘సర్కార్‌’, ‘విజిల్‌’, ‘మాస్టర్‌’, ‘బీస్ట్‌’లతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు విజయ్‌. అందుకే వారి కోసం నేరుగా ‘వారసుడు’ (Varasudu) అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. 2023 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని