ఆ వీడియో చూసి బాధపడ్డా: విజయ్‌ దేవరకొండ

నవీన్‌ పోలిశెట్టికి సంబంధించిన ఓ వీడియో చూసి తాను భావోద్వేగానికి లోనయ్యానని నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. నవీన్‌ పోలిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ను....

Published : 15 Mar 2021 18:53 IST

‘లైగర్‌’ కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌

హైదరాబాద్‌: నవీన్‌ పొలిశెట్టికి సంబంధించిన ఓ వీడియో చూసి తాను భావోద్వేగానికి లోనయ్యానని నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. నవీన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ను తాజాగా ఆయన వీక్షించారు. ఈ మేరకు విజయ్‌ కోసం చిత్రబృందం స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘జాతిరత్నాలు’ ఎంతో అద్భుతంగా ఉందని, కుటుంబం సభ్యులు, స్నేహితులతో కలిసి ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌ను వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని విజయ్‌ తెలిపారు.

‘‘జాతిరత్నాలు’ విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చూసి నవీన్‌.. నాగ్‌అశ్విన్‌ను హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఓ వీడియో ఇటీవల నేను చూశాను. అది చూస్తే నాకెంతో బాధగా అనిపించింది. ఈ సినిమా తెరకెక్కించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ప్రియదర్శి కామెడీకి విపరీతంగా నవ్వుకున్నాను. అలాగే నవీన్‌-ప్రియదర్శి-రాహుల్‌ కాంబినేషన్‌ సూపర్‌. ఫరియా నవ్వు క్యూట్‌గా ఉంది. అనుదీప్‌ రాసిన పంచ్‌ లైన్‌లు బాగున్నాయి.’’ అని విజయ్‌ అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా 100 రోజులు ఆడాలని ఆకాంక్షించారు.

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా కథానాయిక. అనుదీప్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్‌, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై స్వప్నాదత్‌, నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్‌’ షూట్‌లో బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన బాక్సర్‌గా, విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని