Jhansi Season 2: ఝాన్సీ: సీజన్‌2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచంటే?

Jhansi Season 2: అంజలి కీలక పాత్రలో నటించిన ‘ఝాన్సీ సీజన్‌2’ త్వరలో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 03 Jan 2023 13:52 IST

హైదరాబాద్‌: అంజలి (Anjali), చాందినీ చౌదరి, ఆదర్శ్‌ బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’ (Jhansi). డిస్నీ+హాట్‌స్టార్‌ స్పెషల్‌గా అక్టోబరులో స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌ పర్వాలేదనిపించింది. అంజలి నటన, ట్విస్ట్‌లు మెప్పించాయి. ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని అప్పట్లో మేకర్స్‌ చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు ఝాన్సీ సీజన్‌-2 (Jhansi Season 2) ను నెటిజన్ల కోసం తీసుకున్నారు. జనవరి 19వ తేదీ నుంచి సీజన్‌2 స్ట్రీమింగ్‌ కానుందని డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) తెలిపింది. ఈ మేరకు కొత్త సీజన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

తొలి భాగం కథ ఇది: సంకీత్‌ (ఆదర్శ్‌ బాలకృష్ణ)కు తన కుమార్తె మేహ అంటే అమితమైన ప్రేమ. ఉద్యోగంలోపడి కూతురిని బాగా చూసుకోవడంలేదనే కారణంతో భార్య సాక్షి (సంయుక్తా)కి దూరంగా ఉంటాడు. మేహను తీసుకుని ఓసారి కేరళకు విహార యాత్ర వెళ్తాడు సంకీత్‌. ప్రమాదంలో పడబోతున్న మేహను అక్కడే ఉన్న ఓ అమ్మాయి (అంజలి) రక్షిస్తుంది. ఆమెకు తానెవరో, తన గతం ఏంటో తెలియదు. కూతురిని కాపాడిందనే కృతజ్ఞతాభావంతో ఆ అమ్మాయిని సంకీత్‌ తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆమెకు ఝాన్సీ అనే పేరు పెడతాడు. ఝాన్సీ మామూలు మనిషికాగానే ఆమెతో ఓ బొటిక్‌ను ప్రారంభిస్తాడు. అప్పటికే లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉండటంతో ఝాన్సీ ముందు పెళ్లి ప్రపోజల్‌ ఉంచుతాడు. ఇదిలా ఉంటే, గతంలో జరిగిన సంఘటలనకు సంబంధించిన దృశ్యాలు ఝాన్సీ కళ్లలో అప్పుడప్పుడూ మెదులుతుంటాయి. బాలికలు, మహిళలకు అన్యాయం జరిగితే సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుంది. ఏ ఆధారాల ద్వారా ఝాన్సీ తన గతం గురించి ఎలా తెలుసుకుంది? ఆ క్రమంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంది? సంకీత్‌తో పెళ్లికి ఓకే చెప్పిందా, లేదా? అనేది మిగతా కథ. ఇప్పుడు ఈ కథను కొనసాగింపుగా సీజన్‌-2 రాబోతోంది.

ఇదీ చదవండి..: ఝాన్సీ.. అంజలి నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని