Jhansi 2 review: రివ్యూ: ఝాన్సీ 2.. అంజలి నటన ఎలా ఉందంటే?

అంజలి, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’. గతేడాది విడులైన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘ఝాన్సీ సీజన్‌ 2’ ఇటీవల రిలీజ్‌ అయింది. ఎలా ఉందంటే?

Updated : 22 Jan 2023 17:29 IST

Jhansi 2 web series review సిరీస్‌: ఝాన్సీ సీజన్‌ 2; నటీనటులు: అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్‌ బాలకృష్ణ, సంయుక్తా హర్నాద్‌, తాళ్లూరి రామేశ్వరి, చైతన్య సాగిరాజు, రాజ్‌ అర్జున్‌ తదితరులు; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; కూర్పు: ఆంథోనీ; ఛాయాగ్రహణం: అర్వి; నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్‌, కె.ఎస్‌. మధుబాలన్‌; దర్శకత్వం: తిరు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

నటి అంజలి (Anjali) ప్రధాన పాత్రలో తెరకెక్కి, గతేడాది విడుదలైన సిరీస్‌ల్లో ‘ఝాన్సీ’ ఒకటి. దానికి కొనసాగింపుగా రూపొందిన ‘ఝాన్సీ 2’ ప్రస్తుతం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, సీజన్‌ 2 ఎలా ఉంది? అసలు కథేంటంటే? (Jhansi 2 web series review)

ఇదీ కథ: వేశ్య గృహం నుంచి తప్పించుకున్న ఝాన్సీ (అంజలి)ని బిల్లూ (వేశ్య గృహం నడిపే వ్యక్తి) గ్యాంగ్‌ గోవాలో పట్టుకుంటుంది. తనకు గతం గుర్తులేకపోవడంతో ఏం జరిగిందో చెప్పాలంటూ ఝాన్సీ వారిని గన్‌తో బెదిరిస్తుంది. కట్‌ చేస్తే, ఫ్లాష్‌బ్యాక్‌ తెరపైకి వస్తుంది. ప్రాణ స్నేహితురాలైన బార్బీ (చాందినీ చౌదరి).. మహిత (ఝాన్సీ అసలు పేరు)పై ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది? చీకటి సామ్రాజ్యానికి లీడర్‌ అయిన కాలేబ్‌ (రాజ్‌ అర్జున్‌) తనయుడు ఈథన్‌ (ఆదిత్య శివ్‌పింక్‌)ను ఝాన్సీ ఎందుకు హత్య చేసింది? ఆమెకు పుట్టిన బిడ్డ ఏమైంది? అన్న కథాంశంతో సీజన్‌ 2 వచ్చింది.

ఎలా ఉందంటే? గతాన్ని మర్చిపోయిన ఝాన్సీ.. సంకీత్‌ (ఆదర్శ్‌ బాలకృష్ణ) అనే వివాహితుడికి దగ్గరవడం, ఝాన్సీతో ఓ బొటిక్‌ ప్రారంభించిన సంకీత్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవడం, గతంలో తనకు ఏదో ప్రమాదం జరిగినట్టు ఝాన్సీ మైండ్‌లో ‘రీల్స్‌’ తిరగడం, బాల్యంలోనే వేశ్య గృహంలో ఇరుక్కుపోయిన ఝాన్సీ, బార్బీల మధ్య స్నేహం చిగురించడం, అది ప్రేమగా మారడం, ఈ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులకు అమ్ముడుపోవడం వంటి సన్నివేశాలు సీజన్‌ 1లో కనిపించాయి. సీజన్‌ 2.. బిల్లూ గ్యాంగ్‌ ఝాన్సీని పట్టుకునే సీన్‌తో ప్రారంభమవుతుంది. తొలి ఎపిసోడ్‌ వేశ్య గృహంలో జరిగే కార్యకలాపాలతో సాగుతూ ఇబ్బందిగా అనిపిస్తుంది. రెండో ఎపిసోడ్‌ నుంచి కథలో కాస్త వేగం పెరుగుతుంది. సీజన్‌ 1లోని కొన్ని కీలక పాత్రలను ఇక్కడ రివీల్‌ చేసిన తీరు ఆసక్తిగా సాగింది. సీజన్‌ 1 చూడని వారికి ఆయా సీన్లు సాధారణంగా అనిపించొచ్చుకానీ చూసిన వారికి ఇక్కడి మలుపులు థ్రిల్‌ పంచుతాయి. 

తన కొడుకును చంపిందనే కారణంతో కాలేబ్‌.. ఝాన్సీని ఎలాగైనా మట్టుపెట్టానులనుకుంటాడు. ఆమెను వెతికి తీసుకురావాలని తన అనుచరులకు చెప్పడం, వారు ఆ ప్రయత్నంలో విఫలంకావడంవంటి దృశ్యాలను ఎన్నో సినిమాల్లో చూసుంటారు కాబట్టి ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, సంకీత్‌ భార్య అయిన పోలీసు అధికారిణి (సంయుక్తా హర్నాద్‌).. ఝాన్సీని నేరస్థురాలని అనుమానించి ఆమె కోసం గాలించే దృశ్యాలూ అంతగా ప్రభావం చూపించవు. తొలి సీజన్‌లో ఝాన్సీ బాల్యం నుంచి యవ్వనం దశ వరకు చూపిస్తే రెండో సీజన్‌లో ఆ తర్వాతి దశను చూపించినట్టుంది. వర్తమానం కంటే గతం ఎక్కువగా కనిపించడంతో కథలో క్లారిటీ మిస్‌ అయిందనే భావన కలుగుతుంది. స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే ఈ సీజన్‌ మరోస్థాయిలో ఉండేది. నేరుగా రెండో సీజన్‌ను చూస్తే ‘ఝాన్సీ’ని అర్థం చేసుకోవడం కష్టమే. దీనికి మరో సీజన్‌ ఉన్నట్టు క్లైమాక్స్‌లో హింట్‌ ఇచ్చారు.

ఎవరెలా చేశారంటే? తొలి సీజన్‌తో పోలిస్తే అంజలి నటనలో పరిణితి కనిపించింది. మహితగా గ్లామర్‌ రోల్‌లో, ఝాన్సీగా సీరియస్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. పోరాటాల్లోనూ తన మార్క్‌ చూపింది. సీజన్‌ 1తో పోలిస్తే 2లో చాందినీకి స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఉంది. విలన్‌ పాత్రధారులు ఫర్వాలేదనిపిస్తారు. ‘నిజం’ చిత్రంలో కథానాయకుడు మహేశ్‌బాబు తల్లి పాత్ర పోషించిన తాళ్లూరి రామేశ్వరి ఇందులోనూ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ ప్లే చేశారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన నేపథ్య సంగీతం సీన్‌లను హైలెట్‌ చేసింది. విజువల్స్‌, ఎడిటింగ్‌ ఫర్వాలేదు. తిరు టేకింగ్‌ ఓకే.

బలాలు: + అంజలి నటన; + సీజన్‌ 1లోని ట్విస్ట్‌లు రివీల్‌ అయిన తీరు

బలహీనతలు: - తొలి ఎపిసోడ్‌; - కొన్ని సన్నివేశాల్లో స్పష్టత లోపించడం

చివ‌రిగా: ‘ఝాన్సీ’ గతం ఈసారి ఆసక్తికరం 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని