Nag Ashwin: ఐదేళ్లు పట్టింది రాయడానికి!

‘‘భారతీయులకే కాదు... ప్రపంచంలోని అందరికీ సంబంధించిన కథలా ‘కల్కి 2898 ఎ.డి’ ఉంటుంది’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. మన పురాణాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఎలా  స్పందిస్తారో  అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

Published : 19 Jun 2024 01:42 IST

‘‘భారతీయులకే కాదు... ప్రపంచంలోని అందరికీ సంబంధించిన కథలా ‘కల్కి 2898 ఎ.డి’ ఉంటుంది’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. మన పురాణాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆయన దర్శకత్వంలో... ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమే ‘కల్కి 2898 ఎ.డి’. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ కథా నేపథ్యాన్ని ఓ ప్రత్యేకమైన  వీడియో ద్వారా పరిచయం చేశారు నాగ్‌ అశ్విన్‌.  ‘‘చిన్నప్పటి నుంచీ  పౌరాణిక చిత్రాలంటే ఎంతో ఇష్టం. ‘పాతాళ భైరవి’, ‘బైరవద్వీపం’, ‘ఆదిత్య 369’... ఇలా ప్రతి సినిమా విభిన్నమైనదే. హాలీవుడ్‌ నుంచి వచ్చిన ‘స్టార్‌ వార్స్‌’ చూసినప్పుడు కూడా ‘చాలా బాగున్నాయి కానీ,  ఇవి మన కథలు కావా? ఎప్పుడూ పాశ్చాత్య దేశాల నేపథ్యంలోనే జరగాలా?’ అనిపించేది. మన పురాణాల్లో చదివిన గొప్ప యుద్ధం అంటే మహాభారతం. పెద్ద సంఖ్యలో గొప్ప పాత్రలు ఉంటాయి. కృష్ణావతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచి కలియుగంలోకి ప్రవేశించినప్పుడు ఈ కథ ఇంకెలా వెళుతుందనే సృజనాత్మక ఊహతో ఈ కథ రాశా. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి. కలియుగంలో ఎలా జరగబోతోంది, ఎలా జరగొచ్చు అనేది ఇందులో చూపించాం. మనం చదివిన పురాణాలన్నింటికీ ఇదొక అంతిమ ఘట్టంలా ఉంటుంది. కలి అనే పాత్ర ప్రతి యుగంలోనూ ఉంటుంది. ఒక యుగంలో రావణుడిలా, మరో యుగంలో దుర్యోధనుడిలా.. ఇలా ఒకొక్క చోట ఒక్కో రూపం తీసుకుంటే, కలియుగానికి వచ్చేసరికి అది చివరి రూపం అనుకుంటే, అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాస్తూ వచ్చేసరికి ఐదేళ్లు పట్టింది’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు నాగ్‌ అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని