Itlu Maredumilli Praja neekam: మేం మనుషులమే సారూ..!

వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన అల్లరి నరేష్‌.. పంథా మార్చారు. కొత్తదనం నిండిన సీరియస్‌ కథలతో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ‘నాంది’తో విజయాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 01 Jul 2022 06:45 IST

వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన అల్లరి నరేష్‌ (Allari Naresh).. పంథా మార్చారు. కొత్తదనం నిండిన సీరియస్‌ కథలతో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ‘నాంది’ (Naandi)తో విజయాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో(Itlu Maredumilli Praja neekam) అలరించేందుకు సిద్ధమవుతున్నారు. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఎ.ఆర్‌.మోహన్‌ తెరకెక్కిస్తున్నారు. ఆనంది కథానాయిక. గురువారం నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన గిరిజన గ్రామాలు.. అక్కడి ప్రజలకు జరిగిన అన్యాయాలు.. వారి కోసం హీరో చేసే పోరాటం.. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఇలా సీరియస్‌గా సాగే కథ ఇది. దీన్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఇందులో నరేష్‌ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆనంది గిరిజన యువతిగా నటించింది. ‘‘సాయం చేత్తే మనిసి.. దాడి సేత్తే మృగం.. మేం మనుషులమే సారూ. మీరు మనుషులైతే సాయం చేయండి’’, ‘‘పాతిక కిలోమీటర్లు ఇవతలికి వస్తే కానీ వీళ్లు ఎలా బతుకుతున్నారో మనకు కూడా తెలియలేదు. వీళ్లని చూస్తుంటే బాధపడాలో.. జాలిపడాలో కూడా తెలియడం లేదు మాస్టారు’’ అంటూ టీజర్‌లో వినిపించిన సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: రామ్‌ రెడ్డి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని