Janhvi Kapoor: నయన్‌తో జాన్వీ పోలిక.. ‘ధడక్‌’ భామ ఏమన్నదంటే?

శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీకపూర్‌కు ‘ధడక్‌’ తప్ప  బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలేవీ లేవు.

Published : 17 Jul 2022 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన జాన్వీకపూర్‌కు ‘ధడక్‌’ తప్ప బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలేవీ లేవు. ఈ క్రమంలో ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ చిత్రానికి రీమేక్‌గా ఇది. డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా జులై 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార నటనతో పోలుస్తూ జాన్వీని ప్రశ్నించగా, అందుకు ఆమె తనదైన రీతిలో సమాధానం చెప్పింది. ఒకప్పుడు తన నటనను తల్లి శ్రీదేవి సహా ఇతర నటుల నటనతో పోల్చేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాంటి పోలికలు అసలు పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

‘‘నా కెరీర్‌ ప్రారంభంలో ఇలాంటి ఆలోచనలే నా మెదడులో తిరుగుతూ ఉండేవి. నిజాయతీగా చెప్పాలంటే ఇతర నటులతో నా నటన పోలుస్తారన్న ఒత్తిడి, అంచనాలు నన్ను నిరంతరం వెంటాడేవి. నా తొలి చిత్రం కూడా రీమేక్‌. స్టార్‌ నటికి కుమార్తెను కావడంతో నా తల్లి నటనతో కూడా నా నటన పోల్చేవారు. ఇప్పుడు అలాంటి వాటి నుంచి విముక్తి పొందాను’’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. మాతృక ‘కోలమావు కోకిల’తో పోలిస్తే ‘గుడ్‌ లక్‌ జెర్రీ’లో చాలా మార్పులు చేశారని జాన్వీ తెలిపారు. జెర్రీ పాత్రకు నయనతార పాత్రకు చాలా తేడా ఉంటుందని వివరించారు. ఉత్తరాది నేటివిటికీ తగినట్లు మార్పులు చేశారని, ఇందులో తాను పంజాబ్‌లో నివసించే బిహారీ అమ్మాయిగా కనిపిస్తానని జాన్వీ వెల్లడించారు.  ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రానికి సిద్ధార్థ్‌ సేన్‌ గుప్త దర్శకత్వం వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని