John Abraham: నేను రూ.299 నటుడ్ని కాదు.. బిగ్‌ స్క్రీన్‌ స్టార్‌ని: జాన్‌ అబ్రహం

వెండితెరపై స్టార్‌ నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన తారలందరూ ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కథ నచ్చితే మొహమాటం లేకుండా వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకు పచ్చజెండా....

Published : 25 Jun 2022 09:18 IST

ఓటీటీ ఎంట్రీపై బాలీవుడ్‌ నటుడు వైరల్‌ కామెంట్స్‌

ముంబయి: వెండితెరపై స్టార్‌లుగా ఓ వెలుగు వెలిగిన, వెలుగుతున్న తారలు ఇప్పుడు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. కథ నచ్చితే వెబ్‌సిరీస్‌ల్లో నటించేందుకూ పచ్చజెండా ఊపుతున్నారు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం (John Abraham) ఓటీటీ ఎంట్రీపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాను రూ.299 నటుణ్ని కాదని, బిగ్‌ స్క్రీన్‌ స్టార్‌ని అన్నాడు. ఇటీవల ‘ఎటాక్‌’ (Attack)తో పరాజయాన్ని అందుకున్న జాన్‌ త్వరలో ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ (EK Villain Returns)తో రాబోతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో జాన్‌ అబ్రహం ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కెరీర్‌ ఎలా ప్రారంభమైంది? చేస్తున్న సినిమాలు? తదితర అంశాలపై మాట్లాడాడు. ఈ క్రమంలో విలేకరి.. ‘‘బాలీవుడ్‌లో చాలామంది ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు వస్తారు?’’ అని అడిగారు. దానికి జాన్‌ స్పందిస్తూ ‘‘నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోని. వెండితెరపైనే నా సినిమాలు ఆడాలనుకుంటాను. అక్కడే నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతానికి నేను వెండితెర కోసమే సినిమాలు చేయాలనుకుంటున్నా. రూ.299, రూ.499కి అందరికీ అందుబాటులో ఉండటం నాకిష్టం లేదు’’ అని అన్నాడు. దీంతో ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌, దక్షిణాది సినిమాల్లో నటించడంపై గతంలో జాన్‌ అబ్రహం చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. బాలీవుడ్‌ ఎప్పటికీ నంబర్‌ వన్‌ అని, తాను బాలీవుడ్‌ హీరోనని, ఇతర చిత్రపరిశ్రమల సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అప్పుడు కామెంట్స్‌ చేశాడు జాన్‌. ఇప్పుడు ఓటీటీ మీద ఇలాంటి కామెంట్లు చేశాడు. సినిమాల విషంయలో జాన్‌ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అని బాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని