రివ్యూ:‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)

టైటిల్‌తోనే సినీప్రియుల్ని ఆక‌ర్షించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)

Updated : 12 Feb 2021 20:07 IST

చిత్రం: ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌); న‌టీన‌టులు: జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ,  బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్ త‌దిత‌రులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఎడిటింగ్: కిషోర్ మద్దాలి; క‌ళ‌: జె.కె.మూర్తి; నిర్మాత‌:  కె.ఎల్. దామోదర్ ప్రసాద్; కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు; సంస్థ‌: శ్రీ రంజిత్ మూవీస్; విడుద‌ల తేదీ: 12-02-2021

టైటిల్‌తోనే సినీప్రియుల్ని ఆక‌ర్షించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’. ‘అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌’, ‘అలా మొద‌లైంది’ వంటి వైవిధ్యభరిత సినిమాలను నిర్మించిన కె.ఎల్‌.దామోద‌ర్ ప్రసాద్‌ నుంచి వ‌స్తున్న చిత్రమిది. జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో న‌టించారు. రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి జంట‌గా న‌టించారు. బేబీ స‌హ‌శ్రిత కీలక పాత్ర పోషించింది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శకుడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ‌రి పేరుతోనే ఆక‌ర్షించిన ఈ చిత్రం.. సినీప్రియుల‌కు ఎలాంటి క‌థ‌ని రుచి చూపించింది? అది వారిని మెప్పు పొందిందా? లేదా?

క‌థేంటంటే: ఫ‌ణి భూపాల్ (జ‌గ‌ప‌తిబాబు) పెద్ద బిజినెస్ మ్యాన్‌. ఓ పేరున్న కండోమ్ కంపెనీకి అధినేత‌. త‌న వ్యాపారానికి తగ్గట్లుగానే..  ప్లేబాయ్‌లా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. 60ఏళ్ల వ‌య‌సులోనూ న‌వ మ‌న్మథుడిలా అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతుంటాడు. అత‌ని త‌న‌యుడు కార్తీక్ (రామ్ కార్తీక్‌).  చిన్నప్పుడే త‌ల్లి పోవ‌డంతో కొడుకుని గారాబంగా పెంచుకుంటుంటాడు.  కార్తీక్ అనుకోని ప‌రిస్థితుల్లో తొలి చూపులోనే ఉమ(అమ్ము అభిరామి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ, అప్పటికే ఆమెకి మ‌రొక‌రితో నిశ్చితార్థం జ‌రిగిపోతుంది. అయినా ఆమె ప్రేమ‌ని ద‌క్కించుకోవ‌డం కోసం కార్తీక్ ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు చేస్తూనే ఉంటాడు. స‌రిగ్గా ఉమ.. కార్తీక్‌పై ప్రేమ‌ను పెంచుకునే స‌మ‌యంలోనే.. ఫ‌ణి వ‌ల్ల జ‌రిగిన అనుకోని పొర‌పాటు వ‌ల్ల ఈ ఇద్దరి ప్రేమ చిక్కుల్లో ప‌డుతుంది.  ఇదే స‌మ‌యంలో ఈ తండ్రీ కొడుకుల జీవితంలోకి చిట్టి (బేబీ స‌హ‌శ్రిత‌) ప్రవేశిస్తుంది. మ‌రి ఆ పాప ఎవ‌రు? త‌నొచ్చాక ఫ‌ణి - కార్తీక్‌ల జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుంది? ఆఖ‌రికి కార్తీక్ - ఉమాల ప్రేమకి శుభం కార్డు ప‌డిందా?  లేదా? అన్నది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే నాలుగు పాత్రల చుట్టూ తిరిగే క‌థ ఇది. తండ్రీ కొడుకుల అనుబంధాల నేప‌థ్యంతో సాగే ఓ విభిన్నమైన ప్రేమ‌క‌థతో తెర‌కెక్కించారు. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఇంట్లో ఉండ‌గా.. 60ఏళ్ల వ‌య‌సులో తండ్రి మ‌ళ్లీ ఓ తండ్రి కావ‌డం.. దాని వ‌ల్ల కొడుకు ప్రేమ ఇబ్బందుల్లో ప‌డ‌టం వంటి అంశాల‌తో క‌థ‌కు ఓ కొత్తద‌నం అద్దే ప్రయ‌త్నం చేశారు. ఇది తెలుగు ప్రేక్షకుల‌కు కొత్తగా అనిపించినా..  బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ త‌ర‌హాలో ‘బదాయి హో’ వంటి చిత్రాలొచ్చాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల‌కు అలాంటి ఓ తెలిసిన క‌థ‌నే చూస్తున్నట్లు అనిపిస్తుంది.  ప్రధ‌మార్ధంలో ఎక్కువ‌గా తండ్రీ కొడుకుల అనుబంధం.. ఉమా ప్రేమ కోసం కార్తీక్ ప‌డే ఆరాటం..  ఈ క్రమంలో అత‌ను చేసే ప్రయ‌త్నాలు.. వంటి స‌న్నివేశాల‌తో స‌ర‌దాగా సాగిపోతుంటుంది.

విరామం స‌మ‌యానికి ఉమాకి కార్తీక్‌పై  ద్వేషం ఏర్పడటం.. అదే స‌మ‌యంలో అత‌ని జీవితంలోకి చిట్టి రావ‌డంతో క‌థ ఓ చక్కటి మ‌లుపు తీసుకున్నట్లు అనిపిస్తుంది.  అయితే ఆ మ‌లుపుని దర్శకుడు అంత‌గా ఉప‌యోగించుకున్నట్లు క‌నిపించ‌దు.  ద్వితియార్ధంలో ఉమా - కార్తీక్‌ల మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ చిగురించ‌డం.. ఆ ప్రేమ పెళ్లి పీటలెక్కిద్దామ‌నుకున్న స‌మ‌యంలోనే ఫ‌ణి - చిట్టిల బంధం వ‌ల్ల మ‌ళ్లీ చిక్కుల్లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాల‌తో కాస్త ఆస‌క్తిక‌రంగా మారుతుంది. మ‌ధ్యలో పీహెచ్‌డీగా భ‌ర‌త్ పంచే వినోదం అక్కడక్కడా న‌వ్వించినా క‌థ ఏదో గంద‌ర‌గోళంలా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌ను తీర్చిదిద్దిన విధానం.. ఫ‌ణి భూపాల్ పాత్రతో చెప్పించిన సందేశం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ జ‌గ‌ప‌తిబాబు పాత్ర.  ఫ‌ణి భూపాల్‌గా ప్లేబాయ్ పాత్రలో ఆయ‌న చూపిన అభిన‌యం అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాక క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. అలాగే  కొడుకు ప్రేమ‌ కోసం తాపత్రయ ప‌డే తండ్రిగా క్లైమాక్స్‌లో ఆయ‌న ప‌లికించిన భావోద్వేగాలు అంద‌రినీ క‌ట్టిప‌డేస్తాయి.  అయితే క‌థ అడ‌ల్ట్ కంటెంట్‌తో నిండిన‌ది కావ‌డం.. దీనికి త‌గ్గట్లుగా క‌థ‌లో వినిపించే ద్వంద్వార్థ సంభాష‌ణలు  కుటుంబ ప్రేక్షకుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు.  దర్శకుడు క‌థ‌ని తెర‌పై  చక్కగా చూపించే ప్రయ‌త్నం చేసినా.. క‌థ‌లో స‌రైన బ‌లం లేక‌పోవ‌డం.. ద్వంద్వార్థ సంభాష‌ణ‌ల‌పై ఆధార‌ప‌డి కామెడీ ట్రాక్‌ల‌ని అల్లుకోవ‌డం వంటివి అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంటాయి.  కార్తీక్ త‌న పాత్రకు న్యాయం చేశాడు. ఉమాతో ప్రేమ స‌న్నివేశాలు.. క్లైమాక్స్‌లో వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాల్లో అత‌ని న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఉమాగా అమ్ము అభిరామి అభిన‌యం మెప్పిస్తుంది. చాలా స‌న్నివేశాల్లో కేవ‌లం క‌ళ్లతోనే భావోద్వేగాలు ప‌లికించి క‌ట్టిప‌డేసింది.  సాంకేతిక ప‌రంగా భీమ్స్ సిసిరోలియో సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు మూడు పాట‌లు తెర‌పై చూస్తున్నప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ వినొచ్చు అనిపించాయి.  జి.శివ సినిమాటోగ్రఫీ చిత్రానికి మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. అలీ, భ‌ర‌త్‌, రామ్ ప్రసాద్‌ తదిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు  బాగానే న‌వ్వించారు.

బ‌లాలు బ‌ల‌హీన‌తలు
+ జ‌గ‌ప‌తిబాబు పాత్ర - బ‌ల‌హీన‌మైన క‌థ‌నం
+ యువ‌త‌రాన్ని మెప్పించే క‌థ‌ - ద్వంద్వార్థ సంభాష‌ణ‌లు
+  ప్రథమార్ధం, క్లైమాక్స్‌  

చివ‌రిగా: కొంచెం వినోదం.. మ‌రికొన్ని భావోద్వేగాలతో ‘ఎఫ్‌సీయూకే’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని