K.Viswanath: ‘కళా తపస్వి’.. ఆ పదం వినగానే భయం వేసింది!

తెలుగు సాహిత్య కళలను తన కథలుగా మలచుకొని.. అద్భుతమైన సినిమాలు తీసిన గొప్ప దర్శకుడు కె. విశ్వనాథ్‌ (K.Viswanath). ఆయన గతంలో పంచుకున్న సినిమా విశేషాలు. 

Updated : 03 Feb 2023 16:59 IST

తెలుగు సినిమాను ఒక స్థాయిలో నిలిపారు కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ (K.Viswanath). ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.(K.Viswanath is no more). ఆయన గతంలో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో తన మనసులోని పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.

గుంటూరు జిల్లా కదా మీది.. మీ బాల్యం ఎలా గడిచింది?

విశ్వనాథ్‌: అవును. నేను ఫస్ట్ క్లాస్‌ మా ఊళ్లో చదివాను. మొదటి తరగతి నుంచి మూడో తరగతికి ప్రమోట్ చేశారు. అప్పట్లో మాస్క్‌ పెట్టుకున్న వాళ్లని చూసినా నాకు భయం వేసేది. ఒకసారి సంతలో దొరికే మాస్క్‌ వేసుకుని ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. దెబ్బకు జ్వరం వచ్చింది. మా నాన్న నాకు సైకిల్‌ కొనిచ్చారు. దాని మీద తిరగడం అంటే ఇప్పుడు రోల్‌ రైడ్‌పై తిరిగినట్టే. ఇవన్నీ చిన్న విషయాలే.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి గుర్తులు.. నాకు పావురాలంటే చాలా ఇష్టం. వాటికోసం వెళ్లి మా నాన్నకు అబద్ధం చెప్పి తిట్లు తిన్న సందర్భాలెన్నో. 

కళాశాల చదువు ఎక్కడ సాగింది?

విశ్వనాథ్‌: గుంటూరులోని హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివాను. డిగ్రీ అవ్వగానే ఏం చేయాలని ఆలోచిస్తుంటే మాకు తెలిసిన వ్యక్తి అప్పుడే వాహిని స్టూడియో కొత్తగా ప్రారంభించారు. అందులో యువకులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. నన్ను పంపమని మా నాన్నను అడిగారు. మా నాన్న అంగీకరించారు. నేను జాయిన్‌ అయ్యాను.

దర్శకత్వం మీద మమకారం ఎప్పుడు పెంచుకున్నారు?

విశ్వనాథ్‌: నేను పెంచుకోలేదండీ. అన్నీ వాటంతట అవే జరిగాయి. నా జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదు. నేను సెకండ్ యూనిట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు వాళ్ల కంపెనీకి రమ్మని అడిగారు. వెళ్లలా వద్దా అని సందేహించా. చక్రపాణి గారు మాత్రం వెళ్లమని చెప్పారు. ‘దర్శకత్వం అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి అనేది కాదు.. కథను అరటిపండు ఒలిచి అందించినంత సులువుగా చెప్పాలి’ అన్నారు. కె.వి రెడ్డి సినిమా చూడు.. లైట్లు మార్చినట్టు ఉంటుందన్నారు (నవ్వుతూ).

‘తేనెమనసులు’ సినిమాకు అంతా మీరే చేశారటా? తొలి సినిమా చేసేటప్పుడు ఎలా అనిపించింది?

విశ్వనాథ్‌: మొత్తం అంటే మొత్తం కాదు. కానీ, మొత్తం(నవ్వుతూ) ఆ సినిమా కోసం అందరం కలిసి పనిచేశాం. అందులో ఎక్కువ బాధ్యత నేను తీసుకున్నాను. మొదటి సినిమా చేసేటప్పుడు నాకేం కొత్తగా అనిపించలేదు. ‘మూగమనసులు’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేశాను. అప్పటికే అనుభవం ఉండటంతో.. అదేం కొత్తగా అనిపించలేదు. అక్కినేని నాగేశ్వరరావుకి, మధుసూదనరావుకూ దేవుడు అంటే నమ్మకం లేదు. నేను మాత్రం నమ్ముతాను. ఫస్ట్ షాట్ ఎలా తీయాలో అర్థం కాలేదు. దేవుడు మీద తీస్తే కుదరదు. నాకు బాగా గుర్తు.. అద్దంతో మొదలుపెట్టాను. అద్దం లక్ష్మీ దేవీతో సమానం కదా. అందులో తల దువ్వుకుంటున్నట్లు సీన్‌ చేశాను. ‘శ్రీనివాస.. శ్రీనివాస’ అని అల్లు రామలింగయ్య పిలిచేలా పెట్టాను. దేవుళ్ల పేర్లు కలిసి వస్తాయని అలా చేశాను. 

బయటి కథలు ఎందుకు చేయరు అని అడిగేవాళ్లు ఉన్నారు. వారికి మీరిచ్చే సమాధానం?

విశ్వనాథ్‌: ఇదంతా భగవంతుడి కృప. నేను నిర్మాతకు కథలు చెప్తాను. అందులో వారికి ఏ కథకు నేను సెట్ అవుతానో వారినే చెప్పమని అడుగుతాను. కథ ఓకే అయితే మిగతా విషయాలు మాట్లాడుకునే వాళ్లం. బి.వి.ఎస్‌ రాజు.. నా కథలను ఉద్దేశిస్తూ మీ పాముల పుట్టలో నుంచి ఓ పాము బయటికి తీయండి అనేవారు. (నవ్వుతూ)

రామారావుతో తక్కువ సినిమాలు చేశారు? కారణం?

విశ్వనాథ్‌: నాలుగు చేశాను. మొదట్లో నాగేశ్వరరావు పార్టీ అని నాపై ముద్ర పడింది. రామారావుతో చేయడానికి కొందరు నిర్మాతలు కొన్ని సలహాలిచ్చారు. అవేంటంటే రామారావు దగ్గర నాగేశ్వరరావు పేరు తీయకు అని చెప్పారు. నాకు రామారావు ఎవరితో ఎలా ఉండేవారో తెలియదు. నాతో చాలా బాగా ఉండేవారు. నేను ఆయన్ని బ్రదర్‌ అనే వాడిని. నాతో అందరూ బాగుండే వాళ్లు. చిరంజీవి, మమ్మూటి అందరూ గురు శిష్య బంధంతో ఉండేవాళ్లు. 

శంకరాభరణం గురించి చాలా సార్లు చెప్పారు. మరోసారి చెప్పండి?

విశ్వనాథ్‌: సినిమా తీసిన తర్వాత మొదటి ఆరేడు రోజులు వెనకబడినట్లు అనిపించింది. సినిమా తీసేంత వరకే ఆలోచిస్తాను. తీశాక ఎలా పోతుందని ఆలోచించే వాడిని కాదు. నా సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఒకసారి ‘శంకరాభరణం ఎన్నిసార్లు చూశావు’ అని ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగాను. ‘ఐదారు సార్లు చూశాను’ అన్నాడు.. ఏం ఉందయ్యా అంటే ఏమో తెలీదు సర్‌. ఆ థియేటర్‌లో కూర్చుంటే గుడిలో కూర్చున్నట్టు ఉంటుందన్నారు. ఆ మాట కన్నా ఇంకేం ఉంటుంది. ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. నేను తీసిన సినిమాల్లో అదే కష్టమైందనుకోవచ్చు. అది సీతారామశాస్త్రికి  ఇంటి పేరులా మారింది. పాటలు రాసిన కవులందరికీ రుణపడి ఉన్నాను. ఆత్రేయ గారు నా తొలి సినిమాకు ఒక పాట రాశారు. 

పాటలకు పల్లవి రాసేవారుట? పౌరాణిక సినిమాలు తీయాలనే ఆలోచన ఎందుకు చెయ్యలేదు?

విశ్వనాథ్‌: వాటిని అబద్ధ పల్లవులు అంటాను నేను. కథ రాస్తూ ఓ లైన్‌ రాసేవాడ్ని అది బాగుందో లేదో కూడా తెలీదు. పౌరాణిక సినిమాలు తీయాలంటే కథలు తెలియాలి కదండీ.. తిక్కన ఎవరో తెలియకుండా ఆయన రాసిన వాటిని ఎలా తీస్తాం చెప్పండి. నాకు బాపు గారు అంటే చాలా ఇష్టం. వారితో పని చేయాలని అనుకునే వాడిని. 

మీ నిర్మాతలు ఎప్పుడైనా కథ మార్చాలని సూచించారా?

విశ్వనాథ్‌: లేదండీ. ఎవరూ చెప్పలేదు. కానీ ‘మాంగల్యానికి మరో ముడి’ అనే సినిమా తీసినప్పుడు ఇబ్బంది వచ్చింది. కథ మార్చి చూపించాలన్నారు. అలానే చేశా. నాకు ఈగో కాదు ముఖ్యం.. నీకు నాలుగు డబ్బులు వస్తే నాకు అంతకంటే ఏం కావాలన్నాను నిర్మాతతో. 

నటుల దగ్గర నుంచి ఇలా చేస్తే బాగుంటుందీ అనే పరిస్థితులు ఉన్నాయా?

విశ్వనాథ్‌: లేదండీ.. రాలేదు. నాకో చెడ్డ పేరు కూడా ఉంది. నేను చెప్పిందే చెయ్యాలంటాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఓ కథ అనుకున్నాక అది పేపర్ మీద రాస్తే కాదు.. చేసి చూపిస్తేనే బాగా వస్తుందని నమ్ముతాను. శంకరాభరణం సినిమా కోసం అక్కినేని నాగేశ్వరావు, శివాజీ గణేశన్‌ అని చాలా పేర్లు అనుకున్నా. చివరకు ఏ ఇమేజ్‌లేని వారిని పెట్టాలని నిర్ణయించుకున్నాను. హిందీలో 10 సినిమాలు తీశానంతే.  నాకు స్ఫూర్తి ఆ పరమేశ్వరుడే. నా సినిమాలోని పాటలు చూసి ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చి కలిసిన సందర్భాలున్నాయి.

నటుడిగా మీ అనుభవాలు ఏంటి?

విశ్వనాథ్‌: ‘శుభసంకల్పం’ సినిమాకు బాలసుబ్రహ్మణ్యం, కమల్‌హాసన్‌ నిర్మాతలు. ఆ సినిమాలో పాత్ర కోసం ఎవరి పేరు చెప్పినా వద్దు అనేవారు. ఒకరోజు సడెన్‌గా ఆ పాత్ర నువ్వే చేస్తున్నావన్నారు. అన్ని తెలుసు కాబట్టి ఆ పాత్రలో నటించడం నీకు కష్టం కాదన్నారు. నేను అంగీకరించి నటించాను. మంచి ఆదరణ లభించింది. బాలసుబ్రహ్మణ్యం, చంద్రమోహన్‌ ఇద్దరూ నాకు బంధువులు. 

సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి కదా.. ఆర్థికంగా కూడా లాభాలు వచ్చేవా?

విశ్వనాథ్‌: నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. నా వల్ల ఎంతోమంది నిర్మాతలు కోటీశ్వరులయ్యారు. కొందరు నాకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. అలా ఎగొట్టినవి చాలానే ఉన్నాయి. అయినా, నేనెప్పుడు ఎవరినీ ఏమీ అనలేదు. నా వల్ల ఒకరు బాగుంటే నాకు సంతోషమే. సినిమాల విషయంలో నేను బస్సు డ్రెవర్‌ని.. నా ప్రేక్షకులను అందులో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లాలి అదే నా లక్ష్యం. ‘శంకరాభరణం’ సినిమా తమిళ హక్కులు రూ.50వేలు పెట్టి కొనడానికి చాలామంది భయపడ్డారు. చివరకు మనోరమ కొన్నారు. ఆవిడకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి.

పుట్టపర్తిలో జరిగిన సంఘటన చెప్పండి?

విశ్వనాథ్‌: నాకు ‘కళాతపస్వి’ అని బిరుదు ఇచ్చారు. ఆ పదం వినగానే భయం వేసింది. వేదికపైకి వెళ్లి తపస్వి అనే పదానికి నేను సరికాదు. నాకూడా చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పాను. వెంటనే వేదికపై ఉన్న పెద్దాయన మైకు తీసుకుని తపస్వి అంటే తపస్సులు చేసే వాళ్లు మాత్రమే కాదు. చేసే పనిపై తపన ఉన్నవాళ్లు అని చెప్పారు.

మీరు ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎలా ఉండేది?

విశ్వనాథ్‌: ‘శంకరాభరణం’ సినిమాను చాలా మంది ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. నాకు తెలిసినంత వరకు ఒకాయన 96సార్లు చూశాడట. గొప్ప ప్రశంస ఏంటంటే.. నేను అమెరికా వెళ్లినప్పుడు ఒకావిడ కుటుంబంతో నా దగ్గరకు వచ్చి ‘మేము 30 సంవత్సరాలుగా ఇక్కడ మనసుతో బతుకుతున్నామంటే మీ సినిమాలే కారణం’ అని చెప్పింది. దానికి మించిన ప్రశంస ఏముంటుంది. నాకు ఏ ఆలోచన వచ్చినా.. ఏది చేసినా.. అన్నిటికీ స్ఫూర్తి భగవంతుడే.

నటీనటులను డీ గ్లామరైజ్‌ చెయ్యాలంటే భయపడ్డారా?

విశ్వనాథ్‌: లేదు. శోభన్‌బాబు ఎంతటి అందగాడో అందరికీ తెలుసు. ఆయన్ని ‘చెల్లెలి కాపురం’లో బూట్‌పాలిష్‌ అంత నల్లగా చూపించాం. దానికి శోభన్‌బాబు అంగీకరించాడంటే అదంతా ఆయన గొప్పతనం. అలాగే చిరంజీవి, కమల్‌హాసన్‌, విజయశాంతి అందరూ అటువంటి పాత్రలు చేశారు. అదంతా వాళ్ల గొప్పతనం.

మీరు అందుకున్న పురస్కారాల్లో మీ మనసుకు హత్తుకున్నది ఏది?

విశ్వనాథ్‌: నాకు ప్రజల స్పందనే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్లు వచ్చి నా సినిమాల గురించి చెబుతుంటే ఒళ్లు పులకరిస్తుంది. నటీనటులే కాదు పెద్ద గవర్నమెంట్‌ ఉద్యోగులు కూడా నా సినిమాల్లో నటించాలని కోరుకునేవారు. ఇలాంటివి వింటుంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. వాళ్ల మాటలు అభిమానంతో మనసులో నుంచి వస్తాయి. 

ఏ దర్శకుడినైనా చూసినప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలకు వారసులు ఉన్నారని అనుకొన్నారా?

విశ్వనాథ్‌: ఒక దర్శకుడు మరో డైరెక్టర్‌లా ఎప్పుడూ సినిమాలు తీయలేరు. ఎవరి శైలి వారిదే. సినీ రంగంలో జాక్‌పాట్‌ కొట్టినట్లు ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. ఇందులోనూ పైకి రానీకుండా చెయ్యడానికి చాలా రాజకీయాలు ఉంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని