
Rashmika: హిందీలో మరొకటి?
ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ నాయికల్లో ఒకరిగా మెరుపులు మెరిపిస్తోంది రష్మిక. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్‌బై’ చిత్రాలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రష్మికకు హిందీలో మరో క్రేజీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ‘పుష్ప’లో శ్రీవల్లిగా డీగ్లామర్ పాత్రలో నటించి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ కస్తూరి. ఇప్పుడా సినిమా నచ్చే నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు ఓ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కరణ్ నిర్మాణంలో పలు చిత్రాలు ముస్తాబవుతున్నాయి. వీటిలో ఓ సినిమా కోసం ఆమెని నాయికగా తీసుకోనున్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆ చిత్రం ఏంటి? అందులో నటించే స్టార్ ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘పుష్ప 2’లోనూ నటించాల్సి ఉంది.