RRR: స్ఫూర్తినిచ్చిన జక్కన్నకు థ్యాంక్స్‌.. రామ్‌ లేనిదే భీమ్‌ లేడు : ఎన్టీఆర్‌

రామ్‌చరణ్‌ లేనిదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లేదని, అల్లూరి సీతారామరాజు పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని ఎన్టీఆర్‌ అన్నారు. ఈ ఇద్దరు కలిసిన నటించిన చిత్రం పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR).

Published : 30 Mar 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్‌చరణ్‌ లేనిదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా లేదని, అల్లూరి సీతారామరాజు పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని ఎన్టీఆర్‌ అన్నారు. ఈ ఇద్దరు కలిసిన నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. చరణ్‌ నటించిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌ పోషించిన కొమురం భీమ్‌ పాత్రలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బందానికి, సినిమాను ఆదరించిన వారందరికీ ఓ లేఖ ద్వారా ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై మీరు చూపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రం నా కెరీర్‌లో లాండ్‌మార్క్‌గా నిలిచింది. పాత్రలో ఒదిగిపోయేలా స్ఫూర్తినిచ్చిన జక్కన్నకు (దర్శకుడు రాజమౌళి) థ్యాంక్స్‌. జక్కన్నా..  నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చి, పాత్రకు తగ్గట్టు నన్ను నీరులా మార్చావు. చరణ్‌.. నువ్వులేనిదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఊహించుకోలేను. నువ్వులేనిదే ఈ సినిమానే లేదు.. నా పాత్ర కొమురం భీమ్‌ కూడా అంత అద్భుతంగా వచ్చేది కాదేమో! అల్లూరి సీతారామరాజు పాత్రకు నవ్వు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు’’ అని ఎన్టీఆర్‌ అన్నారు.

భారతీయ సినిమాలోకి సుస్వాగతం!

‘‘అజయ్‌ దేవ్‌గణ్‌ సర్‌.. మీతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆలియా.. నటనలో నువ్వొక పవర్‌ హౌస్‌. నీ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఒలివియా, అలిసన్‌ డూడీ, రే స్టీవెసన్‌.. మీ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. భారతీయ సినిమాలోకి వీరికి సుస్వాగతం! అతిపెద్ద కల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను నిజం చేసినందుకు డీవీవీ దానయ్య గారు.. మీకు ధన్యవాదాలు. కీరవాణి.. మీ సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. సాంస్కృతిక, భాష, భౌగోళిక.. తదితర సరిహద్దుల్ని చెరిపేశారు. హృదయాల్ని హత్తుకునే మీ సంగీతం ప్రపంచవ్యాప్తంగా శ్రోతల్ని అలరించింది’’ 

రాబోయే తరాల వారూ మాట్లాడుకుంటారు..

‘‘విజయేంద్ర ప్రసాద్‌ గారు మీ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్లమంది సినీ అభిమానుల్ని మెప్పిస్తోంది. రాబోయే తరాల వారు ఈ కథ గురించి మాట్లాడుకుంటారు. సెంథిల్ (ఛాయాగ్రాహకుడు), సాబు సిరిల్‌ ( ప్రొడక్షన్‌ డిజైనర్‌), శ్రీనివాస్‌ మోహన్‌, శ్రీకర్‌ ప్రసాద్‌లతోపాటు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి థ్యాంక్స్‌. మీ అందరి వల్లే ఇంతపెద్ద భారీ ప్రాజెక్టు తెరకెక్కగలిగింది. ‘నాటు నాటు’ పాటకు కొత్త మాస్‌ స్టెప్పులు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘కొమురం భీముడో’ పాటను ఆలపించిన కాల భైరవకు, సినిమాకు సంబంధించి ప్రతి విభాగాన్ని చూసుకున్న కార్తికేయకు థ్యాంక్స్‌’’.

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామా..

‘‘విషెస్‌ తెలియజేసి, తమ మద్దుతు తెలిపిన భారతీయ సినిమా అభిమానులకు, ఇతర చిత్ర పరిశ్రమ నటులకు కృతజ్ఞతలు. మనమంతా ఒకటిగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. మనం ఒకటిగా ఉన్నప్పుడు ఇండియన్‌ సినిమా నంబర్‌ 1 గా ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఇండియన్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాగా కాకుండా వరల్డ్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామాగా మారేందుకు సహకరించిన భారతీయ మీడియాకు థ్యాంక్స్‌ అనే పదం సరిపోదు. నా అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ అభిమానులు నాకు ఎంతో అండగా నిలిచారు. మరిన్ని మంచి చిత్రాల ద్వారా మిమ్మల్ని అలరిస్తా’’ అని ఎన్టీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని