Published : 06 Jul 2022 16:36 IST

Vijay Sethupathi: షారుఖ్‌ ఖాన్‌కు పోటీగా విజయ్‌సేతుపతి.. రంగం సిద్ధమైందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు దర్శకులు తాము రాసుకున్న పాత్రలకు సరిపోయే నటుల్ని ఎంపిక చేసుకుంటుంటారు. మరికొందరు నటులను ఊహించుకుని పాత్రలను సృష్టిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ ఇట్టే ఒదిగేపోయే నటుల్లో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. హీరో, విలన్‌, తండ్రి, ప్రేమికుడు.. ఇలా అన్ని క్యారెక్టర్లకూ న్యాయం చేయగలిగే స్టార్‌గా గుర్తింపు పొందారు. ‘‘నా జీవితంలో నీలాంటి అద్భుతమైన నటుడ్ని చూడలేను’’ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan).. సేతుపతిని కొనియాడారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ సందర్భంలో సేతుపతిని ప్రశంసించిన షారుఖ్‌ ఇప్పుడు తన సినిమాలో ఆయన్ను ప్రతినాయకుడిగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. షారుఖ్‌ఖాన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్‌’ (Jawan) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర కోసం దర్శకుడు సేతుపతిని సంప్రదించారని, కథ విన్నాక ఇందులో నటించేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. డేట్స్‌ సర్దుబాటైన వెంటనే విజయ్‌ సేతుపతి ‘జవాన్‌’ చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని తెలుస్తోంది.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 2న విడుదలకానుంది. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నయనతార కథానాయిక. తన కెరీర్‌ ప్రారంభంలో పలు చిత్రాల్లో అంతగా గుర్తింపులేని పాత్రలు పోషించిన సేతుపతి ‘పిజ్జా’తో తానేంటో నిరూపించుకున్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ అన్ని చిత్ర పరిశ్రమల వారినీ తనవైపు తిప్పుకున్నారు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాలతో మరింత దగ్గరయ్యారు. గతేడాది వచ్చిన విజయ్‌ ‘మాస్టర్‌’, ఇటీవల వచ్చిన కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ (Vikram) సినిమాల్లో ప్రతినాయకుడిగా ఎంతటి వైవిధ్యం చూపించారో తెలిసిందే. మరోవైపు, అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’లో ఓ విలన్‌గా సేతుపతి నటించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని