Published : 09 Jan 2021 15:50 IST

వెండితెరపై... సీమ పెతాపం

 

శివుడూ.. రైటా? రాంగా?

రాంగన్నా!

ఇలా ఉన్నట్టుండి మమ్మల్ని ఇడిసిపెట్టిపోటం రాంగన్నా.

‘ఏందిరా నువ్‌ మాటాడేది’ అంటావా?

నువ్వు నిట్టూరపన్నా.. ఇదే నిజమన్నా!

మమ్మల్ని ఇడిసిపెట్టిపోటం రాంగన్నా.

ఇంగ.. ఎండితెర మీంద సీమ యాసకు

సిమ్మాసనం ఏసెదెవరు... నా?

నాటక రంగం మీంద ‘అలెగ్జాండర్‌’ను

సూపించెదెవరు...నా?

నటనతో భయపెట్టి, నవ్వించే నువ్వు..

నిజ్జానికి మమ్మల్ని ఏడిపించటం రాంగన్నా.

రంగస్థలానికి రాచరికం తేనికీ...

‘స్టేజి రాచరికం’ కాన్నుంచి ‘అలెగ్జాండర్‌’ దాకా

పోరాటం సేచ్చానే ఉంటివి..!

‘బ్రహ్మపుత్రుడు’ కాన్నుంచి...

‘సరిలేరు నీకెవ్వరు’ దాకా నటన కోసం

ఆరాటం పడ్తానే ఉంటివి..!

ఈ రెండింటి కోసమన్నా... నీ గుండెకాయ నూరేండ్లు కొట్టుకుంటాదిలే అనుకుంటాంటే!

మమ్మల్ని ఇడిసిపెట్టిపోటం రాంగన్నా.

నువ్‌ ఎళ్లిపోయినా... నీ నటన మా కండ్లలో

దీపాలు ఎలిగిస్తానే ఉంటాది..

నువ్‌ ఎళ్లిపోయినా... నీ యాస

మా సెవల్లో మారుమోగతానే ఉంటాది.

ఇది మాత్రం రైటన్నా! జయప్రకాష్‌రెడ్డన్నా!

రాయలసీమ... తెలంగాణ... నెల్లూరు...యాస ఏదైనా సరే... ఆయన నోటి నుంచి వచ్చిందంటే ‘లెస్స పలికారు’ అంటూ చప్పట్లు కొట్టాల్సిందే! ప్రతినాయకుడిగానైనా... హాస్య పాత్రలైనా... ఆయన చేశారంటే... వాటిలో హావభావాలు పోత పోసినట్టే! విలక్షణ నటనకి నిలువెత్తు రూపంలా కనిపించే ఆయనే... జయప్రకాష్‌రెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ జేపీగా పిలుచుకునే ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనది. 

శివుడూ... రైటా? రాంగా?

- ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో జయప్రకాష్‌రెడ్డి డైలాగ్‌ ఇది. తనకి నమ్మిన బంటు అయిన శివుడు పాత్రలో కనిపించే శ్రీహరి ప్రతిసారీ ‘రైట్‌ అన్నా...’ అని చెబుతుంటారు. ఆ డైలాగ్‌కి తగ్గట్టే జయప్రకాష్‌రెడ్డి సినీ ప్రయాణం రయ్‌ రయ్‌ అంటూ దూసుకెళ్లిపోయింది. సీమ యాసకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిపోయారు. అప్పటిదాకా సినిమాల్లో సీమ యాస ఆ స్థాయిలో వినిపించిందే లేదు. జేపీ వచ్చాకే తెరపై సీమ పెతాపం జోరు చూపించింది. ‘రేయ్‌ సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు.. సీమ సందుల్లోకి రారా సూసుకుందాము నీ పెతాపమూ నా పెతాపమూ’.
 ‘ఈ రాయలసీమలో పుట్టి... పగోడిని మట్టి కరిపించలేనోడు బతికినోడైనా సచ్చినోడితో సమానమూ. ఇన్నిదినాలు ఈ అవిటి బతకు యాదానికి బతికినానో తెలుసునా... నీ సావు నాకళ్లారా సూసేదానికీ’ 
ఇలాంటి సంభాషణల్ని జయప్రకాష్‌రెడ్డి తప్ప... ఇంత బాగా ఇంకెవరు చెబుతారు? సీమ భాషకి పేటెంట్‌ హక్కు సొంతం చేసుకున్న నటుడిలా చెలరేగిపోయారాయన. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ పాత్ర అనగానే పరిశ్రమకి జయప్రకాష్‌రెడ్డే గుర్తుకొస్తారంటే ఆ పాత్రలపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. ‘ఏరా థాయ్‌... గబ్బునాయాలా... ఇదేందప్పా...’ ఇలాంటి చిన్న చిన్న మాటల్ని తనదైన శైలిలో పలుకుతూ ఆ పాత్రల్ని పరిపూర్ణం చేశారు. ‘జయం మనదేరా’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాలు మొదలుకొని, ఈ యేడాది ఆరంభంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కెరీర్‌లో వందకిపైగా సినిమాల్లో సీమ యాసతోనే సందడి చేశారు జయప్రకాష్‌రెడ్డి. అలాగని ఆయన ఒక రకమైన పాత్రలకో, యాసకో పరిమితం కాలేదు. సీమతోపాటు...తెలంగాణ, నెల్లూరు, గోదావరి యాసల్లో సంభాషణలు చెబుతూ వినోదాన్ని పంచారు. తొలి నాళ్లల్లో కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు పాత్రల్లో ఒదిగిపోతూ భయపెట్టిన ఆయన... ఆ తర్వాత కామెడీ పాత్రలతో అదే స్థాయిలో నవ్వులూ పండించారు. ఆయన నటనలోని పలు కోణాల్ని తెరపై ఆవిష్కరించారు. నాటకాల నుంచి వచ్చిన జయప్రకాష్‌రెడ్డి మన మట్టివాసన గుభాళించేలా పాత్రల్లో ఒదిగిపోయారు. మనవైన కథల్లో, పాత్రల్లో మన నటులు కనిపిస్తే ఎంత అందంగా ఉంటుందో చాటి చెప్పారు. దర్శకులు సవాళ్లతో కూడిన పాతల్ని అప్పజెప్పిన ప్రతిసారీ ఆయన తన సత్తా ప్రదర్శించారు. ఎలాంటి పాత్రలకైనా సరిపోయే ఆకారం... తనకే ప్రత్యేకం అనిపించే ఆ నవ్వు... సులభంగా పాత్రలో ఒదిగిపోగల నేర్పు... ఇవే జయప్రకాష్‌రెడ్డి బలాలు. దాంతో నవరసాలు పండిస్తూ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరభద్రయ్య, వీరరాఘవరెడ్డి, వెంకటరెడ్డి తదితర పాత్రల్లో ఫ్యాక్షనిస్టుగా అలరించిన ఆయనే... ‘ఎవడిగోల వాడిదే’ చిత్రంలో బండ్రెడ్డి అనే కామెడీ పాత్రతో, ‘కబడ్డీ కబడ్డీ’లో హెడ్‌కానిస్టేబుల్‌గా, ‘ఢీ’లో పెదనాన్నగా, ‘టెంపర్‌’లో హోమ్‌ మినిస్టర్‌గా, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో జేపీగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ‘ఢీ’ సినిమాలో అయితే మాటలే లేకుండా హావభావాలతోనే వినోదం పండించారు జయప్రకాష్‌రెడ్డి. ‘గవర్నమెంటు అంటే గలీజైపోయిందబ్బా... దీనెమ్మ బడవ’ అంటూ మున్సిపల్‌ కమిషనర్‌గా- ‘ఛత్రపతి’లో, ‘ఏం చేస్తున్నా.. పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నావా...’ అంటూ కబడ్డీ కబడ్డీలో హెడ్‌ కానిస్టేబుల్‌గా, ‘భగీరథ’లో పోలీస్‌గా భిన్న యాసల్లో మాట్లాడుతూ నవ్వించారు జేపీ.

* ‘రెడీ’లో చిట్టినాయుడు, ‘కిక్‌’ సినిమాలో ఎస్సైగా ఆయన చేసిన సందడి ఎప్పుడు గుర్తుకొచ్చినా నవ్వుకోవల్సిందే. ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘నిజం’, ‘సీతయ్య’, ‘బిందాస్‌’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘బాద్‌షా’, ‘రేసుగుర్రం’, ‘మనం’, ‘పటాస్‌’, ‘సరైనోడు’, ‘ఖైదీ నంబర్‌ 150’, ‘జై సింహా’, ‘రాజా ది గ్రేట్‌’.. ఇలా ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు జేపీ.

* ‘సొంత ఊరు’, ‘మా అన్నయ్య బంగారం’లాంటి చిత్రాల్లో సహ నటుడిగా గుండె బరువెక్కించే పాత్రలు కూడా చేశారు. మంగళవారం తుదిశ్వాస విడిచి ఆయనను అభిమానించే వారి గుండెలు బరువెక్కించి వెళ్లిపోయారాయన.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని