మేకప్‌ తీసేయడం కుదరదు.. అయితే నేను పనిచేయను!

ఏ సినిమానైనా ముందుగా చూసే వ్యక్తి కెమెరామెన్‌. దర్శకుడి ఆలోచనలను, నటీనటుల నటనా ప్రతిభను, అందమైన లొకేషన్లను తన కెమెరాలో బంధించి వెండితెరపై ఆవిష్కరిస్తాడు.

Published : 09 May 2022 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ సినిమానైనా ముందుగా చూసే వ్యక్తి కెమెరామెన్‌. దర్శకుడి ఆలోచనలను, నటీనటుల నటనా ప్రతిభను, అందమైన లొకేషన్లను తన కెమెరాలో బంధించి వెండితెరపై ఆవిష్కరిస్తాడు. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లో తమ కెమెరా ట్రిక్‌లతో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలను తెరకెక్కించి, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ఛాయాగ్రాహకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇషాన్‌ ఆర్య కూడా ఒకరు. ఆయన కెమెరామెన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ‘గరమ్‌ హవా’లాంటి చిత్రాలతో ఖ్యాతి తెచ్చుకున్న ఇషాన్‌ ఆర్య తెలుగు చిత్రాలకూ పనిచేశారు.

బాపు, రమణల ‘స్నేహం’, ‘ముత్యాలముగ్గు’ చిత్రాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు. అప్పట్లో నందమూరి తారక రామారావు కథానాయకుడిగా ఒక సాంఘిక చిత్రాన్ని మద్రాసులోని సత్యం థియేటర్‌ అధినేతలు ప్రారంభించారు. దానికి ఇషాన్‌ ఆర్యనే ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. మామూలుగా తనకు అలవాటైన మేకప్‌, విగ్గులతో షూటింగ్‌కు వచ్చారు ఎన్టీఆర్‌. అది చూసి, ఇషాన్‌ ఆర్య.. ‘ఆ లిప్‌స్టిక్‌, ముఖానికి దట్టంగా ఉన్న ఆ మేకప్‌ హీరోగారు తుడిచేయాలి’ అన్నారు. ‘అది కుదరని పని. ఆయన, అలాగే నటిస్తారు. మేకప్‌, విగ్గూ లేకుండా నటించరు’’ అన్నారు నిర్మాతలు. ‘అయితే, నేను పనిచెయ్యను. అలవాటైన వారిని నియమించుకోండి’ అని తొలిరోజునే ఇషాన్‌ ఆర్య నిష్క్రమించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని