Jawan: ‘జవాన్‌’ ఆఫర్‌.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!

షారుక్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం ‘జవాన్‌’. ఒక టికెట్‌ కొంటే ఒకటి ఉచితమని చిత్ర బృందం ప్రకటించింది.

Published : 28 Sep 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జవాన్‌’ (Jawan) చిత్ర బృందం సినీ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టింది. గురు, శుక్ర, శనివారం మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పష్టంచేసింది. బుక్‌ మై షో, పేటీఎం మూవీస్‌, పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్‌ వెబ్‌సైట్లు/యాప్‌ ద్వారా చేసే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కే పరిమితం చేసింది. షరతులు వర్తిస్తాయని పేర్కొంది. అభిమానుల విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్‌

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్) వేదికగా షారుక్‌ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ‘ఈ సినిమా టికెట్ల కోసం ఇప్పటికే రూ.4000 ఖర్చయ్యాయి. నా గర్ల్‌ఫ్రెండ్‌ మళ్లీ వెళ్దామంటోంది. వెళ్లనా?’ అని ఓ అభిమాని అడగ్గా.. వెళ్లండి డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంటుందని షారుక్‌ సమాధానమిచ్చారు. ‘సర్‌.. ఆర్థిక సమస్యల కారణంగా జవాన్‌ చిత్రాన్ని ఒక్కసారే చూశా. షారుక్‌ అభిమాని అయితే రెండు సార్లు చూడాలి అని కొందరు హేళనగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి చూడలేను సర్’ అని మరో అభిమాని సారీ చెప్పాడు. మీరు బాధపడకండి.. అంతా మంచే జరుగుతుందని షారుక్‌ రిప్లై ఇచ్చారు. షారుక్‌ హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై షారుక్‌ సతీమణి గౌరీఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరవ్‌ వర్మ మరో నిర్మాత. ఆర్మీ బ్యాప్‌డ్రాప్‌లో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో షారుక్‌ పలు విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుక్‌ ‘పఠాన్‌’ కూడా రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్స్‌ చేసింది. దీంతో ఒకే ఏడాది రెండుసార్లు రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడిగా షారుక్‌ చరిత్ర సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని