K Raghavendra Rao: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌.. తమ్మారెడ్డిపై రాఘవేంద్రరావు ఆగ్రహం

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ ప్రస్తుతం అమెరికాలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 10 Mar 2023 08:19 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj)పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఆస్కార్‌ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రపంచవేదికపై మన సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్‌ చేస్తారని ప్రశ్నించారు.

‘‘తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచవేదికలపై వస్తోన్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి. అంతేకానీ, రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్‌ ఏమైనా ఉన్నాయా? జేమ్స్‌ కామెరూన్‌, స్పీల్‌బర్గ్‌ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా?’’ అంటూ దర్శకేంద్రుడు (Raghavendra Rao) ప్రశ్నల వర్షం కురిపించారు.

‘బంగారుతల్లి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బడ్జెట్‌పై వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాన్ని రూ.600 కోట్లు పెట్టి తెరకెక్కించారని, ఇప్పుడు ఆస్కార్‌ (Oscars) ప్రమోషన్స్‌ కోసం ఆ చిత్రబృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆస్కార్‌ ప్రమోషన్స్‌కి పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు రూపొందించవచ్చన్నారు.  ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారడంతో తెలుగు సినీ ప్రియులు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సినీనటుడు నాగబాబు సైతం తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని