Updated : 25 Jun 2021 16:27 IST

Jiivi Review: జీవి రివ్యూ

చిత్రం: జీవి; నటీనటులు: వెట్రి, కరుణాకరన్‌, మోనికా, అనిల్‌ మురళి, టైగర్‌ గార్డెన్‌ తంగదురై, రోహిణి, మిమి గోపి, బోస్కీ తదితరులు; సంగీతం: కె.ఎస్‌.సుందర మూర్తి; సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కుమార్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌; నిర్మాత: ఎం.వెల్లపాండియన్‌, సుధాలాయికన్‌ వెల్ల పాండియన్‌, సుబ్రమణియన్‌; రచన: బాబు తమిళ‌; దర్శకత్వం: వి.జె.గోపీనాథ్‌; విడుదల: ఆహా

సినిమాలో కనిపించే కథానాయకుడు స్టార్‌ హీరో కాకపోవచ్చు.. భారీ బడ్జెట్‌తో తీయకపోవచ్చు.. పేరున్న నటీనటులు తెరపై కనిపించకపోవచ్చు.. కానీ, ఆద్యంతం ఆకట్టుకునే కథా, కథనాలు ఉంటే చాలు ప్రేక్షకుడు ఆ చిత్రాన్ని ఆదరిస్తాడు. అలా అలరించే చిత్రాల్లో థ్రిల్లర్‌ జోనర్‌ ఒకటి. ఈ జాబితాలో తమిళంలో వచ్చిన చిత్రమే ‘జీవి’. చిన్న చిత్రంగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. తాజాగా తెలుగులో ‘ఆహా’ ఓటీటీ వేదికగా అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఉన్న థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఏంటి?

కథేంటంటే: శ్రీనివాస్‌(వెట్రి) ఒక పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కి వచ్చి జ్యూస్‌ షాపులో పనిచేస్తుంటాడు. అతని షాపు పక్కనే స్నేహితుడు మణి(కరుణాకరన్‌) టీ మాస్టర్‌గా కూడా పనిచేస్తుంటాడు. శ్రీనివాస్‌ పెద్దగా చదుకోకపోయినా పుస్తక పఠనం అంటే ఎంతో ఆసక్తి. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటాడు. అతను పనిచేస్తున్న జ్యూస్‌ షాప్‌ ఎదురుగా మరో దుకాణంలో ఆనంది(మోనికా) పని చేస్తుంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే, ఆనంది కుటుంబ సభ్యులు డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇంకొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. ఈ విషయంలోనే శ్రీనివాస్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలనుకుంటాడు. తాను అద్దెకు ఉంటున్న యజమాని లక్ష్మి(రోహిణి) ఇంట్లో నగలు దొంగతనం చేయాలనుకుంటాడు. మణితో కలిసి తన పథకాన్ని అమలు చేస్తాడు. శ్రీనివాస్‌ దొంగతనం చేసిన తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి?అతను పోలీసులకు దొరికిపోయాడా? లక్ష్మి జీవితంలో ఎదురైన సంఘటనలే శ్రీనివాస్‌ జీవితంలో ఎందుకు ఎదురయ్యాయి?తన తెలివి తేటలతో వాటిని అతను ఎలా అధిగమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు గతంలో వారికి ఎదురైన అనుభవాల గురించి ఒకరికొకరు చర్చించుకోవడం సహజం. అయితే, గతంలో ఒకరికి జరిగిన సంఘటనలే వర్తమానంలో మరొకరికి జరుగుతుంటే?ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడన్నదే ‘జీవి’ కథ. దర్శకుడు సినిమా మొదలవగానే ఒక షాట్‌ చూపిస్తాడు. కథానాయకుడు ఆటోలో కూర్చొని అలా బయటకు చూస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి కారులో నుంచి వాటర్‌ బాటిల్‌ రోడ్డుపై పడేస్తాడు. ఆ రోడ్డుపై వెళ్లే వాహనాల టైర్లకు తగిలి, అది అటూ ఇటూ వెళ్లిపోతూ, చివరకు కొన్ని వాహనాలు దాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోతాయి. ఈ ఒక్క సీన్‌ చాలు సినిమాలో కథానాయకుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనబోతున్నాడో చెప్పడానికి. ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన శ్రీనివాస్‌ ఊళ్లో స్నేహితులతో కలిసి జులాయిగా తిరగడం, తల్లిదండ్రుల కోరిక మేరకు హైదరాబాద్‌ వచ్చి వివిధ పనులు చేయడం, చివరకు జ్యూస్‌ సెంటర్‌లో చేరడం,  మధ్యలో ఆనందితో ప్రేమ.. ఇలా ప్రథమార్ధం సాగుతుంది. కథలోకి వెళ్లడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నాడు. ముఖ్యంగా శ్రీనివాస్‌-ఆనంది లవ్‌ ట్రాక్‌ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అయితే, లక్ష్మి ఇంట్లో దొంగతనం చేయాలన్న ఆలోచన శ్రీనివాస్‌కు వచ్చిన దగ్గరి నుంచి కథలో సీరియెస్‌నెస్‌ మొదలవుతుంది. ఆ దొంగతనం కూడా శ్రీనివాస్‌ తన తెలివి తేటలతో చాలా చాకచక్యంగా చేస్తాడు. పోలీసుల రాకతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ మొదలవుతుంది.

లక్ష్మి జీవితంలో జరిగిన సంఘటనలే మళ్లీ పునరావృతమై తన జీవితంలో జరుగుతున్నట్లు శ్రీనివాస్‌ గుర్తించడంతో వచ్చే విరామ సన్నివేశాలతో ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. ఒకవైపు దొంగతనం కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా? అని శ్రీనివాస్‌ ఆలోచిస్తుంటడటం, అనేక పుస్తకాలు చదవటం వల్ల వచ్చిన విషయ పరిజ్ఞానం వల్ల పోలీసులు ఎలా కేసును డీల్‌ చేస్తారో ముందే పసిగట్టడం తదితర సన్నివేశాలతో ద్వితీయార్ధం సాగుతుంది. లక్ష్మి సోదరుడు కిరణ్‌ రాకతో కథ మరో మలుపు తీసుకుంటుంది. అసలు కిరణ్‌ విషయం తెలిసిన తర్వాత కథానాయకుడు ఏం చేశాడన్నది క్లైమాక్స్‌. దాన్ని కూడా రసవత్తరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. సారూప్య సంఘటన శాస్త్రం గురించి హీరో వివరిస్తూ.. దాని వల్ల జరిగే పరిణామాలు.. దాన్ని అడ్డుకోవడం ఎలా అనేది తెలియజేస్తూ వచ్చే సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. ప్రతీ సీన్‌ను దర్శకుడు, కథా రచయిత సామాన్య ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. సినిమా చూసిన తర్వాత మంచి థ్రిల్లింగ్‌ మూవీ చూశామన్న అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. కథలోని పాత్రలకు న్యాయం చేసేలా క్లైమాక్స్‌ ఉంటుంది.

ఎవరెలా చేశారంటే: ‘జీవి’లో కనిపించే నటీనటుల్లో ఒకరిద్దరు మినహా పెద్దగా ఎవరూ తెలియదు. అయితే, ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కథానాయకుడు వెట్రి ఏ మాత్రం బెరుకులేకుండా ప్రతి సన్నివేశాన్ని రక్తికట్టించాడు. కథానాయిక పాత్ర పరిమితం. శ్రీనివాస్‌ స్నేహితుడిగా చేసిన కరుణాకరన్‌ అక్కడక్కడా నవ్వించాడు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కె.ఎస్‌. సుందరమూర్తి నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేసింది. ఉన్నవి రెండు పాటలే. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. ప్రవీణ్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. శ్రీనివాస్‌ గదిలో తిరిగే ఫ్యాన్‌, గడియారం, కాకులు ఎగరడం ఇలా ప్రతి చిన్న ఎలిమెంట్‌నూ కథకు అన్వయమయ్యేలా చూపించారు. ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ ఓకే. ఓటీటీలో వచ్చింది కాబట్టి, పాటలు స్కిప్‌ చేసేస్తారు. బాబు తమిళ్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తది. ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు కాలాల్లో ఒకే రకమైన సంఘటనలు జరగడమన్నది కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా రాసుకున్నాడు. వి.జె.గోపీనాథ్‌ ఎలాంటి తికమకా లేకుండా ‘జీవి’ని తెరకెక్కించాడు. తెలిసిన నటీనటులు ఉంటే, ఈ కథ మరో స్థాయిలో ఉండేదేమో.

బలాలు బలహీనతలు
+ కథా, కథనం - లవ్‌ట్రాక్‌
+ నటీనటులు - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: ‘జీవి’... అలరించే థ్రిల్లింగ్‌ మూవీ!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని