Janhvi Kapoor: అమ్మతో పోల్చడం ఓ గొప్ప ప్రేరణ

‘‘అమ్మతోనూ... ఆమె నటనతోనూ పోలుస్తున్నారని నేనెప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. ఒక నటిగా అది నాకొక గొప్ప ప్రేరణగా భావిస్తా. అలాంటి వారసత్వం నాకు ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అన్నారు జాన్వీకపూర్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’.

Updated : 03 Nov 2022 07:51 IST

‘‘అమ్మతోనూ... ఆమె నటనతోనూ పోలుస్తున్నారని నేనెప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. ఒక నటిగా అది నాకొక గొప్ప ప్రేరణగా భావిస్తా. అలాంటి వారసత్వం నాకు ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అన్నారు జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’ (Mili). సన్నీకౌశల్‌ ముఖ్యభూమిక పోషించారు. మతుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్‌ నిర్మాత. చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రచారంలో భాగంగా ‘మిలి’ బృందం బుధవారం హైదరాబాద్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ ‘‘మా నాన్న నిర్మాణంలో నేను చేసిన తొలి సినిమా ఇది. మైనస్‌ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజులపాటు చిత్రీకరణ చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రీకరణ చేయడం చాలా కష్టం. ఇలాంటి పాత్రలో నటించడంతో మానసికంగా మరింత బలంగా తయారయ్యా. ఈ సినిమాలో పాత్రకోసం ప్రత్యేకంగా ఏమీ సన్నద్ధం కాలేదు. సుదీర్ఘమైన సన్నివేశాల్లో చాలా సహజంగా నటించేందుకు ప్రయత్నించా’’ అన్నారు. దక్షిణాదిలో నటించే విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘అమ్మానాన్నలకి ఇక్కడ ఎంత ప్రేమ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా దక్షిణాదిలో సినిమా చేయాలనుకుంటున్నా. త్వరలోనే చేసే అవకాశం ఉంద’’ని చెప్పారు. బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంలో జాన్వి, దర్శకుడు మతుకుట్టి ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. అయినా సరే, చిత్రీకరణ విషయంలో రాజీపడకుండా పనిచేశారు. నా సతీమణి శ్రీదేవికి తెలుగులో అత్యుత్తమ ఆదరణ దక్కింది. జాన్వికి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు ఇక్కడ దక్కుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని