KGF 2: ‘కేజీయఫ్‌’.. ‘అనంత’ ప్రశ్నలకు నరాచీ నుంచి సమాధానాలొస్తాయా..!

కేజీయఫ్‌ ప్రియులకు సమాధానాలు దొరుకుతాయా..?

Updated : 13 Apr 2022 14:37 IST

‘కేజీయఫ్‌-2’ వీటికి క్లారిటీ ఇవ్వనుందా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?’ కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని వెంటాడిన ప్రశ్న ఇది. ఇప్పుడు ఇదే కోవలో సినీ ప్రియులందరూ ‘కేజీయఫ్‌’ వదిలిన ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. ‘సినిమా మధ్యలో చనిపోయాడుకున్న అధీరా చివర్లో ఎలా బయటకువచ్చాడు? ఇంతకాలం అతను ఏమయ్యాడు?’, ‘రాఖీబాయ్‌ గతమేంటి?’, ‘రాఖీబాయ్‌కి రమికాసేన్‌కి ఉన్న వైరమేంటి?’ ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్క ‘కేజీయఫ్‌’ ప్రియుడిని వెంటాడుతున్నాయి. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ‘కేజీయఫ్‌-2’లో వీటన్నింటికీ సమాధానాలు దొరుకుతాయని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

‘వీర ప్రతిమ’ దొరకనుందా..?

‘ఎల్డో రాడో’ సిటీ ఆఫ్ గోల్డ్‌. ‘కేజీయఫ్‌’ కథ మొదలయ్యేది ఈ పుస్తకంతోనే. ఆనంద్‌ వాసిరాజు (అనంతనాగ్‌) అనే రచయిత బంగారు గనుల సామ్రాజ్యం (నరాచీ), దాని కోసం జరిగిన పోరాటాలను ఆధారంగా చేసుకుని ‘ఎల్డో రాడో’ రచిస్తాడు. ఆ పుస్తకాన్ని ప్రభుత్వం బ్యాన్‌ చేయడం.. దానిలో ఏముంది? అనేది తెలుసుకోవడం కోసం ఓ ఛానల్‌ ముందుకు రావడం.. ఆనంద్‌ వాసిరాజుని ఇంటర్వ్యూ చేయడంతో ‘కేజీయఫ్‌’ కథ మొదలైంది. ‘ఎల్డో రాడో’, ‘రాఖీబాయ్‌’ గురించి ప్రస్తావిస్తూ తాను చెబుతున్న కథకు.. కోలార్‌కు దగ్గర్లో ఉన్న ఓ ప్రదేశంలో పాతిపెట్టిన వీరప్రతిమే సాక్ష్యమని ఆనంద్‌ చెబుతాడు. ఆనంద్‌ వాసిరాజు మాటలతో ఆ ఛానల్‌ వాళ్లు దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేపడతారు. మరి, ఆ వీరప్రతిమ దొరికిందా? ఆ ‘వీరప్రతిమ’ రాఖీబాయ్‌దేనా?

రాఖీబాయ్‌ గతమేంటి? వాళ్లమ్మకు గతంలో ఏం జరిగింది?

రామకృష్ణ పవన్‌ (యశ్‌) తల్లికిచ్చిన మాటను నిలబెట్టడానికి డబ్బు, పవర్‌కోసం ముంబయిలో అడుగు పెడతాడు. పదేళ్ల కుర్రాడు రాఖీబాయ్‌గా ఎలా ఎదిగాడు అనేది ‘కేజీయఫ్‌-1’లో చూపించారు. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా మందికి వచ్చిన సందేహాల్లో మొదటిది ‘అసలు రాఖీబాయ్‌, అతని తల్లి గతమేంటి?’ ‘రాఖీ తండ్రి ఎవరు?’ రాఖీ జీవితానికి సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ‘కేజీయఫ్‌-2’లో సమాధానాలు చూపిస్తారా? ‘కేజీయఫ్‌-1’తో పోలిస్తే పార్ట్‌-2లో తల్లి సెంటిమెంట్‌ మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవల యశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘అధీరా’ ఏమైపోయాడు..?

‘కేజీయఫ్‌-2’లో ఎంతో కీలకమైన పాత్ర అధీరా (సంజయ్‌దత్‌). తన అన్నయ్య (సూర్యవర్ధన్‌)కిచ్చిన మాట ప్రకారం నరాచీలో ఆధిపత్యాన్ని అన్న కొడుకైన గరుడకు వదిలేసి వెళ్లిపోయిన అధీరా.. గరుడతో జరిగిన అధికారపోరులో చనిపోయినట్లు ‘కేజీయఫ్‌’ మధ్యలో చూపించారు. కానీ, రాఖీబాయ్‌ గరుడని హత్య చేయడంతో ఎండ్‌ కార్డ్‌ పడుతుందనుకునే సమయానికి అధీరా బతికే ఉన్నట్లు.. ‘నరాచీ’లో రాజకీయం చేసేందుకు వస్తున్నట్లు చూపించారు. ఒకవేళ అధీరానే బతికుంటే.. అతను ఇంతకాలం ఏమైనట్లు? ఎక్కడికి వెళ్లినట్లు?

వానరం.. ఏం చేస్తాడు..?

గరుడకు నమ్మినబంటుగా అతడి ప్రాణాలకు అండగా నిలిచే వ్యక్తి వానరం (అయ్యప్ప). అంతేకాదు, నరాచీకి సేనాధిపతిలాంటి వాడు. మరి, కళ్లెదుటే తన యజమానిని రాఖీ హత్య చేయడం చూసిన వానరం.. తన సైన్యాన్ని రాఖీబాయ్‌పైకి పంపిస్తున్నట్లు ‘కేజీయఫ్‌’ ఆఖరిలో చూపించారు. మరి వానరం ఆజ్ఞాపిస్తే అతడి సైన్యం ఎలా స్పందించింది?గరుడ మరణంతో రాఖీబాయ్‌కి సైన్యంగా మారిన ‘నరాచీ’లోని 20 వేలమంది కార్మికులు వానర సైన్యాన్నికి అడ్డుగా నిలబడ్డారా? వానరం అధీరాతో కలుస్తాడా?

రమికాసేన్‌ వర్సెస్‌ రాఖీభాయ్‌? ప్రభుత్వం ‘ఎల్డో రాడో’ ఎందుకు బ్యాన్‌ చేసింది?

‘నరాచీ’ని హస్తగతం చేసుకోవడానికి ఓవైపు అధీరా.. మరోవైపు రాజేంద్రదేశాయ్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌, కమల్‌.. రాఖీభాయ్‌తో పాటు ఇనాయత్‌ఖలీ పోటీ పడతారని ‘కేజీయఫ్’తో అర్థమైంది. కానీ, సినిమా చివర్లోకి వచ్చేసరికి కథ పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నట్లు కనిపించింది. అప్పటివరకూ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన రమికాసేన్‌ (రవీనా టాండన్‌) గరుడ మరణ వార్త తెలిసి, కేజీయఫ్‌ను హస్తగతం చేసుకోవడానికి ఏం చేసింది? రాజకీయంగా ఎలాంటి అడుగులు వేసింది?భారత సైన్యాన్ని నరాచీకి పంపిందా? లేదా పార్ట్‌-2లో చూడవచ్చు. మరి, రమికాసేన్‌, రాఖీల మధ్య వైరం ఎలా రానుంది? ఎన్నో వేల మంది కార్మికుల గుండెల్లో దేవుడిగా పేరు తెచ్చుకున్న రాఖీ గొప్పతనాన్ని చెప్పే ఎల్డోరాడో పుస్తకాన్ని ప్రభుత్వం ఎందుకు బ్యాన్‌ చేసింది?

కొత్త సందేహాలు..?

‘కేజీయఫ్‌-2’ ట్రైలర్‌ సినీ ప్రియులకు కొత్త సందేహాలు పుట్టేలా చేసింది. పార్ట్‌-1లో లేని కొత్త పాత్రలు పార్ట్‌-2లో కనిపించడమే దానికి ప్రధాన కారణం. ‘కేజీయఫ్‌’లో ఆనంద్‌ వాసిరాజుగా కథ చెప్పిన అనంత్‌నాగ్‌ స్థానంలో ‘కేజీయఫ్‌-2’ కథను ప్రకాశ్‌రాజ్‌ (విజయేంద్ర వాసిరాజు) వివరిస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఆనంద్‌ వాసిరాజు ఏం అయ్యాడు? ఆ స్థానంలోకి విజయేంద్ర వాసిరాజు ఎలా వచ్చాడు? మొదటి భాగంలో ఎక్కడా కనిపించని ఈశ్వరీరావు పార్ట్‌-2లో కనిపించడానికి కారణమేమిటి? ఆమె ఎవరు? ఆమె పాత్ర ఎలా ఉండనుంది?అలాగే రావు రమేశ్‌ పాత్ర ఏంటి? ‘కేజీయఫ్‌-2’లో ప్రశాంత్‌నీల్ ఈ ప్రశ్నలన్నింటికీ కేజీయఫ్‌2లో సమాధానం లభించే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని