Published : 25 Feb 2022 01:42 IST

Andhra News: చిరంజీవిని చూస్తే ఏడుపొచ్చింది: జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి: సినీ పరిశ్రమపై కక్ష సాధింపులు వద్దని.. అలా చేసి ఏం సాధిస్తారని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రిలో ఆయన  మీడియాతో మాట్లాడారు.

‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే విధంగా ప్రోత్సహిస్తే అక్కడ సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుంది. అంతేకానీ సినీ నటులకు ఎలాంటి నష్టం ఉండదు. ఎమ్మార్వోలు, పోలీసులు.. అంతా కలిసి సినిమా థియేటర్లపై పడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ను పోలీసులు మర్చిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని సదుపాయాలను సినిమా వాళ్లు వినియోగించుకోవాలని కోరారు. కేటీఆర్‌ హాజరవడంతో పవన్‌ కల్యాణ్‌కి ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఇగో ఉంటుంది. స్వతంత్రంగా కష్టపడి పైకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ లాంటి వారికి ఇంకా ఎక్కవగానే ఉంటుంది. అయితే అన్ని సందర్భాల్లో ఇది పని చేయదు. సినీ పరిశ్రమను నాశనం చేయొద్దు. ఇది రాష్ట్ర మనుగడకు మంచిది కాదు. ఏదైనా ఉంటే ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు, సత్తా ఉన్నవారు. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటికైనా సీఎం జగన్‌ తన వ్యవహార శైలిని మార్చుకోవాలి’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు.

జగన్‌కేనా ఇగో ఉండేది?..

‘‘పవన్‌పై కక్ష సాధింపు ద్వారా సాధించేది ఏమిటి? ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనరేషన్‌ ఆయనకొస్తుంది. ఏదైనా ఉంటే నేరుగా తేల్చుకోండి. సీఎం జగన్‌ తీసుకున్న చర్యల వల్ల పవన్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. జగన్‌కేనా ఇగో ఉండేది. ఇగో.. అందరికీ ఉంటుందని తెలుసుకోవాలి. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి. సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు ఆపాలి. సీబీఐ అధికారుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఉండకూడదా?. ఈరోజు నేను చెబుతున్నా.. ఏ ఒక్క డైరెక్టర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి షూటింగ్‌ చేయరు. చిరంజీవి గారిని చూస్తే ఏడుపొచ్చింది. కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి ఆయన. దీనాతి దీనంగా చేతులు జోడించి మిమ్మల్ని అడిగారు. ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దు. చిరంజీవి సైతం మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడాలా? ఆయనకు ఏం తక్కువ. చేతులు జోడించి అడిగారంటే ఆయన బతుకుదెరువు కోసం కాదు.. ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం అడిగారు. నిన్ను ఎవరూ క్షమించడంలా. సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధిస్తే థియేటర్‌ వద్ద పల్లీలు అమ్మే వ్యక్తి నుంచి లైట్‌ బాయ్‌ వరకు అందరూ నాశనమైపోతారు’’ అని జేసీ ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని