Shahid Kapoor: ఆ స్కూల్‌ అంటే నాకు అసహ్యం: షాహిద్‌ కపూర్‌

‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌గా విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్‌ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కి...

Published : 25 Apr 2022 14:06 IST

ముంబయి: ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌గా విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘జెర్సీ’. టాలీవుడ్‌ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ షాహిద్‌ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తండ్రి పాత్రలో షాహిద్‌ చక్కగా ఒదిగిపోయారని పలు సన్నివేశాల్లో ఆయన పండించిన భావోద్వేగాలు హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.

కాగా, తాజాగా షాహిద్‌ ఓ బాలీవుడ్‌ మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. వ్యక్తిగతంగా ‘జెర్సీ’ కథ తనకు బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం షాహిద్‌.. వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా తన స్కూలింగ్‌ గురించి మాట్లాడారు. ‘‘మాది దిల్లీ. నాకు పదేళ్ల వయసు వచ్చేవరకూ మా కుటుంబం అక్కడే ఉంది. దాంతో నా స్కూలింగ్‌ దిల్లీలోనే ప్రారంభమైంది. అక్కడ స్కూల్స్‌ నాకెంతో ఇష్టం. మా టీచర్లు సరదాగా ఉండేవారు. మమ్మల్ని అర్థం చేసుకునేవారు. ప్రతివిషయంలో ప్రోత్సహించేవారు. విషయం ఏదైనా సరే అర్థమయ్యేలా వివరించేవారు. అమ్మ కెరీర్‌ని దృష్టిలో ఉంచుకుని మేము ముంబయికి వచ్చేశాం. నా చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ముంబయిలోని స్కూల్‌లో నన్ను చేర్పించారు. ఆ స్కూల్‌ అంటే నాకెప్పటికీ అసహ్యమే. ఎందుకంటే టీచర్లు నన్ను వేధించేవారు. వాళ్లు నాతో సరిగ్గా ఉండేవాళ్లు కాదు. అందుకే ఆ స్కూల్‌ డేస్‌ నాకెప్పటికీ నచ్చవు. ఇలా చెబుతున్నందుకు క్షమించండి. కానీ నేను చెప్పేది మాత్రం నిజం’’ అని షాహిద్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని