Mahesh babu - Rajamouli: మరో నెల మాత్రమే.. మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు తెరపడుతుందా?

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published : 08 Jul 2024 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేశ్‌బాబు (Mahesh babu), రాజమౌళి (SS Rajamouli) మూవీ ఒకటి. యాక్షన్ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ అనేక విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, కథానాయకుడి పేరు తప్ప ఒక్కటీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు. సరిగ్గా నెల రోజులే ఉండటంతో జక్కన్నతో చేసే మూవీ నుంచి అప్‌డేట్‌ ఉంటుందా? అని మహేశ్‌ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇటీవల మహేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహేశ్‌ బయటకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆయన పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో తలపై క్యాప్‌ పెట్టుకుని కనిపించారు. రాజమౌళి మూవీకి సంబంధించిన పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ మహేశ్‌ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేముందే దానికి సంబంధించిన విశేషాలతో ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి వివరిస్తారు. ఇప్పటివరకూ మహేశ్‌ విదేశాల్లో ఉండటంతో అది సాధ్యం కాలేదు. తాజాగా ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో అందరూ SSMB29 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేశ్‌ పుట్టినరోజు కానుకగా సినిమాకు సంబంధించి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఏదైనా ప్రీవిజువల్‌ టీజర్‌ ఉంటుందా? లేక మహేశ్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ వస్తుందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా మొదలైంది.

ప్రతినాయకుడు ఆయనేనా?

ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై రాజమౌళి దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు పాత్రను ఢీ కొట్టే ప్రతినాయకుడి కోసం మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటివరకూ చేసిన చిత్రాల కంటే భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. విజయేంద్రప్రసాద్‌ అందించిన ఈ సినిమా కథపై పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రాజమౌళి మాత్రం తన సినిమాల్లోని కథలు, పాత్రలకు సంబంధించిన విషయాల్ని ఎంతో రహస్యంగా ఉంచుతూ... సరైన సందర్భాన్ని చూసుకుని బయటపెడుతుంటారు. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహస ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం మాత్రమే ఇప్పటివరకూ బయటికొచ్చింది.

నాజర్‌ వచ్చారా?

తాజాగా మరో ఆసక్తికర వార్త కూడా ట్రెండ్‌ అవుతోంది. విలక్షణ నటుడు నాజర్‌ ఈ మూవీలో భాగస్వామి అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మహేశ్‌బాబుతో పాటు, పలువురు నటీనటులకు జరుగుతున్న వర్క్‌షాపులో ఆయన పాల్గోనున్నారు. ముఖ్యంగా సంభాషణలు పలికే విషయంలో ఆయనకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన నాజర్‌ తెలుగు, తమిళ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. అంతేకాదు, మహేశ్‌బాబు ‘అతడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ తదితర చిత్రాల్లో నటించారు. ఇక రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ‘బాహుబలి’లోనూ బిజ్జలదేవగా ఆయన నటన ఎవర్‌గ్రీన్‌. ఇక జులై లేదా ఆగస్టు నుంచి ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ పనులు మొదలు పెట్టనున్నట్లు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని