Johnny Depp: డిస్నీ వరల్డ్‌లోకి జానీ డెప్‌.. రూ.2,535 కోట్ల ఆఫర్‌ నిజమేనా?

జాక్‌ స్పారో.. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సినిమాలు చూసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.

Published : 29 Jun 2022 02:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జాక్‌ స్పారో.. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సినిమాలు చూసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. విచిత్ర గెటప్‌, విభిన్న నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసి జాక్‌ స్పారోగా అలరించిన నటుడు జానీ డెప్‌(Johnny Depp). ఈ హాలీవుడ్‌ నటుడి గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త చర్చనీయాంశమైంది. అదేంటంటే, ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాల నిర్మాణ సంస్థ డిస్నీ తన చిత్రాల్లో జానీ తిరిగి నటించేందుకు అతనికి ఏకంగా రూ.2,535 కోట్లను ఆఫర్‌ చేసిందట. గత కొన్ని రోజులుగా ఈ వార్త తెగ వైరల్‌ అయింది. తాజాగా దీనిపై జానీ డెప్‌ ప్రతినిధులు స్పందించారు. ఇవన్నీ కల్పిత వార్తలనీ కొట్టేపారేశారు. డిస్నీ నుంచి తమ హీరోకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

కొన్ని రోజులు కిందట జానీ డెప్‌ భార్య, నటి అంబర్‌ హియర్డ్‌ను అతడిపై గృహహింస ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో డిస్నీ అతడిని దూరం పెట్టింది. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సహా ఇతర ప్రాజెక్టుల నుంచి అతడిని తప్పించింది. గృహ హింస ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ జానీ డెప్‌కోర్టును ఆశ్రయించగా, అతడిని అనుకూలంగా తీర్పు వచ్చింది. అంబర్‌ హర్డ్‌ 10.35 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ క్రమంలో జానీ డెప్‌నకు డిస్నీ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని, రూ.2,535 కోట్ల పారితోషికం ఆఫర్‌ చేసిందని వార్తలు వచ్చాయి. జానీడెప్‌-అంబర్‌ హియర్డ్‌ తొలిసారి ‘ది రమ్‌ డైరీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి మొదలైన వారి స్నేహం ప్రేమగా, కొన్ని రోజులు ఇద్దరూ సహజీవనం చేశారు. 2015లో ఇరువురు వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాది గడవక ముందే జానీడెప్‌పై గృహ హింస ఆరోపణలు చేస్తూ అంబర్‌ హియర్డ్‌ కేసు ఫైల్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని