Thug Life: కమల్‌ హాసన్‌ ‘థగ్‌ లైఫ్‌’ సెట్‌లో ప్రమాదం.. నటుడికి గాయం

‘థగ్‌ లైఫ్‌’ సెట్‌లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మలయాళ నటుడు జోజు జార్జ్‌ గాయపడ్డారు.

Published : 13 Jun 2024 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌హాసన్‌ హీరోగా దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌ (Joju George) కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్‌లో ప్రమాదం జరగ్గా అందులో ఆయన గాయపడ్డారు.

ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ పుదుచ్చేరిలో జరుగుతోంది. హెలికాప్టర్‌లో జరిగే హైరిస్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో జార్జ్‌ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని చిత్రబృందం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు ఎడమపాదం ఫ్రాక్చర్‌ అయిందని కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో జోజు జార్జ్‌ లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో పడింది మూవీ యూనిట్‌.

ఇటీవల జరిగిన ‘భారతీయుడు2’ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ జరిగేటప్పుడు అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ‘భారతీయుడు2’ సెట్‌లో జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తు ముగ్గురు మరణించారని ఆయన బాధపడ్డారు. మళ్లీ ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’ సెట్‌లో ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) విషయానికొస్తే.. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కుతుంది. ‘నాయకన్‌’ లాంటి హిట్‌ తర్వాత కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో 36 సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష కథానాయికగా నటిస్తుండగా గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని