first day first show: ‘ఖుషి’ మూవీ ఫస్ట్‌ షో టికెట్ల కోసం సాహసమే ఈ మూవీ!

ప్రతిష్ఠాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో` (First Day First Show). మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కె.వి(Anudeep KV) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు..

Updated : 07 Dec 2022 19:48 IST

‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ మరో జాతిరత్నాలు మూవీలా అలరిస్తుందని దర్శకులు వంశీ, లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాంత్‌రెడ్డి, సంచిత కీలక పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇరువురు దర్శకులు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ ఎలా ఉంటుంది ?

వంశీ: ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవన్ కళ్యాణ్‌ అభిమాని. కాలేజీలో ఒక  అమ్మాయిని ఇష్టపడతాడు. చాలా రోజులు ఆ అమ్మాయి వెంటపడితే తొలిసారి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లను సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. హీరో లక్ష్యం.. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సంపాదించడం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. 

ఈ సినిమా కథ విషయంలో వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా? 

వంశీ: ‘ఖుషి’ సమయంలో నేను ఫస్ట్ క్లాస్. నా అనుభవంలో లేవు కానీ, అనుదీప్ వాళ్ళు కొన్ని అనుభవాలు చెప్పారు. టికెట్ల కోసం ఎంతదూరం వెళ్లారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా, ఫన్నీగా అనిపించింది.

‘ఖుషి’ అంటే 2001..ఈ సినిమా కోసం అప్పటి వాతావరణాన్ని సృష్టించారా?

వంశీ: చాలా అంశాలు రిక్రియేట్ చేశాం. విడుదలైన టీజర్లో మీరు గమనిస్తే అప్పటి బాక్సులు కనిపిస్తాయి. దానితో పాటు చాలా వరకు అప్పటి వాతావరణాన్ని రీక్రియేట్‌ చేశాం.

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మరో జాతిరత్నాలు అనుకోవచ్చా?

వంశీ: ఫస్ట్ డే ఫస్ట్ షో డిఫరెంట్ మూవీ. అయితే, జాతిరత్నాలు సినిమా వాతావరణం ఉంటుంది.

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టిక్కెట్ల విషయంలో మీకు అనుభవాలేమైనా ఉన్నాయా?

లక్ష్మీనారాయణ: తిరుపతిలో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరికేవి. రాత్రి మూడు గంటలకు షో ఉండేది. అలా ‘పంజా’ చూశా. చాలా మంది జనం ఉండేవారు. అప్పుడప్పుడు తొక్కిసలాట జరిగేది. అందుకే ఈ కథకి చాల కనెక్ట్ అయ్యా. 

వంశీ: నా జనరేషన్ కి వచ్చేసరికి టికెట్లు సులువుగానే దొరికేవి. ఒక్కడు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా.

తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నటులతో పని చేయడం ఎలా అనిపించింది? 

లక్ష్మీనారాయణ: సీనియర్స్‌తో పని చేయడం చాలా మంచి అనుభవం. వారితో పని చేయడానికి కాస్త భయపడ్డాం. తనికెళ్ల భరణి లాంటి సీనియర్ నటులకు మనం ఏం చెప్పగలం.. అనిపించేది. అయితే వాళ్ళు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. సన్నివేశాలు అద్భుతంగా తీయగలిగాము. మాతో పని చేయడాన్ని వాళ్ళు అలాగే ఎంజాయ్ చేశారు.  

ఈ సినిమాకి సంగీతం దర్శకుడిగా రథన్‌ ఎంపిక వెనుక కారణం? 

వంశీ: రథన్ చాలా ప్రతిభ వున్న కంపోజర్. తెలుగు భాష తెలియనప్పటికీ ఆయనకి సంగీతంపై మంచి పట్టు ఉంది. పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. 

పూర్ణోదయలో సినిమా చేయడం ఎలా అనిపించింది? 

వంశీ:పూర్ణోదయ అంటేనే క్లాసిక్. సినిమాని ప్రేమించే నిర్మాతలు. శ్రీజ గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మొదటి సినిమా చేస్తున్న నిర్మాతలా అనిపించలేదు. అనుకున్నట్లుగా సినిమాని చాలా వేగంగా పూర్తిచేశాము. షెడ్యుల్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేయడం వారికి బాగా నచ్చింది. 

ఇంత మీ నేపథ్యం గురించి చెప్పలేదు!

లక్ష్మీనారాయణ: మాది తిరుపతి దగ్గర చంద్రగిరి. పదేళ్ళ నుండి హైదరాబాద్ లోనే ఉన్నా. జాతిరత్నాలు సినిమాకి రైటింగ్ విభాగంలో పని చేశా. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ అనుదీప్ గారిది. ఈ కథకు ఇద్దరు దర్శకులు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అలా వంశీ, నేను ప్రాజెక్ట్ చేశాం.

వంశీ: నేను డాక్టర్ చదివా. డాక్టర్ ని అయ్యాను కూడా. అయితే సినిమాలు అంటే ఇష్టం. ‘జాతిరత్నాలు’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేశా. అనుదీప్ గారితో సినిమాల పరంగా మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ ఆలోచనని ఆయన చెప్పడం, చాలా వేగంగా కథను తెరకెక్కించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని