Updated : 20 May 2022 10:58 IST

NTR: ‘విశ్వామిత్ర’ టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎన్టీఆర్‌ నట ప్రయాణమిదీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. అందుకే ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగిన ఈ యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు చూద్దాం..

 1. తారక్‌ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో చదివారు. సెయింట్‌ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.
 2. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు. అదే ఆయన స్క్రీన్‌ నేమ్‌గా స్థిరపడింది.
 3. బాల రామాయణం (1997) సినిమా సమయంలో దర్శకుడు గుణశేఖర్‌ను ఎన్టీఆర్‌ ముప్పుతిప్పలు పెట్టారట. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన విల్లును విరగ్గొట్టడం, వానర వేషం వేసిన పిల్లల తోకలు లాగడం వంటివి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యేవారట.
 4. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’. ఈ సినిమాకు రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకున్నారట. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
 5. సగటు సినీ ప్రేక్షకుడితోపాటు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ను ఇష్టపడుతుంటారనే విషయం తెలిసిందే. ఆయన బాల్యంలో ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ‘యమదొంగ’, ‘కంత్రి’, ‘అదుర్స్‌’ ‘నాన్నకు ప్రేమతో’, ‘రభస’ తదితర సినిమాలతో గాయకుడిగానూ తనదైన ముద్రవేశారు.
 6. ‘బాద్‌షా’లో తన తాత ఎన్‌.టి.రామారావు పేరును, ‘నాన్నకు ప్రేమతో..’లో  కొడుకు అభయ్‌రామ్‌ పేరు కలిసేలా అభిరామ్‌ అని తన పాత్రలకు పేరు పెట్టుకున్నారు. అంతేకాదు, ‘రభస’, ‘యమదొంగ’ సహా చాలా సినిమాల్లో అక్కడక్కడా తాత ఎన్టీఆర్‌ హావభావాలు పలికించారు.
 7. ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్‌’, ‘శక్తి’ చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా, ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయం చేశారు.
 8. సినిమా అంటే హీరో డైలాగ్‌లు, పంచ్‌లతో అదిరిపోవాలి. కానీ, ఇంటర్వెల్‌ వరకూ ఎన్టీఆర్‌ మాట్లాడని సినిమా ‘నరసింహుడు’.
 9. వి. వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఆది’ సినిమాలో భారీ డైలాగులు పెడితే చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్‌ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్‌ తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ సినిమా విడుదలై ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిందే.
 10. పూరీ జగన్నాథ్‌- ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన ‘ఆంధ్రావాలా’ ఆడియో విడుదల వేడుక రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో దాదాపు 10లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ భారీ ఈవెంట్‌ కోసం రైల్వే అధికారులు  ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
 11. జపాన్‌లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక తెలుగు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆయన నటించిన ‘బాద్‌షా’ సినిమా జపాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులంటే అక్కడి వారికి మహా ఇష్టం.
 12. నంబర్‌ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్‌. ఈ హీరో వినియోగించే వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసిన ఆయన హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ 9 ఉంటుంది.
 13. తన సినిమాలన్నింటిలో ‘అదుర్స్‌’ అంటే ఎన్టీఆర్‌కు ప్రత్యేక అభిమానం. అప్పటివరకు ఉన్న మాస్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చేసిన ఆ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ‘అదుర్స్‌’ సీక్వెల్‌ చేయాలనేది ఆయన కోరిక.
 14. మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. తరచూ ఈ పాట వింటుంటారు.
 15. ఎన్టీఆర్‌కు వంట చేయడమంటే భలే ఇష్టం. వెజ్‌- నాన్‌వెజ్‌, రోటి పచ్చడి, బిర్యానీ ఏదైనా వండేస్తారు.
 16. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో కొమురం భీమ్‌గా అలరించిన ఎన్టీఆర్‌ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. గురువారం విడుదలైన ఆ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా ఉంది. #NTR30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నారు.
Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని