‘జల్సా’ అలా మొదలైంది.. ట్రెండ్‌ సెట్‌ చేసింది!

పవన్‌ కల్యాణ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘జల్సా’. పవన్‌ స్టామినా చూపించిన ఈ సినిమా విడుదలై నేటికి పదమూడేళ్లు.

Updated : 07 Dec 2022 18:56 IST

పవన్‌ కల్యాణ్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘జల్సా’. పవన్‌ స్టామినా చూపించిన ఈ సినిమా విడుదలై నేటికి పదమూడేళ్లు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం...

‘బంగారం’ చిత్ర షూటింగ్‌ సమయంలో పవన్‌ని కలిశారు దర్శకుడు త్రివిక్రమ్‌. ముందుగా సంజయ్‌ సాహు పాత్ర తీరుని వివరించారు. అది పవన్‌కి అమితంగా నచ్చడంతో  పూర్తి కథని సిద్ధం చేయమని త్రివిక్రమ్‌కి చెప్పారు. పవన్‌ మీద ఇష్టంతో, ఆయనతో సినిమా చేయాలనే కోరికతో కొన్ని రోజుల్లోనే స్ర్కిప్టుని పూర్తి చేశారు త్రివిక్రమ్‌. అలా ‘బంగారం’ పూర్తవగానే ‘జల్సా’ పట్టాలెక్కించారు పవన్‌ కల్యాణ్‌. త్రివిక్రమ్‌ మాటలు, పవన్‌ నటన, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సినీ ప్రియులతో జల్సా చేయించాయి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇలియానా, పార్వతి మిల్టన్‌ల అందం, బ్రహ్మానందం, సునీల్‌, ఆలీ హాస్యం, ముఖేష్‌ రిషి విలనిజం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి.

ప్రత్యేకతలు:

* దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు అప్పట్లో ఓ సంచలనం. ప్రతిపాట సూపర్‌ హిట్‌ అయింది. ఆడియో సీడీలే రూ.కోటి రాబట్టాయి. ‘గాల్లో తేలినట్టుందే’ పాట రూ.కోటి బడ్జెట్‌తో తెరకెక్కించారు.

* ప్రముఖ కథానాయకుడు మహేశ్‌ బాబు సంజయ్‌ సాహుని పరిచయం చేయడం (వాయిస్‌ ఓవర్‌) అభిమానులకు కొత్త అనుభూతి పంచింది.

* ఫస్ట్‌ లుక్‌, ఆడియో విడుదల వేడుక ట్రెండ్‌ ఈ సినిమాతోనే ప్రారంభమైంది.

* మొబైల్‌ గేమ్‌ రూపొందిన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.

‘త్రివిక్రమ్‌ తెరకెక్కించే విధానం, ఆయన పద్ధతి నాకు విపరీతంగా నచ్చాయి. సినిమాకు సంబంధించే కాదు నిజ జీవితంలో మంచి స్నేహితులమయ్యాం’.. జల్సా ముందస్తు విడుదల వేడుకలో పవన్‌ కల్యాణ్‌ అన్న మాటలివి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని