Jaya Jaya Jaya Jaya Hey Review: రివ్యూ: జయ జయ జయ జయహే

Jaya Jaya Jaya Jaya Hey review: దర్శనా రాజేంద్రన్‌, బసిల్‌ జోసెఫ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘జయ జయ జయ జయహే’సినిమా ఎలా ఉందంటే?

Updated : 26 Dec 2022 21:18 IST

Jaya Jaya Jaya Jaya Hey review; చిత్రం: జయ జయ జయ జయహే; నటీనటులు: బసిల్‌ జోసెఫ్‌, దర్శనా రాజేంద్రన్‌, అజు వర్గీస్‌, అజీజ్‌, సీతల్‌ తదితరులు; సంగీతం: అంకిత్‌ మేనన్‌; సినిమాటోగ్రఫ్రీ: బబ్లూ ఐజు; ఎడిటింగ్‌: జాన్‌కుట్టీ; రచన: విపిన్‌ దాస్‌, నషీద్‌ మహ్మద్‌; నిర్మాత: లక్ష్మీ వారియర్‌, గణేష్‌ మేనన్‌; దర్శకత్వం: విపిన్‌ దాస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

ఇటీవల కాలంలో కంటెంట్‌ ఉన్న సినిమాలకే థియేటర్‌లో ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. స్టార్లు లేకపోయినా, మంచి కథ, కథనాలతో, రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచితే చాలు. ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆ కోవలోకే వస్తుంది మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’ (Jaya Jaya Jaya Jaya Hey). కేవలం రూ.6కోట్లతో సినిమా తీస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడా సినిమా రూ.50కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. తాజాగా ఓటీటీలోనూ విడుదలైన ఈ సినిమా తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉంది. ఇంతకీ  ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: జయభారతి(దర్శన రాజేంద్రన్‌) స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. ఇంటర్‌ పూర్తయి ఉన్నత చదువులు చదుకోవాలనుకుంటుంది. తర్జనభర్జనల తర్వాత కుటుంబాన్ని ఒప్పించి డిగ్రీలో చేరుతుంది. అయితే, అక్కడ జరిగిన ఒక సంఘటన కారణంగా చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లయిన తర్వాత కూడా ఆపేసిన చదువును పూర్తి చేసి, ఉద్యోగం చేయాలన్నది ఆమె ఆశయం. అందుకు పెళ్లి చూపుల సమయంలో రాజేశ్‌ (బసిల్‌ జోసెఫ్‌) కూడా అంగీకరిస్తాడు. కానీ, పెళ్లయిన తర్వాత అతడిలోని పురుషాహంకారం మేల్కొంటుంది. పైగా చిన్న చిన్నవాటికి కోపం వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ అతడిదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. చీటికిమాటికి జయపై చేయి చేసుకుంటాడు. ఇదే విషయాన్ని జయ తన తల్లిదండ్రులతో చెబితే ‘సర్దుకుపో అమ్మా’ అని సముదాయించే ప్రయత్నం చేస్తారు. కోపం వచ్చినప్పుడల్లా కొడుతున్న రాజేశ్‌పై ఒకసారి జయ తిరగబడుతుంది. ఆమె చర్యకు రాజేశ్‌ కంగుతింటాడు. (Jaya Jaya Jaya Jaya Hey review) జయను చూసి భయపడిపోతుంటాడు. రాజేశ్‌ను జయ కొడుతున్న వీడియో కాస్తా వైరల్‌ అవుతుంది. అప్పుడు ఇటు రాజేశ్‌, అటు జయ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? విడాకుల వరకూ వెళ్లిన ఈ జంట కథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: అమ్మాయి పుట్టిందంటే ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఒక చిన్నచూపు. చిన్నప్పటి నుంచే భయాన్ని నూరిపోస్తూ, కట్టుబాట్లతో పెంచుతారు. చిన్న చిన్న సరదాలకు సైతం అడ్డు చెబుతుంటారు. ఈ కథలో జయ పరిస్థితి కూడా అంతే. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కుటుంబం నుంచి ఆమెకు ఏ మాత్రం సహకారం ఉండదు. అయినా కూడా కష్టపడి చదివి అన్నయ్య కంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో ఆడపిల్లను ఎలా పెంచుతారో వాటన్నింటినీ దర్శకుడు విపిన్‌ దాస్‌ చాలా చక్కగా చూపించారు. ప్రతి సన్నివేశం మన పక్కింట్లో లేదా మన ఇంట్లో జరుగుతున్నట్లు దీన్నొక న్యూఏజ్‌ డ్రామాగా తీర్చిదిద్దారు. రాజేశ్‌తో జయకు వివాహం అయిన దగ్గరి నుంచి అసలు కథ మొదలవుతుంది. (Jaya Jaya Jaya Jaya Hey review) పెళ్లయిన కొత్తలో అత్తారింటికి వెళ్లిన అమ్మాయిలకు అక్కడ ఎదురయ్యే అనుభవాలను చక్కటి హాస్యం పంచుతూ చూపించారు. పెళ్లికి ముందు అన్నింటికీ సరేనన్న భర్త, ఆ తర్వాత ఏది అడిగినా ‘తర్వాత చూద్దాంలే’ అనే మాటతో  ‘పెళ్లి చేసుకుని తప్పు చేశానా’ అన్న భావనతో సగటు అమ్మాయి పడే ఆవేదనతో కూడిన భావోద్వేగాలను జయ పాత్రతో తెరపై చూపిన విధానం మెప్పిస్తుంది. ఎప్పుడైతే జయ తిరగబడి రాజేశ్‌ను కొడుతుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. భార్య భర్తల మధ్య సంధి కుదిర్చేందుకు వచ్చిన రాజేశ్‌ అన్నయ్యతో జయ మాట్లాడే తీరు ఆ పాత్ర ఔన్నత్యాన్ని చెబుతుంది. ఆరు నెలల్లో 21 సార్లు చేయి చేసుకున్న భర్త పదేళ్లలో ఎన్నిసార్లు కొడతాడు? అంటూ చిన్న లెక్క అడిగే జయకు సమాధానం చెప్పే పరిస్థితి అటు ఆమె తల్లిదండ్రులు, ఇటు అత్తింటి వారికి కూడా ఉండదు.

ద్వితీయార్ధంలో పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, హస్యం బాగుంది. చివరిలో వచ్చే కోర్టు సన్నివేశాలు బాగుంటాయి. గృహ‌హింస విష‌యంలో స‌మాజం ఆలోచ‌న తీరును సంభాష‌ణ‌ల ద్వారా చెప్పిన తీరు ఆలోచింప‌జేస్తుంది. భర్తను భార్య కొట్టిందంటే ఎంత అవ‌మానం అని అడిగిన ప్రశ్నకు, అలాంట‌ప్పుడు భార్యను కొట్టడం భర్తకు త‌ప్పు అనిపించ‌డం లేదా? అని జయ స‌మాధానం చెప్పడం ఆక‌ట్టుకుంటుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఎవరూ ఊహించరు. కుటుంబమంతా కలిసి ఓటీటీలో ఒక చక్కటి సినిమా చూడాలంటే ‘జయ జయ జయ జయహే’ (Jaya Jaya Jaya Jaya Hey review) మంచి ఆప్షన్‌. సంసారంలో ఒక స్త్రీకి ఏమేం కావాలో తెలుసా? అని జడ్జి ప్రశ్నకు ‘అనుసరించడం, వంట చేయడం, అదృష్టం’ అని రాజేశ్‌.. ‘మర్యాద, భక్తి, పిల్లలు’ అని వాళ్ల అన్నయ్య.. ‘కరుణ, శాంతి’ అంటూ జయ మావయ్య చెప్పే సమాధానాలు వింటే చాలా కుటుంబాల్లో సగటు ఆడపిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరును దర్శకుడు ఎత్తి చూపిన విధానం సందేశాత్మకంగా ఉంది. సంసారంలో ఒక అమ్మాయికి ముఖ్యంగా ఉండాల్సిన మూడు విషయాలు ఏంటి? మీకూ తెలియదా? అయితే  ‘జయ జయ జయ జయహే’ చూడండి.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాకు ప్రధానబలం జయభారతి పాత్ర పోషించిన దర్శనా రాజేంద్రన్‌. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సగటు అమ్మాయిగా చాలా చక్కగా నటించింది. ఓర్పు అన్న పదానికి మహిళను ప్రతీకగా చెబుతారు. అయితే, పరిస్థితి చేయి దాటినప్పుడు తిరగబడే అపరశక్తిగా మారుతుంది. ఈ రెండు వేరియేషన్స్‌ను దర్శన చాలా చక్కగా పలికించింది. రాజేశ్‌ పాత్రలో బసిల్‌ జోసెఫ్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పాత్రలో నవ్వులు పంచారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. (Jaya Jaya Jaya Jaya Hey review) బబ్లూ సినిమాటోగ్రఫీ, జాన్‌ కుట్టి ఎడిటింగ్‌ బాగుంది. ఆరంభం, ద్వితీయార్ధంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. మహిళల పట్ల వివక్షను ఒక న్యూఏజ్‌ డ్రామాగా విపిన్‌ దాస్‌ చాలా చక్కగా తీశారు. ఊర మాస్‌ పాటలు, ఫైట్స్‌, అసభ్యత కలబోతగా ఉంటేనే సినిమాలు విజయాలు సాధిస్తాయన్న భ్రమను చాలా న్యూఏజ్‌ డ్రామాలు చెరిపేశాయి. అలాంటి వాటిలో మరో ఆణి ముత్యమే ‘జయ జయ జయ జయహే’.

బలాలు: 👍 దర్శకత్వం; 👍 దర్శనా రాజేంద్రన్‌, బసిల్ జోసెఫ్‌; 👍 పాత్రల మధ్య సునిశిత హాస్యం

బలహీనతలు: 👎 ద్వితీయార్ధంలో కొన్ని  సన్నివేశాలు

చివరిగా: జయ జయ జయ జయహే.. ఓటీటీలో విజయహే

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు