Meet Cute: సరదాగా ఉండే కథలు తగ్గిపోతున్నాయి...: నాని

నాని హీరోగా అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాల్‌పోస్టర్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ యంగ్‌ హీరో సోదరి దర్శకురాలిగా పరిచయం కానున్నారు. 

Published : 22 Nov 2022 01:20 IST

హైదరాబాద్‌: హీరో నాని సోదరిగా అందరికీ సుపరిచితురాలు దీప్తి. త్వరలోనే ఆమె దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకోనున్నారు. దీప్తి దర్శకత్వంలో నాని (Nani) సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై తెరకెక్కిన ఫీల్‌గుడ్‌ వెబ్‌సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. 5 విభిన్నకథలతో కూడిన ఈ సిరీస్‌ నవంబర్‌ 25 నుంచి సోనీ లీవ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘మీట్‌ క్యూట్‌’ కబుర్లు మీడియాతో పంచుకున్నారు. మరి నాని, దీప్తి చెప్పిన క్యూట్‌ ముచ్చట్లేంటో చూసేద్దాం.

ఈ వెబ్‌ సిరీస్‌లో నటీనటుల ఎంపిక విషయంలో నాని సలహాలు ఇచ్చారా? నాని కోసం కథ ఎప్పుడు రాస్తారు?

దీప్తి: నేను ఈ నటీనటులను తీసుకుందామనుకుంటున్నా అని నానితో చెప్పేదాన్ని. మధ్యలో ఏమైనా అవసరమైతే తన సలహా తీసుకునేదాన్ని. పాత్రలకు సరిపోయే వారిని సెలక్ట్‌ చేశాం. నాని కోసం ప్రస్తుతానికి ఏ కథ రాయలేదు. ఏదైనా రాశాక నాని అయితే సరిపోతాడు అనుకుంటే తనని అడుగుతా.

ఈ వెబ్‌ సిరీస్‌ చూసినప్పుడు నేను నటిస్తే బాగుండేది అనిపించిందా మీకు? సినిమాలాగా తీయకుండా వెబ్‌సిరీస్‌లా తీశారెందుకు?

నాని: అనిపించ లేదు, ఇవ్వన్నీ నాకు సరిపోయే కథలు కాదు. అయితే, ఈ కథ నాకు బాగా నచ్చింది. ఒకవేళ ఈ స్క్రిప్ట్‌ మీద ఫోన్‌ నంబర్‌ రాయకుండా నా టేబుల్‌ మీద పెడితే వాళ్లని ట్రేస్‌ చేసి పట్టుకునైనా వెబ్‌ సిరీస్‌ తీసేవాడిని. ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత క్లీన్‌గా ఉంటుంది ఈ కథ. ఈ స్క్రిప్ట్‌ ఓటీటీకి సరిపోతుంది. అందుకే వెబ్‌ సిరీస్‌లా తీశాం. థియేటర్‌కు సరిపోయేది అనుకుంటే సినిమాలా తీసేవాళ్లం. 

ఈ వెబ్‌సిరీస్‌లో మీకు బాగా నచ్చిన పాయింట్‌ ఏది?మీ సిస్టర్‌ మీకు పోటీకి వస్తుందనుకుంటున్నారా?

నాని: దీప్తి నాకు స్క్రిప్ట్‌ పంపినప్పుడు చాలా రోజులు చదవకుండా వాయిదా వేశాను. కానీ, చదవడం మొదలుపెట్టాక మొత్తం స్క్రిప్ట్‌ పూర్తిచేశాను. ఏమైనా తప్పులు ఉంటే చెబుదామనుకున్నా. కానీ, ఒక్క మార్పు కూడా చెప్పాలనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో మొత్తం స్క్రిప్ట్‌ చదివాను. వెంటనే దీప్తికి ఫోన్‌ చేసి ఈ కథకు నువ్వే దర్శకురాలివి.. నువ్వే తీయాలి అని చెప్పా. సిరీస్‌ తీయడం మొదలుపెట్టాక మా టీమ్‌ వాళ్లు నాకు ఫోన్‌ చేసి చాలా బాగా డైరెక్ట్‌ చేస్తుందని చెప్పారు. తను నాకు పోటీగా వచ్చింది అని నేను అనుకోవడం లేదు. నాకు మిగిలిపోయిన కోరిక తను తీరుస్తుంది అనుకుంటున్నా.

కథలు రాయడం అలవాటా మీకు? ఈ కథ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది?

దీప్తి: నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. కొవిడ్‌ సమయంలో చాలా కథలు రాసుకున్నా. అలా రాసిన వాటిల్లో ఒకటే ఈ వెబ్‌సిరీస్‌. నేను ఈ సిరీస్‌లో ఉన్న 5 కథలు రాయడానికి చాలా సమయం తీసుకున్నా. 4 రాసిన తర్వాత చివరి కథకు మా వాళ్లు అందరూ ఫోన్‌ చేసి అడిగారు ఎప్పుడు పంపుతావు అని. నేను రాసింది పూర్తిగా చదువుకొని అందులో మార్పులు చేసిన తర్వాతనే నానికి పంపాను.

నాని: ఎంత సమయం తీసుకున్నా అవుట్‌పుట్‌ మాత్రం అద్భుతంగా ఉంది. 5కథలు చాలా బాగున్నాయి. ప్రతిదీ దానికదే ప్రత్యేకమైనది. అందరికీ నచ్చుతాయి.

ఈ సిరీస్‌ చూశాక మీకు ఎలాంటి అనుభూతి కలిగింది?ఇకపై ఓటీటీల్లో సిరీస్‌లు తీస్తారా?ఈ మీట్‌ క్యూట్‌కి బడ్జెట్‌ అనుకున్నదాని కంటే ఎక్కువైందా?

నాని: కొవిడ్‌ తర్వాత ఓటీటీ కంటెంట్‌లో చాలా మార్పులు వచ్చాయి. సరదాగా సాగిపోయే కథలు తగ్గిపోయాయి. అందరితో కలిసి కూర్చొని నవ్వుకుంటూ చూసే వెబ్‌సిరీస్‌ ఇది. ఇలాంటివి చూస్తే మనకు ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇక వాల్‌ పోస్టర్‌  బ్యానర్‌లో ఇలాంటివే తీయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కంటెంట్‌ వస్తే తీయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎలాంటి స్క్రిప్ట్‌ అయినా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉండాలి. మీట్‌ క్యూట్‌ వెబ్‌ సిరీస్‌ బడ్జెట్‌ అనుకున్నంతే అయింది. ఎక్కువేమీ అవ్వలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని