Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్‌ వద్దంటే.. యశ్‌ అడుగుపెడతారా?

యశ్‌ ఓ భారీ ప్రాజెక్టులో నటించబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆ సినిమా ఏదంటే?

Published : 30 Jan 2023 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అధికారికంకాకపోయినా స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు అంచనాలు పెంచుతుంటాయి. కన్నడ నటుడు యశ్‌ (Yash) విషయంలో అదే జరుగుతోంది. ఓ భారీ ప్రాజెక్టులో ఆయన అడుగుపెట్టే అవకాశాలున్నాయంటూ వెలువడిన కథనాలు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. అదేదో కొత్త ప్రాజెక్టు అయితే అంత క్రేజ్‌ ఉండకపోవచ్చేమో! భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తెరకెక్కనున్న ‘రామాయణ’కావడంతోనే ఇదంతా. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్ర, మధు మంతెనలు దాదాపు రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని రూపొందించాలని కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ణయించిన సంగతి తెలిసిందే. నితీశ్‌ తివారి దర్శకుడిగా వ్యవహరించే ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పట్టాలెక్కలేదు కానీ తాజా వార్తతో మళ్లీ ఆసక్తి పెంచుతోంది.

రాముడి పాత్రకు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రావణాసురుడి పాత్రకు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) సరిపోతారని, అందుకే నిర్మాతలు ఆ ఇద్దరినీ సంప్రదించారని అప్పట్లో వార్తలొచ్చాయి. దానిపై ఇప్పటికీ స్పష్టతరాలేదు. మరోవైపు, ఇప్పుడు హృతిక్‌ స్థానంలో యశ్‌ పేరు వచ్చి చేరింది. గతేడాది విడుదలైన ‘విక్రమ్‌ వేద’లో హృతిక్‌ ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో హృతిక్‌ నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదని, అందుకే ‘రామాయణ’ను తిరస్కరించాని బాలీవుడ్ వర్గాల టాక్‌. దాంతో, ‘కేజీయఫ్‌’ (KGF)తో జాతీయ స్థాయిలో మెరిసిన యశ్‌ను తీసుకునేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే యశ్‌తో కథాచర్చలు జరిపారని సమాచారం. ఆయన ఓకే చెబితే త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కుందట. యశ్‌ పుట్టిన రోజు (జనవరి 8) సందర్భంగా తన కొత్త సినిమా అప్‌డేట్‌ ఇస్తారని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. ‘‘నేనో ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. మిమ్మల్ని అలరించేందుకు ఎక్కువగా పనిచేస్తున్నా. అయితే, ఆ వివరాలు ఇప్పుడు చెప్పలేను. ఓపిక పట్టండి’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. దాన్ని గుర్తుచేసుకుంటూ ఆ ప్రాజెక్టు ‘రామాయణ’ అని పలువురు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరి, యశ్‌ ఆ బిగ్‌ మూవీలో నటించేందుకు అంగీకరిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని