Iratta Review: రివ్యూ: ఇరాట్ట

Iratta Movie Review: మలయాళ చిత్రం ‘ఇరాట్ట’ ఎలా ఉందంటే?

Updated : 06 Mar 2023 16:41 IST

Iratta Review; చిత్రం: ఇరాట్ట; నటీనటులు: జోజూ జార్జ్‌, అంజలి, మనోజ్‌ కె.యు. ఆర్యన్‌ సలీమ్‌, స్రింద తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; సినిమాటోగ్రఫీ: విజయ్‌; ఎడిటింగ్‌: మను ఆంటోనీ; నిర్మాత: ప్రశాంత్‌ కుమార్, చంద్రన్‌, జోజూ జార్జ్‌, మార్టిన్‌ ప్రకత్‌, సైజో వడ్డకన్‌; రచన, దర్శకత్వం: రోహిత్‌ ఎం.జి. కృష్ణన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌ (మలయాళం)

విభిన్న కథలకు, ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. చిన్న చిన్న సబ్జెక్ట్‌లతో అద్భుతమైన చిత్రాలను అక్కడి దర్శకులు తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, అక్కడ విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవల మలయాళంలో వచ్చిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఇరాట్ట’. (Iratta Movie Review) అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తోంది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: కేరళలోని వాగమన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫంక్షన్‌ జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండటంతో ఆ ఏరియాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులందరూ స్టేషన్‌కు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. మీడియా కూడా అక్కడకు చేరుకుని కవరేజ్‌ మొదలు పెడుతుంది. సడెన్‌గా పోలీస్‌స్టేషన్‌లో నుంచి మూడు రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. పోలీసులు, మీడియా ఒక్కసారిగా స్టేషన్‌లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏఎస్‌ఐ వినోద్‌ (జోజు జార్జి) రక్తపు మడుగులో విగతజీవుడిగా పడి ఉంటాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? (Iratta Movie Review)  డీవైఎస్పీ ప్రమోద్‌ (జోజు జార్జి)కు వినోద్‌కూ ఉన్న సంబంధం ఏంటి? స్టేషన్‌లో హత్య జరగడం వెనుక ఉన్నదెవరు? ఈ కేసు ఎలా పరిష్కారమైంది?

ఎలా ఉందంటే: మొదటి సన్నివేశం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ అలరించే జానర్‌ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్లు. హత్య లేదా హత్యల వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని గుప్పిట పట్టి ఉంచినంత వరకూ సినిమా విజయం సాధించినట్టే. అయితే, ఆ గుప్పిటను మరీ ఎక్కువ సేపు ఉంచితే ఉత్కంఠ కలగకపోగా విసుగొస్తుంది. పైగా ఆ హత్యకు కారణం బలంగా లేకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పెదవి విరుస్తాడు. కానీ, ‘ఇరాట్ట’ విషయంలో ఒక్కో చిక్కుముడి విప్పుతుంటే, ‘ఇంతకీ ఆ హత్య చేసింది ఎవర’న్న ఉత్కంఠ చివరి వరకూ కొనసాగుతుంది. (Iratta Movie Review)  ఈ విషయంలో దర్శక-రచయిత జి.కృష్ణన్‌కు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఏఎస్‌ఐ వినోద్‌ హత్యతో త్వరగానే కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి సాగే పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌, ప్రొసీడరల్‌ డ్రామా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తుపాకీ కాల్పులు వినిపించిన సమయంలో ముగ్గురు పోలీసులు స్టేషన్‌లో ఉండటంతో వారిలో హత్య ఎవరు చేశారన్న ఉత్కంఠ మొదలవుతుంది. ఒకపక్క ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కథ నడుస్తూనే, మరోవైపు డీవైఎస్పీ ప్రమోద్‌, ఏఎస్‌ఐ వినోద్‌ల మధ్య ఉన్న సంబంధం.. వారి నేపథ్యాన్ని చూపించాడు దర్శకుడు. కథ ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ ఫుట్‌లో నడుస్తూ ఉంటుంది.

ప్రమోద్‌ హత్య కేసుకు సంబంధించిన పోలీస్‌ ప్రొసీడల్‌ ఉత్కంఠగా సాగుతుంటే, ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు మాత్రం కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. పైగా ముగ్గురు పోలీస్‌ అధికారులతో వినోద్‌ అప్పటికే గొడవ పడి ఉండటం, డీవైఎస్పీ ప్రమోద్‌ అంటే కూడా వినోద్‌కు పడకపోవడంతో ఒకానొక దశలో ప్రమోద్‌ ఏమైనా హత్య చేశాడా? అన్న అనుమానం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. ముగ్గురు పోలీసులతో వినోద్‌కు ఉన్న వైరాన్ని చూపిస్తూ ఒక్కో చిక్కుముడి విడిపోతున్నా ముగ్గురిలో హత్య ఎవరో చేశారో మాత్రం తెలియదు. వాళ్లు కాకుండా బయట వ్యక్తి వచ్చి హత్య చేశాడా? అన్న అనుమానం రేకెత్తుతుంది. (Iratta Movie Review)  కేసు విచారణకు సంబంధించి డీవైఎస్పీ ప్రమోద్‌ రంగంలోకి దిగిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. చివరి 40-45 నిమిషాలు ఉత్కంఠతో ఊపేశాడు దర్శకుడు. వినోద్‌ చావుకు కారణం, క్లైమాక్స్‌ ట్విస్ట్‌ మాత్రం ఎవరూ ఊహించలేరు. క్రైమ్‌ థ్రిల్లర్‌లు చూసేవారు కూడా క్లైమాక్స్‌ను ఊహించడం కొంచెం కష్టం. ఈ సినిమా వీక్షించడానికి ప్రధాన అవరోధం భాష. కేవలం మలయాళంలో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు ఓటీటీకి వచ్చే సరికి డబ్‌ అయి వస్తున్నాయి. ‘ఇరాట్ట’ విషయంలో అలా జరగలేదు. బహుశా డిజిటల్‌ రైట్స్‌ అంతవరకే ఇచ్చారేమో. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ చూడాలంటే ‘ఇరాట్ట’ ఏమాత్రం నిరాశ పరచదు. కాకపోతే అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగుతుంది.

ఎవరెలా చేశారంటే:  డీవైఎస్పీ ప్రమోద్‌, ఏఎస్‌ఐ వినోద్‌గా ద్విపాత్రాభినయంలో జోజు జార్జ్‌ అదరగొట్టాడు. రెండు పాత్రల్లో ఆయన చూపిన వేరియేషన్‌, హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రమోద్‌ పాత్రలో కొన్ని నెగెటివ్‌ షేడ్స్‌ ఉంటే, వినోద్‌ పాత్రల్లో ఆ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుమించి ఆ పాత్ర గురించి చెబితే, స్పాయిలర్‌ అవుతుంది. అంజలి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అయితే, హావభావాలతో తన పాత్రను రక్తిగట్టించారు. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం, విజయ్‌ సినిమాటోగ్రఫీ, మను ఆంటోనీ ఎడిటింగ్‌ బాగున్నాయి. (Iratta Movie Review)  ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలే కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. సన్నివేశాలు ఇంకాస్త షార్ప్‌ చేయొచ్చు. సినిమా మొత్తం స్టేషన్‌, దాని చుట్టుపక్కల జరుగుతుంది. దర్శక-రచయిత రోహిత్‌ ఎం.జి. కృష్ణన్‌ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాను అనుకున్న పాయింట్‌ ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఆయన విజయం సాధించారు. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడిని స్క్రీన్‌కు ఎంగేజ్‌ చేయడంలో సఫలమయ్యారు. పతాక సన్నివేశాలు సినిమాకే హైలైట్‌. ప్రతి పాత్రను క్రైమ్‌ సీన్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాసుకున్న తీరు బాగుంది.

బలాలు: 👍 దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌; 👍 పతాక సన్నివేశాలు; 👍 జోజు జార్జ్‌ నటన, కృష్ణన్‌ దర్శకత్వం

బలహీనతలు:  👎 ఫ్లాష్ బ్యాక్‌ సన్నివేశాలు; 👎 అక్కడక్కడ నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: ఊహించని క్లైమాక్స్‌తో అలరించే ‘ఇరాట్ట’

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని