Shaakuntalam: కలల ప్రాజెక్టు పక్కన పెట్టి.. ప్రేమకథను తీసి.. సమంత ‘శాకుంతలం’ విశేషాలివీ

సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘శాకుంతలం’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఈ సందర్భంగా దాని గురించి కొన్ని సంగతులు చూద్దాం..

Updated : 13 Apr 2023 17:35 IST

ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిగా ఎక్కువగా ఉంటుంది. ఆయా సినిమాల ప్రకటన వెలువడడమే ఆలస్యం.. పురాణ పాత్రలకు తెరపై ఎవరెవరు జీవం పోస్తారోనన్న చర్చ మొదలవుతుంది. అలాంటి అంచనాల నడుమ రూపొందింది ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం. సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్‌ (Guna Sekhar) తీసిన ఆ సినిమా ఈ నెల 14న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

  •  ‘హిరణ్య కశ్యప’ అనేది గుణ శేఖర్‌ కలల ప్రాజెక్టు. ఆ స్క్రిప్టుపై ఐదేళ్లు పనిచేశారాయన. విజువల్స్‌ విషయంలో హాలీవుడ్‌ సంస్థతోనూ కొన్నాళ్లు చర్చలు జరిపారు. సినిమా ప్రారంభించాలనుకున్న సమయానికి కొవిడ్‌ మొదలైంది.. ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయింది. మరోవైపు, వేరే ప్రాజెక్టు చేసే అవకాశంరావడంతో ఆ హాలీవుడ్‌ సంస్థ గుణశేఖర్‌తో కలిసి పనిచేసేందుకు అనాసక్తి కనబరిచింది. దాంతో ‘హిరణ్య కశ్యప’ను హోల్డ్‌లో పెట్టిన గుణశేఖర్‌ ఓ మంచి ప్రేమను తెరకెక్కించాలనే ఆలోచనలో పడ్డారు. ఆ క్రమంలో ఇతిహాసాలు చదువుతుంటే కాళిదాసు రాసిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆయన్ను బాగా ఆకట్టుకుంది. ఆ ప్రేరణతోనే ‘శాకుంతలం’ సినిమా రూపుదిద్దుకుంది.
  • తన కూతురు, ఈ సినిమా నిర్మాత నీలిమ ఇచ్చిన సలహాతోనే సమంతను నాయికగా ఎంపిక చేశారు గుణ శేఖర్‌. ‘రంగస్థలం’లోని సమంత నటన ఆయనకు బాగా నచ్చడంతో ఆ అవకాశం ఇచ్చారు. సౌందర్యరాశి.. పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చిన, విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానం కోసం పోరాడిన శకుంత పాత్రలో సమంత నటించారు. మరో ప్రధాన పాత్ర అయిన దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ (Dev Mohan) కనిపించనున్నారు. దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు (Mohan Babu), కణ్వ మహర్షిగా సచిన్‌ ఖేడ్కర్‌, మేనకగా మధుబాల, గౌతమి పాత్రలో గౌతమి, అనసూయగా అనన్య నాగళ్ల కనిపిస్తారు.
  • దుష్యంతుడి పాత్రలో పలు రకాల షేడ్స్‌ ఉంటాయని, అలాంటి క్యారెక్టర్‌లో నటించేందుకు తెలుగు హీరోలు ముందుకురారని, అందుకే దేవ్‌ మోహన్‌ను తీసుకున్నానని గుణ శేఖర్‌ తెలిపారు. ఆ హీరో సమంత కంటే ఐదేళ్లు చిన్నోడు. మలయాళంలో రెండు చిత్రాల్లో నటించిన ఆయనకు ఇంతటి భారీ ప్రాజెక్టులో అదీ అగ్ర కథానాయిక అయిన సమంత సరసన నటించే అవకాశంరావడం విశేషం. దుర్వాస మహర్షి పాత్రలో నటించేందుకు మోహన్‌బాబు అంగీకరించకపోతే ప్రాజెక్టే ముందుకెళ్లేది కాదేమోనని అన్నారు గుణ శేఖర్‌. ఆ రోల్‌ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ తనయ అర్హ ఈ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతోంది. శకుంతల తనయుడు భరతుడిగా అర్హ సందడి చేయనుంది.
  • నాటకాన్ని తెరపైకి దృశ్యకావ్యంగా తీసుకురావాలంటే ఎంతో కష్టపడాలి. అప్పటి వాతావరణం ఉట్టిపడేలా భారీ సెట్స్‌, ప్రతి పాత్రకు నగలను రూపొందించాల్సి ఉంటుంది. ఇందులోని ప్రధాన పాత్రధారుల కోసం రూ.14 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వినియోగించారు. సుమారు 15 కిలోల బంగారం వినియోగించారు. ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna)లో ఎన్టీఆర్‌ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో తన చిత్రాల్లోనూ నిజమైన బంగారు ఆభరణాలే వాడాలనుకున్నారు గుణశేఖర్‌.
  • అడవిలో పుట్టి, పెరిగిన శకుంతలకు జంతువులే స్నేహితులు. ఒకట్రెండు జంతువులయితే ఏదో విధంగా సంబంధిత సన్నివేశాలు చిత్రీకరించేవారు. వాటి సంఖ్య ఎక్కువగా ఉండడం, ఆ రోజుల్లోని కొన్ని రకాల జంతువులు ఇప్పుడు కనుమరుగైపోవడంతో చిత్ర బృందం సీజీ (గ్రాఫిక్స్‌)ని ఆశ్రయించింది. 14 ప్రముఖ స్టూడియోలు కలిసి ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్స్‌ అందించాయి.
  • ఆ వీఎఫ్ఎక్స్‌ (విజువల్‌ ఎఫెక్ట్స్‌) నేర్చుకునేందుకే ‘శాకుంతలం’లో ఓ భాగమయ్యా అని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) తన మనసులో మాట బయటపెట్టారు. ఈ చిత్రాన్ని ఆయన సమర్పిస్తున్నారు. ఆయన సలహాతోనే ఈ సినిమాని 3డీలో విడుదల చేస్తున్నారు.
  • ఈ పాత్ర సమంతకు ఓ సవాలే. ఇప్పటి వరకూ ఆమె ఇలాంటి నేపథ్యమున్న చిత్రాల్లో నటించలేదు. ‘‘సమంత ఆధునిక పాత్రలు చేసిన నటి. ఆమె పురాణ పాత్రకి తగ్గట్టుగా మారడం అంత సులభం కాదు. అయినా తగిన శిక్షణ తీసుకుని పాత్రలో ఒదిగిపోయింది’’ అనేది దర్శకుడి మాట. ఓ పాట కోసం సమంత 30 కేజీల బరువున్న లెహెంగా ధరించారు. అంత బరువున్న డ్రెస్సుతో నటించడం కష్టమనిపించినా వెనక్కి తగ్గలేదు. తనకు పూల అలర్జీ ఉన్నా పాత్రకు న్యాయం చేసేందుకు చేతికి, మెడకి వాటిని చుట్టుకోవడంతో సమంతకు దద్దుర్లు వచ్చాయి. నెలలు గడిచినా ఆ మచ్చలు పోకపోవడంతో ఆమె మేకప్‌తో కవర్‌ చేసుకున్నారట. మరోవైపు, సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో నటించడమే కాదు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముంబయి, కొచ్చిన్‌, హైదరాబాద్‌లో ప్రచారంలోనూ పాల్గొంది. విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణాలు చేస్తుండడంతో అస్వస్థతకు గురైనట్టు బుధవారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.
  • ఈ సినిమా రూ. 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని సమాచారం. ‘‘మీ సినిమా బడ్జెట్‌ ఎంత అనేది ముఖ్యం కాదు.. టికెట్‌కి నేను పెట్టే ఖర్చు ఒక్కటే కదా అంటున్నాడు ప్రేక్షకుడు. అందుకే తీస్తే నాణ్యమైన సినిమా తీయాలి, లేదంటే తీయడం మానేయాలి. ఈ నెల  14 వరకు వచ్చిన సినిమాలకి దీటుగా ఇందులో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి’’ అని గుణశేఖర్‌ ధీమా వ్యక్తం చేశారు.
  • గుణ శేఖర్‌- సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ చిత్రానికంటే ముందు ఆ కాంబోలో ‘చూడాలని ఉంది’, ‘మనోహరం’, ‘మృగరాజు’, ‘ఒక్కడు’, ‘అర్జున్‌’, ‘వరుడు’ వచ్చాయి. ‘శాకుంతలం’లోని పాటలనూ శ్రోతలు ఆస్వాదిస్తున్నారు.
  • కశ్మీర్‌, అనంతగిరి హిల్స్‌, హైదరాబాద్‌లోని గండిపేట జలాశయం, రామోజీ ఫిల్మ్‌ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్‌ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ఏడాదిపాటు ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ ఐదు నెలల్లోనే పూర్తయింది. మరో ఏడాదిన్నరపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరిగాయి. ఇప్పటికే విడుదలకావాల్సి ఉన్న ఈ సినిమా పలుమార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఈ వేసవిలో వినోదాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు నగరాల్లో ప్రీమియర్‌ షోలు ప్రదర్శితమయ్యాయి. చూసిన వారి నుంచి మంచి స్పందన వచ్చింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని