Will Smith: స్మిత్‌కు అంత కోపమెందుకు వచ్చింది? అసలు జాడాకు ఏమైంది?

యావత్‌ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోన్న సినీ వేడుకలో అనూహ్య ఘటన.. హాస్యాన్ని పండించాలని ఆ కమెడియన్‌ చేసిన ప్రయత్నం బెడిసి చెంపదెబ్బకు దారితీసిన సంఘటన..

Updated : 29 Mar 2022 13:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోన్న సినీ వేడుకలో అనూహ్య ఘటన.. హాస్యాన్ని పండించాలని ఆ కమెడియన్‌ చేసిన ప్రయత్నం బెడిసి చెంపదెబ్బతిన్న సంఘటన.. సినీ అభిమానులకే గాక ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చింది. తన ప్రియమైన సతీమణి అనారోగ్యంపై జోకులు వేయడం తట్టుకోలేకపోయిన అగ్ర నటుడు విల్‌ స్మిత్‌.. వ్యాఖ్యాత క్రిస్‌ రాక్‌ చెంప ఛెళ్లుమనిపించాడు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌కు ఏమైంది..? 

ఎవరీ జాడా పింకెట్‌..

అమెరికాకు చెందిన జాడా పింకెట్‌ ప్రముఖ నటి, గాయని. ఎన్నో హాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన జాడా.. 1997లో విల్‌ స్మిత్‌ను వివాహమాడారు. 2021లో టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో జాడా పింకెట్‌కు కూడా స్థానం దక్కింది. కొన్నేళ్ల క్రితం జాడా అరుదైన వ్యాధి బారిన పడ్డారు. తాను ‘అలోపేసియా’తో సతమతమవుతున్నట్లు 2018లో జాడా బహిరంగంగా వెల్లడించారు. 

అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ ప్రకారం.. అలోపేసియా ఎరేటా అనేది చాలా అరుదైన వ్యాధి. శరీరంలోకి రోగ నిరోధక శక్తి.. జుట్టు ఫోలికల్స్‌పై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై జుట్టుతో పాటు ముఖం, చేతులపై ఉండే వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఈ వ్యాధితో బాధపడివారిలో కొందరికి జట్టు ఊడిపోవడం స్వల్పంగానే ఉన్నప్పటికీ.. మరికొందరిలో ఈ లక్షణం తీవ్రంగా ఉంటోంది. ఇది కాకుండా ఏ ఇతర అనారోగ్య సమస్య ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి స్పష్టమైన కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేయలేదు. అయితే, జన్యుపరమైన లోపాలు లేదా ఇతర పర్యావరణ సమస్యల కారణంగా ఇలా జరగొచ్చని మాత్రం చెబుతున్నారు. 

2018లో జాడా పింకెట్‌ స్మిత్‌ తన రెడ్ టేబుల్‌ టాక్‌ షోలో తొలిసారి ఈ వ్యాధి గురించి బయటపెట్టారు. తనకు అలోపేసియా సోకిందని తెలిసినప్పుడు చాలా ఆందోళనకు గురయ్యానని, జట్టు ఊడిపోతుంటే ఎంతో మనోవేదన పడేదాన్ని అని అన్నారు. ఒక్కోసారి జాడా తలస్నానం చేస్తున్నప్పుడు చేతి నిండా జుట్టు ఊడొచ్చేదట. దీంతో ఇక లాభం లేదనుకున్న ఆమె.. పూర్తిగా గుండు చేయించుకున్నారు. 2021 జులై నుంచి ఆమె ఎక్కడైనా గుండుతోనే కన్పిస్తున్నారు. క్రమక్రమంగా దానికి అలవాటుపడిపోయిన ఆమె.. ఇప్పుడు ఇతరుల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

హాస్యనటుడి ‘చేదు’ గుళిక..

ఆదివారం రాత్రి జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌తో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలోనూ ఆమె గుండుతోనే కన్పించారు. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ హాస్యగుళిక ప్రయోగిద్దామని భావించిన క్రిస్‌.. జాడా పింకెట్‌ ప్రస్తావన తీసుకొచ్చారు.  ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ సినిమాలో డెమి మూర్‌ పూర్తిగా గుండుతో కన్పించారు. . జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించనున్నారా?అంటూ జోక్‌ వేశారు. అయితే, అది కాస్తా స్మిత్‌కు కోపం తెప్పించింది. అప్పటి వరకు క్రిస్‌ జోక్‌లకు నవ్వుతూ కనిపించిన స్మిత్‌.. తన భార్య ఇబ్బంది పడటం గమనించి ఒక్కసారిగా లేచి వేదికపైకి వెళ్లి క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించి వెనక్కి వచ్చారు. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ గట్టిగా హెచ్చరించారు. ఈ ఊహించని పరిణామంతో డాల్బీ థియేటర్‌లో కూర్చున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. తొలుత ఇది స్క్రిప్ట్‌లో భాగమనుకున్నా.. తర్వాత స్మిత్‌ నిజంగానే కొట్టినట్లు తెలియడంతో ఆశ్చర్యపోయారు. 

ఈ ఘటన నేపథ్యంలో స్మిత్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు స్మిత్‌ను సమర్థిస్తే.. మరికొందరు మాత్రం ఆయన చేసింది తప్పని విమర్శించారు. క్రిస్‌ రాక్‌కు మద్దతుగా పలువురు కమెడియన్లు స్మిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన కొంత సేపటి తర్వాత విల్‌ స్మిత్‌ ‘ఉత్తమ నటుడిగా’ ఎంపికయ్యారు. దీంతో అవార్డు తీసుకునేందుకు వేదికపైకి వచ్చిన ఆయన.. జరిగిన ఘటనపై స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. అయితే క్రిస్‌ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో ఆయన అవార్డును వాపస్‌ తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

భరించలేకపోయా.. క్షమించు క్రిస్‌..

ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడంతో విల్‌ స్మిత్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ క్రిస్‌ రాక్‌కు బహిరంగ క్షమాపణ చెప్పడం గమనార్హం. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అది విషపూరితం.. విధ్వంసకరం. గత రాత్రి అకాడమీ అవార్డుల్లో నేను ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం, క్షమార్హం కాదు. నా గురించి జోకులు వేసినా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ, జాడా ఆరోగ్య పరిస్థితిపై జోకులు వేయడం సరికాదు. అందుకే తట్టుకోలేకపోయా. భరించలేక ఉద్వేగంగా స్పందించా. నేను నియంత్రణ కోల్పోయాను. నేను చేసింది తప్పు. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దీనికి నేను చాలా చింతిస్తున్నా. క్రిస్‌ నీకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా. ప్రేమ, దయ గల ఈ ప్రపంచంలో హింసకు చోటు లేదు. ఈ సందర్భంగా అకాడమీకి, షో నిర్మాతలు, వీక్షకులు, ప్రపంచవ్యాప్తంగా ఈ షోను చూసిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా. విలియమ్స్‌ కుటుంబం, కింగ్‌ రిచర్డ్స్‌ చిత్ర బృందానికి కూడా క్షమాపణలు చెబుతున్నా. ఓ అందమైన జర్నీగా సాగిపోతున్న వేడుకలో నా ప్రవర్తన ఓ మచ్చలా మిగిలిపోయినందుకు నేను ఎంతోగానో చింతిస్తున్నా’’  అని స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని