NTR: ఎన్టీఆర్‌ కోసం సైఫ్‌?.. ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) 30వ చిత్రం పక్కా పాన్‌ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.

Published : 16 Mar 2023 07:46 IST

గ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) 30వ చిత్రం పక్కా పాన్‌ ఇండియా హంగులతో రూపొందుతోంది. నటుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ప్రతినాయకుడిగానూ బాలీవుడ్‌ నటుడే కనిపిస్తారని కొంతకాలంగా వినిపించింది. ఆ పాత్ర చేయడానికి బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) పచ్చజెండా ఊపారని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఎన్టీఆర్‌ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించారు. తదుపరి చేయనున్న చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా ఎన్టీఆర్‌ - కొరటాల శివ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆ మేరకు కథ, కథనాలతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని  సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తుండగా, కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు.

‘నాటు నాటు’ గూగుల్‌ సెర్చ్‌ రికార్డులు..: విడుదలైన దగ్గరి నుంచి తగ్గేదేలే  అంటూ క్రేజ్‌ సొంతం చేసుకున్న ‘నాటు నాటు’ (Naatu Naatu) ఏకంగా ఆస్కార్‌ను గెలుచుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుతో ఈ పాట రేంజ్‌ అమాంతం పెరిగింది అందుకే ప్రస్తుతం ప్రపంచమంతా  ‘నాటు నాటు’తో మారుమోగిపోతుంది. ఈ పాటకు ఆస్కార్‌ అవార్డు ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు దీని కోసం తెగ వెతికేసినట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది. ఆస్కార్‌ ప్రకటించాక ఈ పాటను 10 రెట్లు అధికంగా వెతికినట్లు జపాన్‌కు చెందిన ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 1,105 శాతం సెర్చ్‌తో ‘నాటు నాటు’ రికార్డు సృష్టించిందని తెలిపింది.


ఆ క్షణాల్ని మరిచిపోలేను

స్కార్‌ (Oscars 2023) వేదికపై నాటు నాటు పాటకిగానూ సంగీత దర్శకుడు  కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ పురస్కారాల్ని స్వీకరించిన క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు ఎన్టీఆర్‌ (NTR).  95వ ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొన్న ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా  విమానాశ్రయంలో ఆయనకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. అదొక అద్భుతమైన అనుభవం. భారతీయుడిని...అందులోనూ తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నా. మేం ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే కారణం అభిమానులు, సినీ ప్రేమికులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైంది. ఆస్కార్‌ పురస్కారం వచ్చిన వెంటనే మొదటగా నా భార్యకి ఫోన్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నా’’ అన్నారు. ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొన్న  నృత్య దర్శకుడు ప్రేమ్‌రక్షిత్‌ (Prem Rakshith) మాట్లాడుతూ ‘‘ఆస్కార్‌ వేడుకల్లో వేదికపై పాట ప్రదర్శన పూర్తయిన వెంటనే అక్కడున్నవాళ్లందరూ లేచి నిలుచొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం కన్నీళ్లు వచ్చాయి. అవార్డు తీసుకన్న తర్వాత కీరవాణి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేన’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని