Janhvi Kapoor: మానసికంగానూ ఇబ్బంది పడ్డా.. పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకున్నా: జాన్వీ కపూర్‌

తన కొత్త సినిమా ‘మిలీ’ సినిమా విశేషాలు పంచుకుంది జాన్వీ కపూర్‌. మిలీ పాత్ర కోసం తానెంత కష్టపడిందంటే..?

Published : 01 Nov 2022 10:58 IST

ముంబయి: ఒక్కో యాక్టర్‌కు ఒక్కో పాత్ర సవాలు విసురుతుంది. దాన్ని స్వీకరించి ముందుకెళ్లినప్పుడే అసలైన నటన బయటకు వస్తుంది. ‘మిలీ’ (Mili) రూపంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)కు ఈ పరిస్థితే ఎదురైంది. మైనస్‌ 16 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా ఆమె నటించింది. మలయాళ సినిమా ‘హెలెన్‌’కు రీమేక్‌గా దర్శకుడు మత్తుకుట్టి జేవియర్‌ తెరకెక్కించిన ‘మిలీ’ నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె పంచుకున్న విశేషాలివీ..

‘‘ఈ చిత్రంలో నేను మిలీ నౌదియార్‌ (బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థి)గా కనిపిస్తా. దర్శకుడు సూచన మేరకు పాత్రకు సెట్‌ అయ్యేలా 7.5 కేజీల బరువు పెరిగా. ఈ సినిమా విషయంలో శారీరకంగానేకాదు మానసికంగా ఇబ్బంది పడ్డా.  నేను పోషించిన పాత్ర (ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టు)కు సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి. సరిగా నిద్రపట్టేది కాదు. దాంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజులు పెయిన్‌ కిల్లర్స్‌ వాడా. నాతోపాటు మా దర్శకుడూ అస్వస్థతకు గురయ్యారు. రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండాల్సి వస్తే, అక్కడ ఓ ఎలుక మీ వేళ్లను కొరుకుతుంటే ఎలా ఉంటుంది? ఊహించడమే కష్టంగా ఉంది కదా. అలాంటి నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఇది మంచి సినిమా.. విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం నాకుంది’’

‘‘ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం పనిచేస్తూనే ఉండాలని మా అమ్మ చెప్పింది. మన పనిని నిజాయతీగా, అవిశ్రాంతంగా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది నా అనుభవంలో నేర్చుకున్నా. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి రావటంతో నాపై ఇప్పటికీ విమర్శలు వస్తుంటాయి. ‘ప్రతిభలేని’ నటి అంటూ వచ్చే కామెంట్లపై పోరాడుతూనే ఉన్నా. దీని గురించి ప్రస్తావించేందుకు నాకు కొంత సమయం పట్టింది. నేను కష్టపడి పనిచేసే అమ్మాయిని. నన్ను నేను నిరూపించుకునేందుకు, నన్ను విమర్శించేవారికి నేనేంటో తెలియజేసేందుకు యుద్ధం చేస్తూనే ఉంటా’’ అని జాన్వీ కపూర్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని