Jamuna: ‘నువ్వు చేయకపోతే ఉరేసుకుంటాడు’ అన్నారు: జమున జ్ఞాపకాలివి

195 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి జమున. ఆమె మరణంతో టాలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది.

Published : 27 Jan 2023 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి నటి జమున మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె నటించిన చిత్రాలు, పోషించిన విభిన్న పాత్రల గురించి అభిమానలోకం గుర్తు చేసుకుంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో గతంలో ఆమె పంచుకున్న సంగతులివీ..

* జమున అలియాస్‌ జానాబాయి! అప్పటి నుంచే హీరోయిన్లు పేరు మార్చుకోవటం అలవాటా?

జమున: నా అసలు పేరుకి ‘జము’ వచ్చి చేరింది. మా అమ్మగారు పాండు రంగ విఠల సన్నిధానానికి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారు. అప్పుడు నేను కడుపులో పడ్డానట! అందుకే ఆ రోజుల్లో జానాబాయి, సక్కుబాయి అని పెట్టుకునేవాళ్లు. ఉత్తరాదిన యమున నదిని జమున నది అని పిలుస్తారు. అందుకే నన్ను జమున అని పిలిచేవారు.

* మీ మొదటి చిత్రం ‘పుట్టిల్లు’. ఈ పుట్టింటికి రావడానికి ఎలాంటి పరిస్థితులు ఎన్నుకొన్నారు?

జమున: నాకు పదేళ్ల వయసున్నప్పుడు ఎప్పుడూ పాటలు పాడటం, డ్యాన్సులు చేయడమే. స్కూల్లో చాలా యాక్టివ్‌. ఆ సమయంలో దుగ్గిరాలలో కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రజా నాట్యమండలి ‘మా భూమి’ నాటకంలో నన్ను హీరోయిన్‌గా తీసుకుంది. దాని అధ్యక్షుడు గరికపాటి రాజారావు ‘మా భూమి’లో నన్ను చూసి ‘పుట్టిల్లు’ కోసం ఎంపిక చేశారు. రాజమండ్రి రమ్మని రెండు డైలాగ్‌లు నాతో చెప్పించి నేరుగా హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

* మీ సొంతూరు?

జమున: నేను హంపిలో పుట్టాను. అప్పట్లో నన్ను అందరూ హంపి సుందరి అనేవారు.

* సారథి స్టూడియోతో మీకున్న అనుబంధం?

జమున: హైదరాబాద్‌లో తొలి స్టూడియో సారథి. ఇప్పటికీ దాని పేరు అదే ఉంచారు. చాలా సంతోషం. దానిలో నా తొలి చిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మి’. అందులో మొదటి హీరోయిన్‌, హైదరాబాద్‌కు ఫస్ట్‌ హీరోయిన్‌ జమున. రామినీడు దర్శకుడు. గంగాధరరావు ప్రొడ్యూసర్‌. కానీ, కొంతమంది ‘మేమే చెన్నై నుంచి సినిమాను హైదరాబాద్‌కు తెచ్చాం’ అని చెబుతూ ఉంటారు. అది మంచిది కాదు. ‘మా ఇంటి మహాలక్ష్మి’, ‘పెళ్లికాని పిల్లలు’, ‘జల్సారాయుడు’ ఇలా నిర్మాత గంగాధరరావు ఇక్కడ తీశారు. అన్ని సినిమాల్లో నేను, హరినాథ్‌, జగ్గయ్య నటించాం. ఆ రోజుల్లో ఇక్కడే ఉండేవాళ్లం. అంతా అడవి. మెట్లు దిగి స్టూడియో ఫ్లోర్‌లోకి వెళ్తుంటే జగ్గయ్యగారు అల్లరి చేసేవారు. ‘అమ్మాయి! ఇక్కడ ఉంటున్నావ్‌. ఇక్కడ దెయ్యాలుంటాయి. చాలా మంది ఉరివేసుకుని చచ్చిపోయారట’ అని భయపెట్టేవారు.

* ‘మూగమనసులు’ సినిమాలో మీరు ‘గోదారీ గట్టుంది..’ పాటలో ‘పిట్ట మనసులో ఏముంది’ అని పాడతారు? ఇంతకీ పిట్ట మనసులో ఏముందో తెలుసా?

జమున: అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు సినిమా యాక్టర్‌ని కావాలని కోరిక ఉండేది. నాగేశ్వరరావు గారు నటించిన ‘కీలుగుర్రం’ ప్రభావం నాపై ఎక్కువ. ఇంటి దగ్గర రోలుపై కాలుపెట్టి ‘కాదు సుమా.. కల కాదు సుమా..’ అంటూ పాడేదాన్ని. ప్రతిదీ బాగా పరిశీలనగా చూసేదాన్ని. అలా నటన బాగా అలవడింది. అదే నేను సినిమాల్లోకి రావడానికి కారణమైంది

* రాజమండ్రితో మీ అనుబంధం?

జమున: ఏపీ ప్రొఫెషనల్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌ ఫెడరేషన్‌కు నేను అధ్యక్షురాలిని. ఆరేడువేల మంది సభ్యులు. అప్పుడు చెన్నారెడ్డిగారి హయాంలో రాజమండ్రిలోని 25 మంది నిరుపేద కళాకారులకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇప్పించా. కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండగా, ఇందిరాగాంధీ పిలిచి చాలా పనులు అప్పగించారు. (మధ్యలో అలీ మాట్లాడుతూ.. మీరు రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేశారు. నా చిన్నప్పుడు మా అమ్మని అడిగా ‘ఎవరికి ఓటు వేశావు’ అని ‘జమునకు ఓటు వేసి వచ్చా’నని అన్నారు. నవ్వులు..)

* హీరోయిన్‌గా, రాజకీయ నాయకురాలిగా, భార్యగా సక్సెస్‌ అయ్యారు ఆ విశేషాలు..

జమున: పెళ్లి సంబంధం నిశ్చయమయ్యాక ‘సీఐడీ’లో నటించా. అందులో ‘నిన్ను కొంగుకు కట్టుకుని తిప్పాలని..’ అంటూ రామారావు గారిని ఏడిపిస్తూ పాటపాడాలి. అలాగే పెళ్లయ్యాక మా వారిని కూడా ఏడిపించేదాన్ని. ఆయన నన్ను ‘డాలీ’ అని పిలిచేవారు. నేను కూడా ఆయనను ‘డాలీ’ అని పిలిచేదాన్ని..

* మిమ్మల్ని అంతగా ప్రేమించే మీవారు.. ఎందుకు బాత్రూంలో పడుకొన్నారు?

జమున: ఓసారి ‘ఎక్సో 70 జపాన్‌’ కార్యక్రమం నిమిత్తం జపాన్‌ వెళ్లాం. మా వారికి జాతకాలు అంటే నమ్మకం. మేము వెళ్దామనుకున్న రోజు మంచిది కాకపోవడంతో ముందు రోజే బయలుదేరి హోటల్‌లో ఉండి, అక్కణ్నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్దామన్నారు. నేను సరేనన్నా. హోటల్‌కి వెళ్లాం. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. ఆయన కోసం వెతికా ఎక్కడా కనపడలేదు. ఆఖరికి బాత్రూంకు వెళ్లి చూడగా, టబ్బులో చలికోటు.. మంకీక్యాప్‌ పెట్టుకుని రెండు మూడు రగ్గులు కప్పుకొని పడుకొన్నారు. ఆయనకు ఏసీ అంటే పడదు.. నేను ఏసీ లేనిదే ఒక్క క్షణం ఉండలేను. ఆయనది గొప్ప మనసు. 49 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒకమ్మాయి.

* ఆ రోజుల్లో కేవలం మీతోనే నటించాలని ఓ నిర్మాత చాలా ప్రయత్నించారట.  మిమ్మల్ని ఎలా ఒప్పించారు?

జమున:  ఆయన పేరు సీతారామ్‌. జమునతో నటించాలని ఆయనకు పిచ్చి. సినిమాలోనైనా కాస్త చేయిపట్టుకోవచ్చు కదా.. అని మోజు (నవ్వుతూ). మొత్తానికి ‘బొబ్బిలి యుద్ధం’ తీశాడు. దీని గురించి తొలుత డీఎల్‌ నారాయణగారు నా వద్ద ప్రస్తావించారు. ‘మరి కాంబినేషన్‌ ఎవరు’ అని అడిగా. రామారావుగారు-భానుమతి, ‘మీరు సీతారామ్‌’ అని అన్నారు. ‘నేను చేయను’ అన్నాను. ‘జమున పక్కన సీతారామ్‌ను చూస్తే అంత పెద్ద పిక్చర్‌ హిట్‌ కాకపోగా, డబ్బాలు వెనక్కి వచ్చేస్తాయి’ అని అన్నా. ఇక డీఎల్‌గారు రోజూ వచ్చి బతిమలాడేవారు ‘అమ్మా నువ్వు చేయకపోతే ఉరేసుకుని చచ్చిపోతాడు’ అని అడిగేవారు. చివరకు చేశా!

* సెట్స్‌లో మీకు ఎవరితోనైనా గొడవ వచ్చిందా?

జమున: మహా పెద్దావిడతోనే వచ్చింది. ఆవిడే జయలలిత. తమిళనాడును ఒక ఊపు ఊపేసిన మా అందాల నటితోనే గొడవ వచ్చింది. జయలలిత నేనూ ‘శ్రీకృష్ణ విజయం’లో నటిస్తున్నాం. ఆవిడ హీరోయిన్‌. నేను సత్యభామ. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. సెట్స్‌లో అందరం రిహార్సల్‌ చేస్తున్నాం. కానీ, ఆమె మాత్రం చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాళ్లు. డైలాగ్‌లు చెప్పమంటే చెప్పేవారు కాదు. ఈ విషయాన్ని దర్శకుడికి చెబితే ఏం మాట్లాడలేదు. నాకు కోపమొచ్చి అలిగా. మేకప్‌ తీసేసి వెళ్లిపోతానన్నా. ఇక దర్శకుడు, నిర్మాత మల్లెమాల వచ్చి ఒప్పించారు. ఆ తర్వాత ఆమె నటన చూసి పెద్ద ఫ్యాన్‌ అయిపోయా. నిజంగా హ్యాట్సాప్‌.

* హిందీ చిత్ర పరిశ్రమలో అందగత్తె ఎవరంటేహేమమాలిని అనేవారు. దక్షిణాదిలో ఎవరంటే మీ పేరే చెప్పేవారు. మీ అందానికి కారణం?

జమున: ఇప్పుడు నాకు 82 ఏళ్లు. ఎవ్వరూ నమ్మరు. నేను పూర్తి శాకాహారిని. ఈ వయసులో కూడా రోజు విడిచి రోజు యోగా చేస్తా. శరీరం కంట్రోల్‌లో ఉంది.

* మద్రాసులో మీ స్నేహితులు? సరదా సంఘటన?

జమున: ‘మిస్సమ్మ’ షూటింగ్‌లో సావిత్రి నేనూ బాగా క్లోజ్‌. ఎప్పుడూ అక్కా.. అక్కా అని పిలుస్తుండే దానిని. ఒకరోజు భోజనానికి కూర్చున్నాం. మా ఇంటి నుంచి నా భోజనం వచ్చింది. వాళ్లేమో మాంసాహాహార ప్రియులు. తొలిసారి నేను మాంసాహారం చూడటం కూడా అదే. ‘ఏంటి అక్కయ్యా అది’ అని అడిగా. ‘మాంసం.. తింటావా’ అంది. ‘ఛీ పాడు’ అన్నా. పక్కనున్న నా నెత్తిపై ఒకటి కొట్టి.. ‘మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావ్‌! పక్కన వాళ్లు బాధపడతారు. నీకు ఇష్టం లేకపోతే దూరంగా కూర్చో’ అంది.

* ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా నటించిన మీరు కృష్ణుడైన రామారావుగారిని తలపై తన్నారు కదా! ఆ టైమ్‌లో మీ ఫీలింగ్‌ ఏంటి?

జమున: తన్నిన వెంటనే సారీ చెప్పా! మామూలుగా సారీ చెప్పే తత్వం కాదు నాది. నాకు కృష్ణుడంటే అమితమైన భక్తి. ఆయన కృష్ణావతారం కదా! అయ్యో కృష్ణుడినే తన్నానని చాలా బాధపడ్డా. షాట్‌ అయిపోయిన తర్వాత ‘సారీ’ అండీ అంటే.. ‘హహ్హహ్హ.. ఇట్‌ ఈజ్‌ ఆఫ్ట్రాల్‌ యాక్టింగ్‌’ అన్నారు. ఆయన చాలా స్పోర్టివ్‌.

* 1959లో అక్కినేనిగారితో ‘ఇల్లరికం’. మళ్లీ 1962లో ‘గుండమ్మకథ’లో నటించారు? ఈ మూడేళ్లు గ్యాప్‌ ఎందుకు వచ్చింది?

జమున: నిజం చెబుతా! కొంచెం వివాదాస్పదం. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లలో ఒకరికి నా బిహేవియర్‌ నచ్చలేదట. ‘ఏంటి? కాలు మీద కాలేసుకుంటుంది’, ‘టైమ్‌కు రాదు’ అని ఒకరు.. ‘మోస్ట్‌ ట్రబుల్‌సమ్‌ క్యారెక్టర్‌’ అని ఇంకొకరు అనుకున్నారు. ‘ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలంటే.. మనమిద్దరం (ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌) కలిసి తనని సినిమాల నుంచి బహిష్కరించాలి’ అని భావించారట. ‘సరే చేసుకోండి, నా సినిమాలు నాకు ఉన్నాయి’.. అనేకునేదాన్ని. ఎక్కడున్నా అదే నా పద్ధతి. ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అలా మూడేళ్లు పోటాపోటీగా నిలిచా. వాళ్లిద్దరి సినిమాలతో సమానంగా నా చిత్రాలను డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. గెలుపోటములు వాళ్లకీ నాకూ ఉన్నాయి. చివరికి ‘గుండమ్మ కథ’ చేశా. నాగిరెడ్డిగారు, చక్రపాణిగారు పిలిచి సంధి చేశారు. ‘నేనేం తప్పు చేయలేదు. కాలుమీద కాలేసుకోవడం నా అలవాటు’ అని చెప్పా. మా ముగ్గురిని కలిపింది మా గుండమ్మ సూర్యకాంతమ్మ.

* మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?

జమున: 195 సినిమాలు.

* మీకు చిరస్థాయిగా నిలిచిపోయే గౌరీ పాత్ర అంటే ఇష్టమా? చిరకాలం గుర్తుండిపోయే రాణీ మాలినిదేవి పాత్ర ఇష్టమా?

జమున: నా అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలు పడ్డాయి. ‘మూగమనసులు’లో చిన్నపిల్లలా ఉండే పాత్ర. ఇక రాణీ మాలినీ దేవి క్యారెక్టర్‌ చాలా డిగ్నిటీతో కూడినది. రెండూ భిన్నమైనవి. నాకు బాగా ఇష్టం. ‘గోదారీ గట్టుంది’ పాట వస్తుంటే నాగేశ్వరరావు గారు విజిల్‌ వేస్తారు కదా! థియేటర్లలో కూడా ప్రేక్షకులు విజిల్స్‌ వేసేవారు.

* ‘మిస్సమ్మ’లో భానుమతిగారిని మీరు తప్పించారని అంటారు? ఎంతవరకూ నిజం?

జమున: ఇదెక్కడి అపనింద. అప్పటికి నాకు 18 ఏళ్లు కూడా లేవు. ఆవిడకీ నాలాగా పూజలు, పునస్కారాలు చాదస్తం. ‘శ్రావణ మాసంలో పూజ చేసుకుని ఆలస్యంగా వస్తాను’ అని చక్రపాణికి చెప్పమని మధ్యవర్తికి చెప్పారట. అతను చక్రపాణికి చెప్పలేదు. నటులందరూ వచ్చి, సిద్ధంగా ఉంటే ఆమె మాత్రం ఎప్పుడో ఒంటి గంటకు వచ్చారు. చక్రపాణి గారికి కోపం వచ్చి ‘నువ్వు అక్కర్లేదు పో’ అంటే ‘సరేలే నువ్వే పో.. పో..’ అని ఆమె మేకప్‌ తీసేసి వెళ్లిపోయారు. అదీ జరిగింది.

* సావిత్రిని మీరు అక్క అంటుంటారు కదా! మరి చివరి రోజుల్లో మీరు ఆమెకు ఎందుకు జాగ్రత్త చెప్పలేకపోయారు?

జమున: సావిత్రి చాలా క్లోజ్‌. మా ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. చివరి రోజుల్లో ఆమె తాగుడుకు బాగా అలవాటు పడింది. తూలిపోయేది. ఆమె పెళ్లి విషయంలో నేనూ నాగేశ్వరరావుగారు, నాగిరెడ్డి, చక్రపాణిగారు కల్పించుకుని చాలా చెప్పాం. తర్వాత నా కుమారుడి బారసాలకు వచ్చింది. నన్ను కౌగిలించుకుని ఏడ్చింది. అప్పుడు చెప్పా.. ‘వద్దక్కా ఏడవద్దు.. జరిగింది.. జరిగిపోయింది.. అతను ఎలాంటివాడో తెలుసుకుని చేసుకున్నావ్‌. ఇప్పుడు అతని గురించి పట్టించుకోవద్దు. నీకు ఇద్దరు బిడ్డలు వారే నీకు జీవితాన్నిస్తారు’ అని అన్నా. అప్పటికే దొంగతనాలు జరిగి.. మోసాలు జరిగి చాలా పోగొట్టుకుంది.

కొడైకెనాల్‌లో ఉంటే అక్కడికెళ్లి.. ‘అక్కా నా మాట విను.. ఈ ఇల్లు అమ్మేసి కోటి రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకో. అప్పుడెలా హుందాగా ఉన్నావో.. ఇప్పుడూ అలా ఉండొచ్చని చెప్పా. ఆ తరవాత కొంతకాలానికే ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. తరవాత నేనొక పని మీద చెన్నై వెళ్లినప్పుడు అక్కని చూడ్డానికి వెళ్లా. భారీ మనిషి సన్నగా అయిపోయింది.. నాకు ఏడుపొచ్చేసింది. ముఖ్యమంత్రి అంజయ్యగారికి ఫోన్‌ చేశా. ‘సర్‌ మా అక్క ఈ దుస్థితిలో ఉంది. ఆమెను అమెరికాకు పంపించి వైద్యం చేయించండి’ అని కోరా. ఆయన ఆ ఏర్పాట్లకు ఆదేశించారు. వైద్యులు మాత్రం అప్పటికే పరిస్థితి చేజారింది అని చెప్పేశారు.

* ఎన్టీఆర్‌.. ఏఎన్‌ఆర్‌ ఎవరితో ఎక్కువ కంఫర్ట్‌గా ఉండేవారు?

జమున: వారిద్దరి మనస్తత్వాలు చాలా విచిత్రం. నాగేశ్వరరావు గారితో ఏ ఆర్టిస్ట్‌ అయినా కంఫర్ట్‌గా చేయొచ్చు. రామారావు గారు తన పనేంటో తాను చూసుకుంటారు. ఇతర విషయాల్లో కలగజేసుకోరు.

* శోభన్‌బాబు గారితో నటించలేదా?

జమున: హీరోయిన్‌గా ‘తహసీల్దార్‌గారి అమ్మాయి’ చిత్రంలో చేశా. ‘బంగారు తల్లి’లో తల్లి పాత్రలో నటించా. ఆ తర్వాత నటించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు