కొవిడ్‌పై పోరాటానికి జాన్‌ - ఊర్వశి సాయం!

ప్రస్తుతం దేశంలో COVID-19 మహమ్మారి రెండవ దశతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితితో దేశంలోని ఆసుపత్రిల్లో పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్స్ కొరత ఎర్పడింది. అంతేకాదు ఇలాంటి సమయంలో వైద్య సేవలు పొందాలన్నా చాలా కష్టంగా మారింది.  మరోవైపు కొవిడ్‌ రోగులకు ఏదైనా అవసరపడితే  సోషల్‌ మీడియాపై ఎక్కువ ఆధారపడుతున్నారు.

Published : 30 Apr 2021 22:51 IST

ముంబయి: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్‌ సృష్టించిన సంక్షోభంతో ఆసుపత్రిల్లో పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా అవసరమైతే అనేకమంది కొవిడ్‌ రోగులకు సోషల్‌ మీడియాపైనే ఆధారపడుతున్న సందర్భాలూ చూస్తున్నాం. దీంతో బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం తన సోషల్‌ మీడియా ఖాతాలను ఎన్జీవోలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్‌ రోగులకు సాయం గురించి తన ఖాతా నుంచి పోస్ట్‌ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశం చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌, కొవిడ్ వ్యాక్సిన్‌, కొన్ని సార్లు ఆహారాన్ని కూడా పొందలేని ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. ఇలాంటి వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మనదేశంలో ఉన్న పరిస్థితిని చూసి నేను, నా కుటుంబం నిత్యావసర వస్తువులు, కొన్ని పడకలను అందించాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ.. మిమ్మల్ని, మీ కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోండి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. 

ఇక బాలీవుడ్‌ నటి  ఊర్వశి రౌతేలా సైతం ఉత్తరాఖండ్‌కి  27 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లని విరాళంగా ఇచ్చింది. ‘‘ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుట్టాను. దేశ రాజధాని, ఇతర ప్రాంతాలలోని అనేక ఆసుపత్రుల్లో కొవిడ్‌తో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు సరిపడాలేవు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కొవిడ్‌ చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. అందుకే నా వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. కొవిడ్‌ సంక్షోభంతో ఉన్న మన దేశానికి సహాయం చేయాలని అందరినీ అభ్యర్థిస్తాను. భవిష్యత్తులో ఇంకా చాలా ఎక్కువ సాయం చేయాలనే ఆలోచన నాకు ఉంది. ఇలాంటి సమయంలో దేశానికి మద్దతుగా నిలుస్తా’’ అని తెలిపింది. ఊర్వశి రౌతేలా ప్రస్తుతం ‘బ్లాక్‌ రోజ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. సంపత్‌ నంది అందించిన కథతో మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. గత ఏడాది అజయ్‌ లోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్జిన్‌ భానుప్రియ’తో ప్రేక్షకుల్ని అలరించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని