Pawan Kalyan: పవన్‌ మేనియా.. రికార్డులు సృష్టిస్తోన్న పవర్‌స్టార్‌ చిత్రం!!

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద గత కొన్నిరోజులుగా పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) మేనియా కనిపిస్తోంది. పవర్‌స్టార్‌ నటించిన ‘జల్సా’ (Jalsa) రికార్డులు...

Updated : 04 Sep 2022 11:18 IST

హైదరాబాద్‌: ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద గత కొన్నిరోజులుగా పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) మేనియా కనిపిస్తోంది. పవర్‌స్టార్‌ నటించిన ‘జల్సా’ (Jalsa) రికార్డులు సృష్టిస్తోంది. రీ రిలీజ్‌లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసినట్లు సినీ ప్రముఖులు, పవర్‌స్టార్‌ అభిమానులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎన్నికోట్ల వసూళ్లు రాబట్టిందంటే..?

సంజయ్‌ సాహుగా పవన్‌ కల్యాణ్‌ నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘జల్సా’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని సెప్టెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. కేవలం ఈ ఒక్కరోజే సుమారు 702 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శించిన ప్రతిచోటా మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే రూ.3.20 కోట్లు వసూలు చేసిందని, రీ రిలీజ్‌లో ఒక సినిమా ఇన్నికోట్లు సాధించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. పవన్‌ చిత్రం సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిందని చెబుతున్నారు. మరోవైపు, ఇటీవల మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ని రీ రిలీజ్‌ చేయగా.. రూ.1.73 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

రీ రిలీజ్‌ ట్రెండ్‌ షురూ..!

స్టార్‌ హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్‌, ఫీల్‌గుడ్‌ చిత్రాలను ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేసి రీ రిలీజ్‌ల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇలా, 4కె వెర్షన్‌లో విడుదలైన మహేశ్‌బాబు ‘పోకిరి’, పవన్‌కల్యాణ్‌ ‘జల్సా’ సత్ఫలితాలు అందుకున్నాయి. చాలా రోజుల తర్వాత హౌస్‌ఫుల్‌ బోర్డులతో థియేటర్లు అన్నీ కళకళలాడాయి. దీంతో ఈ రీ రిలీజ్‌ ట్రెండ్‌ బాగుందని నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ నటించిన ‘బిల్లా’ని ఆ హీరో పుట్టినరోజున మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక, సెప్టెంబర్‌ 8న ధనుష్‌ - శ్రుతిహాసన్‌ నటించిన ‘3’ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ని 4కె వెర్షన్‌లో విడుదల చేస్తామని, గ్రాండ్‌ లెవల్‌లో దీన్ని రీ రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని