Jagame Maya Review: రివ్యూ: జగమే మాయ

ఓటీటీ వేదికగా ఈ వారం విడుదలైన సినిమాల్లో ‘జగమే మాయ’ ఒకటి. ధన్య బాలకృష్ణ, చైతన్య రావు తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే?

Updated : 16 Dec 2022 18:53 IST

Jagame Maya Review చిత్రం: జగమే మాయ; తారాగణం: ధన్య బాలకృష్ణ, తేజ ఐనంపూడి, చైతన్య రావు, పృథ్వీరాజ్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: రాహుల్‌ మాచినేని; ఎడిటింగ్‌: మధురెడ్డి, సాగర్‌ ఉడగండ్ల; సంగీతం: అజయ్‌ అరసాడ; నిర్మాతలు: ఉదయ్‌ కోలా, విజయ్‌ శేఖర్‌ అన్నే; స్క్రీన్‌ప్లే: అజయ్‌ శరణ్‌ అడ్డాల; కథ, దర్శకత్వం: సునీల్‌ పుప్పాల; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి, సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జగమే మాయ’. సునీల్‌ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైంది. ఇది ఏ నేపథ్యంలో తెరకెక్కింది? ఎలా ఉంది? తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం (Jagame Maya Review).. 

ఇదీ కథ: కష్టపడకుండా డబ్బులురావాలనుకునే మనస్తత్వం ఉన్న యువకుడు ఆనంద్‌ (తేజ ఐనంపూడి). అలా క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ. లక్షలు పోగొట్టుకుంటాడు. తమ అప్పు తీర్చాలంటూ బాధితులు.. ఆనంద్‌ (Teja Ainampudi) కుటుంబ సభ్యులను డిమాండ్‌ చేస్తారు. తండ్రి అసహ్యించుకున్నా ఆనంద్‌లో మార్పు రాదు. తనకు కావాల్సినంత డబ్బు ఇవ్వకపోతే రహస్యాలను బయటపెడతానంటూ కొందరిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకరి ఇంటికి వెళ్లిన ఆనంద్‌.. అక్కడి డబ్బు, బంగారం దోచుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తాడు. తన గతం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. మెడిటేషన్‌ సెంటర్‌లో చిత్ర (ధన్య బాలకృష్ణ) అనే మహిళకు దగ్గరవుతాడు. ఆమె (dhanya balakrishna)కు వివాహం అయిందని, భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసినా పెళ్లి చేసుకుంటాడు. వివాహం అనంతరం చిత్ర తాను అనుకున్నట్టు అమాయకురాలు కాదనే విషయాన్ని తెలుసుకుని షాక్‌ అవుతాడు. ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని పరిస్థితిలో చిక్కుకుంటాడు. చిత్ర ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? తన మొదటి భర్త అజయ్‌ (చైతన్య రావు)  (Chaitanya Rao) చావు వెనక ఎవరి హస్తం ఉంది? ఆమెను ఎవరు బ్లాక్‌ మెయిల్‌ చేశారు? ఆనంద్‌ సమస్యల నుంచి బయటపడ్డాడా? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: డబ్బు విషయంలో అత్యాశ ఉంటే, అదీ కష్టపడకుండా అడ్డదారిలో రావాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సునీల్. తప్పు చేయడం ప్రారంభిస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పులు చేస్తూనే ఉండాలన్న అంశాన్ని స్పృశించారు. అయితే, ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమని చెప్పేందుకు ఇందులో కొత్త‘ధనం’ ఏమీ లేదు. మలుపులూ ఆసక్తికరంగా ఉండవు. తొలి సన్నివేశంతోనే హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. ఆ పాత్ర.. జల్సా చేసేందుకు ఇతరులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం, అమ్మాయిల చుట్టూ తిరగడంతోనే ప్రధమార్థం పూర్తవుతుంది. ‘ఆర్ట్‌ సినిమాలో హీరో యాక్ట్‌ చేసేందుకు చస్తుంటే.. ఈ ల్యాగ్‌ ఎంటో?’ అని హీరో ఓ డైలాగ్‌ చెబుతాడు. దానికి తగ్గట్టుగానే.. ఫస్టాఫ్‌ ముగిసే వరకు ప్రేక్షకులూ అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. చివర్లో వచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తిస్తుంది.

చిత్ర గురించి ఆనంద్‌ అసలు నిజం తెలుసుకున్న క్షణం నుంచి కథలో వేగం పెరుగుతుంది. గతంలో ఆమె ఎలా ఉండేది? ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నేను మంచివాణ్నికాదని తెలిసినా ఎందుకు పెళ్లి చేసుకుంది? అని హీరో మిస్టరీని ఛేదించే క్రమంలో అంతగా థ్రిల్‌ ఉండకపోయినా కాస్త ఫన్‌ ఉంటుంది. తన గురించి ఆనంద్‌కు అంతా తెలిసిపోయిందని తెలుసుకున్న చిత్ర జరిగిదంతా వివరిస్తుంది. ఆయా సంఘటనలను మరింత ఆసక్తికరంగా చూపిస్తే బాగుణ్ను అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది. మెడికల్‌ షాపు నడిపే వ్యక్తిగా రాకింగ్‌ రాకేశ్‌ ఎపిసోడ్లు నవ్విస్తాయి. వేరొకరు చిత్రను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆనంద్‌ ఆమెను రక్షించేందుకు, చిత్రకు దూరమయ్యేందుకు ఓ ప్లాన్‌ వేస్తాడు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుందనుకునేలోపు వారిద్దరికీ ఊహించలేని ఘటన ఎదురవుతుంది. ఆ మలుపే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సీక్వెల్‌ (జగమే మాయ 2)పై ఆసక్తి కలిగిస్తుంది.

ఎవరెలా చేశారంటే: పాజిటివ్‌, నెగెటివ్‌ ఛాయలున్న చిత్ర పాత్రకు ధన్య చక్కగా సరిపోయింది. తేజ, చైతన్య రావు తమ తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. సీనియర్‌ నటుడు పృథ్వీరాజ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజరుగా ఓకే అనిపిస్తారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విషయంలో ఆయా విభాగాల సాంకేతిక నిపుణులు ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిస్తుంది. కథ పరంగా ఓకేకానీ టేకింగ్‌ విషయంలో దర్శకుడు అంతగా ప్రభావం చూపలేకపోయారు.

బలాలు: + ద్వితీయార్థంలోని మలుపులు, + రాకింగ్‌ రాకేశ్‌ ఎపిసోడ్లు 

బలహీనతలు: - కథలో కొత్తదనం లేకపోవడం, ప్రధమార్థం

చివ‌రిగా: ఈ సినిమా ‘మాయ’ చేయదు.

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని