NTR: పని మొదలుపెట్టారా?

సినిమా పట్టాలెక్కడానికి నెలల ముందే తారల పని మొదలవుతుంటుంది. కథ, పాత్రలకి తగ్గట్టుగా సన్నద్ధం అవ్వాలి. లుక్‌ మార్చడం, కథ డిమాండ్‌ మేరకు కొత్తగా వేరే ఏదైనా నేర్చుకోవడం వంటి పనులు చేస్తుంటారు.

Updated : 15 Apr 2022 11:12 IST

సినిమా పట్టాలెక్కడానికి నెలల ముందే తారల పని మొదలవుతుంటుంది. కథ, పాత్రలకి తగ్గట్టుగా సన్నద్ధం అవ్వాలి. లుక్‌ మార్చడం, కథ డిమాండ్‌ మేరకు కొత్తగా వేరే ఏదైనా నేర్చుకోవడం వంటి పనులు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ కొత్త చిత్రం కోసం లుక్‌ మార్చనున్నారని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆయన కండలు పెంచిన విషయం తెలిసిందే. మొన్నటిదాకా గుబురు గెడ్డంతో, కండలతో కనిపించిన ఎన్టీఆర్‌... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో నాజూగ్గా, ట్రెండీగా దర్శనమివ్వనున్నారని సమాచారం. అందుకోసం ఆయన ఇప్పటికే పని మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. జూన్‌ నుంచే కొత్త చిత్రం పనులు    మొదలవుతాయని ఇదివరకే ఎన్టీఆర్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సినిమా పట్టాలెక్కడానికి   నెలన్నర సమయం ఉంది కాబట్టి ఆయన పాత్రకి తగ్గట్టుగా తన లుక్‌ని మార్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఆ విషయంలో స్పష్టత రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా నటించేందుకు అలియాభట్‌ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రణ్‌బీర్‌ కపూర్‌ని వివాహమాడారు. వ్యక్తిగత జీవితం, హిందీ సినిమాల దృష్ట్యా ఈ సినిమాలో నటించాలా వద్దా అనే   విషయంపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఆమె సినిమా నుంచి తప్పుకొంటే మాత్రం మళ్లీ కొత్తగా కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని