No Time To Die: జేమ్స్‌ బాండ్‌ ‘నో టైమ్‌ టు డై’ ప్రత్యేకతలివే!

James Bond: బాండ్‌ కొత్త సినిమా ‘నో టైమ్‌ టు డై’ గురించి తెలుసా?

Published : 30 Sep 2021 09:22 IST

జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'నో టైమ్ టు డై' విడుదలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సందడి మొదలైంది. బాండ్‌గా డేనియల్ క్రెగ్ కి ఇది చివరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. హాలీవుడ్ సినిమాల అభిమానులకి యాక్షన్ విందును అందించేందుకు బాండ్ సిద్ధమైయ్యాడు. ఈ సందర్భంగా 'నో టైమ్ టు డై' ప్రత్యేకతలేంటో ఓ సారి చూద్దాం. 

* జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో వస్తున్న 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’. బాండ్‌గా డేనియల్‌ క్రెగ్‌కి ఇది చివరి చిత్రం. ఇప్పటివరకు క్రెగ్‌ ఐదు సార్లు జేమ్స్‌ బాండ్‌గా అదరగొట్టాడు. ‘కాసినో రాయల్‌’తో నయా బాండ్‌గా అవతరించిన క్రెగ్‌... ‘స్కైఫాల్’‌, ‘స్పెక్టర్’‌, ‘క్వాంటమ్‌ సోలస్‌’తో మూడు బిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించిపెట్టాడు. 
* దాదాపు 300 మిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో ‘నో టైమ్‌ టు డై’ నిర్మించారు. జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక బడ్జెట్‌.

మొదటిసారి ఈ సినిమా కోసం ఒక అమెరికన్‌ డైరెక్టర్‌ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ‘బీస్ట్స్‌ ఆఫ్‌ నో నేషన్‌’తో హాలీవుడ్‌ను ఆకర్షించిన కారీ ఫుకునాగా ‘నో టైమ్‌ టు డై’కి దర్శకుడు.
వాస్తవానికి ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ దర్శకుడు డాని బోయెల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సింది. అనివార్య కారణాల వల్ల  ఆయన మధ్యలోనే విరమించుకున్నారు.
* సినిమా చిత్రీకరణ అనేక ఇబ్బందులతో సాగింది. డేనియల్‌ క్రెగ్‌ గాయపడటం వల్ల షూటింగ్‌ కొన్నాళ్లు ఆగింది. షూటింగ్‌ బృందంలో కొందరు కరోనా బారిన పడటంతో మరికొన్నాళ్లు ఆగిపోయింది. ఇలా అనేక కష్టాలు పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

(రమీ మాలెక్‌, క్రిస్టోఫ్‌ వాల్ట్స్‌)

* ఇద్దరు ఆస్కార్‌ నటులు ఈ సినిమాలో విలన్లుగా నటించారు. ‘బొహిమినియన్‌ రాప్సోడి’తో ఆస్కార్‌ను ముద్దాడిన రమీ మాలెక్‌ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. రెండు ఆస్కార్లు గెలిచిన క్రిస్టోఫ్‌ వాల్ట్స్‌ ‘నో టైమ్‌ టు డై’లోనూ నటించారు. ఆయన గతంలో స్పెక్టర్‌’లోనూ నటించారు.

(హన్స్‌ జిమ్మర్‌)

* ‘లయన్‌ కింగ్’‌, ‘గ్లాడియేటర్’‌, ‘ది డార్క్‌ నైట్’‌, ‘ఇన్సెప్షన్‌’ లాంటి సినిమాలకు నేపథ్య సంగీతమందించిన దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్‌ జిమ్మర్‌ ‘నో టైమ్‌ టు డై’కి పని చేశారు. ఆయన బాండ్‌ సినిమాలకు పనిచేయడం ఇదే తొలిసారి.  

(సినిమాటోగ్రాఫర్‌ లైనస్‌ సాండ్‌గ్రెన్‌)

* హాలీవుడ్‌ ప్రేమకథా చిత్రం ‘లాలా ల్యాండ్‌’తో ఆస్కార్‌ అందుకున్న సినిమాటోగ్రాఫర్‌ లైనస్‌ సాండ్‌గ్రెన్‌. ‘నో టైమ్‌ టు డై’ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. జేమ్స్‌ బాండ్‌ను ఆయన మరింత స్టైలిష్‌గా చూపించారనేది ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతుంది.

(బిల్లీ ఐలిష్‌)

* జేమ్స్‌ బాండ్‌ సినిమాపైనే కాదు, ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌పైనా అదే స్థాయి అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్గకుండా ‘నో టైమ్‌ టు డై’ ఒరిజినల్‌ సాంగ్‌ అదరగొట్టింది. 18 ఏళ్ల యువ సంచలనం బిల్లీ ఐలిష్‌ ఈ పాట పాడటం విశేషం. ఇంత చిన్న వయసులోనే బాండ్‌కి పాట పాడిన గాయకురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. ‘స్పెక్టర్‌’కు సామ్‌ స్మిత్‌ పాడిన ‘రైటింగ్‌ ఆన్‌ ది వాల్‌’ పాటకీ మంచి ఆదరణ లభించింది.

( ఫిబీ వాలర్‌ బ్రిడ్జ్‌)

*  బాండ్‌ సినిమాలకు ఇదివరకు ఒకే ఒక్క మహిళా రచయిత పనిచేశారు. బాండ్‌ సిరీస్‌లో మొదటి రెండు చిత్రాలైన ‘డాక్టర్‌ నో’, ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’ సినిమాలకు జొహన్నా హర్వుడ్‌ అనే రచయిత్రి పని చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో రచయిత్రి బాండ్‌ పాత్రను తీర్చిదిద్దారు. ఫిబీ వాలర్‌ బ్రిడ్జ్‌ ‘నో టైమ్‌ టు డై’ స్ర్కిప్ట్‌ పనుల్లో పాలుపంచుకున్నారు. డేనియల్‌ క్రెగ్‌ పట్టుపట్టి మరీ ఆవిడను ఈ సినిమా పనుల్లో భాగం చేశారు. ఆమె రచనలో బాండ్‌ మరింత పదునుగా కనిపించనున్నాడనేది ట్రైలర్‌ చూస్తే తెలిసిపోతుంది. ఆమె కేవలం రచయిత్రి మాత్రమే కాదు, మంచి నటిగా కూడా. 

*  లండన్‌, జమైకా, ఇటలీలో భారీ ఎత్తున షూటింగ్‌ జరిగింది. ఆ సన్నివేశాలు యాక్షన్‌ ప్రియులను అలరిస్తాయని తెలుస్తోంది. 

 * గతేడాది వేసవి సెలవులకు రావాల్సిన సినిమా కరోనా కారణంగా అక్టోబరుకి వాయిదా పడింది. కొవిడ్‌ ఉద్ధృతి పెరిగే కొద్ది సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. సినిమా విడుదల తేదీని ఈ ఏడాది ఏప్రిల్‌కి మార్చారు. సెకండ్‌ వేవ్‌ వదలకపోవడంతో మళ్లీ వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు బాండ్‌. ఏ మేరకు అలరిస్తాడో తెలియాలంటే థియేటర్లకు వెళ్లి తెలుసుకోవాల్సిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని