Jeevitha Rajasekhar: తప్పు చేస్తే నడిరోడ్డుపై నిల్చోబెట్టి కొట్టాలి: సినీనటి జీవితా రాజశేఖర్‌

సోషల్‌ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు.

Updated : 19 May 2022 15:02 IST

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు. నటీనటులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఫిలిం ఛాంబర్‌ సభ్యులు హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో సినీ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా జీవిత మాట్లాడుతూ అసత్య కథనాలపై మండిపడ్డారు. తనకీ ఓ కుటుంబం ఉంటుందని.. ఇలాంటి వార్తలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?

‘‘ఇండస్ట్రీ ముఖ్యంగా మీడియా వాళ్లు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా షూటింగ్స్‌, ఇతర పనులు ఇలా మా కుటుంబం మొత్తం మా పనుల్లోనే ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటాను. ఇలా ఉన్నప్పటికీ మా కుటుంబం గురించి వచ్చినన్ని అసత్య వార్తలు మరెవరి మీద రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?.

ఆ కేసు కోర్టులో నడుస్తోంది.. నిజానిజాలు వస్తాయి

ఇటీవల ‘గరుడవేగ’ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ మాపై ఎన్నో ఆరోపణలు చేశారు. సినిమాకి వాళ్లు కొంత మొత్తమే ఖర్చుపెట్టారు. మిగతాది మేము ఆస్తులమ్ముకుని మరీ డబ్బు తీసుకువచ్చి సినిమా కోసం ఖర్చు పెట్టాం. కానీ, రిలీజ్‌ అయ్యాక.. సినిమాకి వచ్చిన డబ్బు మొత్తం వాళ్లే తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు ఇటీవల మీడియా ముందుకు వచ్చి ‘జీవిత రాజశేఖర్‌ రూ.26 కోట్లు మాకు ఎగ్గొట్టారు. మోసం చేశారు’ అని ఆరోపణలు చేశారు. ఆ వార్తలను మీడియా నాలుగు రోజులుపాటు ప్రసారం చేసింది. దానిపై నేను ఆయా మీడియా వాళ్లని అడగాను. ‘కోటేశ్వరరాజు, హేమ మాకు బ్లాంక్‌ చెక్‌ చూపించారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయి.

అలాంటి వార్తలతో 25 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా..

అంతేకాకుండా ఇటీవల నా కుమార్తెలపై ఏవేవో వార్తలు రాశారు. నా కుమార్తె వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా కొంతమంది థంబ్‌నెయిల్స్‌ పెట్టి వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని మీడియా హౌస్‌లు మాత్రమే ఇలా చేస్తున్నాయి. దయచేసి, మా కష్టాలను అర్థం చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేశామో లేదో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేశామని రుజువైతే నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండి. ఇలాంటి అసత్య వార్తల వల్ల గత 25 ఏళ్ల నుంచి నేను ఎంతో ఇబ్బందిపడుతున్నా. లీగల్‌ పోరాటం చేయొచ్చు కానీ, అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండదు. మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.

ఆ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు

ఇటీవల ‘శేఖర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా నా కుమార్తెలతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నేను ఓ నానుడి వాడితే.. దాన్ని వేరేలా అర్థం చేసుకుని ఆర్యవైశ్య వర్గం వారిని కించపరిచినట్లు వార్తలు వచ్చాయి. దానిపై చర్చా సమావేశం కూడా చేశారు. ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా మాటలతో ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి’’ అని జీవిత అన్నారు.

పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్‌ పాత్ర శూన్యం: ఆదిశేషగిరిరావు

అనంతరం ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఓటీటీ వచ్చాక వంద సమస్యలు మొదలయ్యాయని.. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రమే యూట్యూబ్‌లో పైరసీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలింఛాంబర్‌ యాంటీ పైరసీ విభాగం ఇతరుల చేతుల్లో ఉందని.. డబ్బున్నవాళ్లకే యాంటీ పైరసీ సెల్‌ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్‌ పాత్ర శూన్యం. నిర్మాత మండలికి కట్టుబాట్లు లేకుండా పోయాయి. నిర్మాతల మండలిలో చేసే తీర్మానాలు వేరు.. బయట జరిగేవి వేరు. నిర్మాతల మండలి కొంతమంది చేతుల్లోకి వెళ్లింది. ఓటీటీపై కూడా కేంద్రం సెన్సార్స్‌ ఉండాలి. కేన్స్‌ చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ నుంచి ఒక్కరూ వెళ్లలేదు’’ అని ఆదిశేషగిరిరావు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని